– 7 ఏళ్లుగా వడ్లు నువ్వే కొంటున్నానన్నవ్ కదా…
– గల్లీలో ముఖం చూపలేక ఢిల్లీలో రాజకీయాలు చేయాలనుకుంటున్నవా?
– వడ్ల కొనుగోలు కేంద్రాలు ఎందుకు మూసివేసినవో ప్రజలకు సమాధానం చెప్పాలి
– కేసీఆర్ కుట్రలన్నింటినీ బట్టబయలు చేస్తాం
– వేములవాడ మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజం
వడ్ల కొనుగోలు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘కేసీఆర్.. 7 ఏళ్లుగా నువ్వే వడ్లు కొంటున్నట్లు ఫోజులు కొట్టినవ్ కదా…. కేంద్రం ప్రమేయమే లేదన్నవ్ కదా…. మరి ఇప్పుడెందుకు వడ్లు కొనకుండా రైతులను ఎందుకు గోస పెడుతున్నవ్? చేతనైతే వడ్లు కొను… చేతగాకుంటే తక్షణమే గద్దె దిగపో ’’అని హెచ్చరించారు.
వేములవాడలో ఈరోజు బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎందుకు మూసివేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ నేతల తీరుపై ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. గల్లీలో ముఖం చూపలేక ఢిల్లీ వెళ్లి రాజకీయ డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్లోని ముఖ్యాంశాలు…
రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో కోతలు మొదలైనయ్. వడ్లను రైతులు తమ ఇండ్ల వద్ద నిల్వ చేసుకునే పరిస్థితి లేదు. కళ్లాల వద్ద నున్న ధాన్యాన్ని అమ్ముకోవడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. దీనిని అవకాశంగా తీసుకుని బ్రోకర్లు తక్కువ ధరకే వడ్లను కొనుగోలు చేస్తున్నారు. మరో 20 రోజులు దాటితే రైతుల నుండి వడ్లన్నీ బ్రోకర్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఈ సమయంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతుల నుండి వడ్లు కొనాల్సిన కేసీఆర్ ప్రభుత్వం …. ఆ బాధ్యతను విస్మరించి ఢిల్లీ పోయి రాజకీయాలు చేయడం సిగ్గు చేటు.
బ్రోకర్ల చేతిలోకి వడ్లన్నీ వెళ్లిన తరువాత కేసీఆర్ ప్రభుత్వం వడ్లను కొనే ప్రమాదం లేకపోలేదు. ఎందుకంటే బ్రోకర్టకు మేలు చేయడమే పనిగా పెట్టుకున్న కేసీఆర్… వడ్లన్నీ వాళ్ల చేతుల్లోకి వెళ్లిన తరువాతే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు సిద్ధమైనట్లు సమాచారం ఉంది. అందుకోసం వందల కోట్ల రూపాయలు టీఆర్ఎస్ చేతులు మారబోతున్నయ్. రైతులంతా కేసీఆర్ కుట్రలను గమనించాలని కోరుతున్నా.
రాష్ట్రంలో 2700 రైస్ మిల్లులుంటే… అందులో 1700 రారైస్ మిల్లులు ఉన్నయ్. వాళ్లంతా వడ్లు సేకరించి ముడి బియ్యంగా మార్చేందుకు సిద్ధంగా ఉన్నరు. రైస్ మిల్లులు సిద్ధంగా ఉంటే కేసీఆర్ కు వచ్చిన నొప్పేంది? బ్రోకర్లతో కుమ్కక్కై రైస్ మిల్లర్లను కూడా బదనాం చేసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారు. రైతులు పంట ఎందుకు కొనడం లేదని నిలదీసే అవకాశం ఉన్నందున… ఆ నెపాన్ని కేంద్రంపై రుద్ది బదనాం చేయడమే లక్ష్యంగా వడ్ల కొనుగోలు పేరిట డ్రామాలాడుతున్నారు. కేసీఆర్ భాగోతాన్ని బట్టబయలు చేస్తాం.
వడ్ల కొనుగోలు వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం రైతుల పక్షాన ఉంది. తెలంగాణ రైతాంగం పండించిన ప్రతి గింజను కొనేందుకు సిద్దంగా ఉంది. దీనిపై ఫిబ్రవరి 25న కేంద్రం మీటింగ్ పెడితే అన్ని రాష్ట్రాలు యాసంగి వివరాలు పంపినా… తెలంగాణ ప్రభుత్వం మాత్రం బియ్యం వివరాలు అందించలేదు. తరువాత మాట మార్చి కేంద్రమే వడ్లు కొనాలంటూ కిరికిరి పెడుతూ రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించడం సిగ్గు చేటు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే నాటి సమావేశ మినిట్స్ వివరాలను వెల్లడించాలి. లేనిపక్షంలో ఆ వివరాలను వెల్లడించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం.
రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచైనా వడ్లు కొనిపిస్తాం. కేసీఆర్ ఢిల్లీ డ్రామాలను గల్లీలోనే ఎండగడతాం…. ప్రజలకు కేసీఆర్ బండారాన్ని బట్టబయలు చేస్తాం.