-కేంద్రం మెగా టెక్స్ టైల్ పార్క్ మంజూరు చేసినా ఇంతవరకు స్థలం చూపని మూర్ఖుడు కేసీఆర్
-రాష్ట్రానికి కేంద్రం రాసిన లేఖ ఇదిగో…
-పేదలకు ఉచితంగా 5 కిలోల బియ్యమిస్తే నిలిపేసిన కేసీఆర్ ను నిలదీయండి
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫైర్
-సంజయ్ సమక్షంలో కిష్టాపూర్ లో పలువురు నేతలు బీజేపీలో చేరిక
రాష్ట్రంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు, వలసలు ఆగిపోయాయంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. తన పాదయాత్రలో ఎక్కడికి వెళ్లినా చేనేత కార్మికుల అర్తనాదాలు, ఆకలి కేకలు విన్పించాయన్నారు. చేనేత కార్మికులు బతకు భారమై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని… పెద్ద ఎత్తున పొట్ట చేతపట్టుకుని వలస వెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా ఆ పార్టీ నేతలు పాలమూరు కు వస్తే ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కుటంబాలను, వలస పోతున్న వారిని చూపిస్తానని సవాల్ విసిరారు. చేనేత రంగానికి కేంద్రం చేసిందేమీ లేదంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపైనా బండి సంజయ్ ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 7 మెగా టెక్స్ టైల్స్ పార్కులకు అనుమతిస్తే.. తెలంగాణకు సైతం కేటాయించారని పేర్కొన్నారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఇంతవరకు భూమిని కేటాయించకుండా కేంద్రాన్ని విమర్శించడం సిగ్గు చేటన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ నారాయణపేట్ నియోజకవర్గంలో పార్టీ మధ్యప్రదేశ్ ఇంఛార్జీ మురళీధర్ రావుతో కలిసి 19వ రోజు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా కిష్టాపూర్ గ్రామంలో బీజేపీ జెండా ఎగరేసి ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు. అందులోని ముఖ్యాంశాలు…
• ఉపాధి హామీ కూలీలకు ఎండా కాలంలో ప్రతిరోజు రూ.277 చొప్పున వారానికి ఒకసారి చేసిన పనికి డబ్బులివ్వాలి. కానీ 3 నెలలైనా ఇవ్వలేదంటే నిలదీయండి. ఉపాధి కూలీలకు పనిచేసే చోట అన్ని సౌకర్యాలు కల్పించాలి. అవేవీ కల్పించకుండా డబ్బులు దొబ్బుకుంటున్నరు.
• పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని 1.4 లక్షల ఇండ్లను కేంద్రం మంజూరు చేస్తే ఈ గ్రామానికి ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కూడా ఇవ్వని కేసీఆర్ సెక్రటేరియట్ పేరుతో వందల కోట్లు ఖర్చు పెటి 100 గదులు కట్టుకుని ఊరేగుతున్నడు.
• ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వని కేసీఆర్… తన కుటుంబంలో మాత్రం 5 గురికి ఉద్యోగాలిచ్చి ప్రతినెలా రూ.25 లక్షలు జీతం తీసుకుంటున్నారు.
• పేదలకు 5 కిలోల చొప్పున ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తే… వాటిని ఇవ్వకుండా నిలిపేసిన కేసీఆర్ ను నిలదీయండి.
• స్కూళ్లకు కనీస సౌకర్యాల్లేవు. వైద్య సౌకర్యాల్లేవు. ఇక్కడి నేతలు గుంట నక్కల్లా ఇసుక దందా చేస్తూ… దోచుకుతింటున్నరు.
• తండ్రి ఫాంహౌజ్ లో తందనాలాడుతుంటే…. కొడుకు ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నడు…. చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆగిపోయినయట. భీవండి, ముంబై, సూరత్ వెళుతున్న చేనేత కార్మికులంతా మళ్లీ తెలంగాణకు తిరిగొచ్చి హాయిగా ఉంటున్నరట. బండి సంజయ్ పనిలేక తిరుగుతున్నడట…
• నేను అయ్యా కొడుకులను సవాల్ చేస్తున్న….. నేను ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే పాదయాత్ర తిరుగుతున్న. దమ్ముంటే ఇక్కడికి రండి… ఈ జిల్లాలో చేనేత మగ్గాలు భారమై మూతపడేసిన కుటుంబాలను చూపిస్తా… అప్పులపాలై ఇళ్లకు తాళాలేసి పొట్ట చేతపట్టుకుని ముంబై, భీవండి, సూరత్ వలస వెళ్లిన చేనేత కార్మికులను చూపిస్తా… టీఆర్ఎస్ దుర్మార్గ, నీచ, నిక్రుష్ట పాలనలో బతకలేక ఆత్మహత్యలు చేసుకున్న నేతన్న కుటుంబాలను సాక్షాధారాలతో చూపిస్తా
• నిన్న ఆ తుపాకీ రాముడు ఇంకో మాటన్నడు. చేనేత రంగానికి కేంద్రం చేసిందేమీ లేదట… సిగ్గుండాలె అబద్దాలాడటానికి… దేశవ్యాప్తంగా 7 మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్ టైల్స్ పార్కుల ఏర్పాటుకు కేంద్రం ఆమోదించి 4 వేల 4 వందల 45 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. అందులో తెలంగాణకు ఒకటి మెగా టెక్స్ టైల్ ను కేటాయిస్తూ మార్చి 15లోగా మెగా టెక్స్ టైల్ పార్కుకు భూమిని కేటాయించాలని కేంద్ర టెక్స్ టైల్స్ మంత్రిత్వశాఖ గత జనవరి 15న లేఖ రాసింది. ఇదిగో… కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి యూపీ సింగ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖ ( లేఖ చూపిస్తూ..)…
• చేనేత రంగానికే కాదు గొర్రెల, చేపల పంపిణీకి కూడా కేంద్రం ఆర్దిక సాయం చేస్తోంది. గొర్రెల పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే 4 వేల కోట్ల రుణం అందజేస్తే.. అందులో వెయ్యి కోట్ల రూపాయలు సబ్సిడీ ఇచ్చింది. దీంతోపాటు గొర్రెల, చేపల దాణా కోసం కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు వందల కోట్ల రూపాయలు సాయం చేస్తోంది.
• ఈ గ్రామంసహా తెలంగాణకు అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే. కోయిల్ సాగర్ ద్వారా ఇక్కడి చెరువులన్నీ నిండాలంటే టీఆర్ఎస్ కు బుద్ది చెప్పండి. బీజేపీకి అవకాశం ఇవ్వండి….
బీజేపీ మధ్య ప్రదేశ్ రాష్ట్ర ఇంఛార్జీ మురళీధర్ రావు మాట్లాడుతూ….
• తెలంగాణలో నీళ్ల సమస్య లేదని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నరు.. ఇక్కడే కోయిల్ సాగర్ ప్రాజెక్టు ఉంది.. కానీ ఈ ప్రాంతానికి నీళ్లు రావడం లేదు… కేటీఆర్ కు చెవులు వినబడవు.. కేసీఆర్ కు కళ్లు కనబడవు…
• ప్రజల కష్టాలు, సమస్యలను ప్రపంచానికి చూపడానికే బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నరు.
• డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో ఆశ చూపిన కేసీఆర్… ఇంత వరకు ఈ కిష్టాపూర్ ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కూడా కట్టలేదు. ఒక్క ఉద్యోగమూ ఇవ్వలేదు.
• ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తోంది నరేంద్రమోదీ ప్రభుత్వం. ఇచ్చిన మాట ప్రకారం 370 ఆర్టికల్ ను రద్దు చేశారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించారు. ట్రిపుల్ తలాఖ్ ను రద్దు చేశారు.
• తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోంది. కేసీఆర్… ఆయన తరువాత కొడుకు ఆ తరువాత మనవడు రాజ్యమేలాలని చూస్తున్నరు.
• అవినీతిలోనూ కేసీఆర్ కుటుంబ సభ్యులంతా ఒక్కొక్కరూ ఒక్కో కౌంటర్ ఓపెన్ చేస్తూ వసూలు చేస్తోంది.
• ఈ దేశంలో అవినీతికి తావులేని పాలన చేస్తోంది బీజేపీ మాత్రమే. వారసత్వ రాజకీయాలకు తావు లేకుండా పాలన చేస్తున్న పార్టీ బీజేపీ మాత్రమే.
• టీఆర్ఎస్ ఏనాడైనా భారత్ మాతాకీ జై అని ఎందుకు అనడం లేదో ఆలోచించాలి.
• ఆగస్టు 15న జాతీయ జెండాను ఎగరేస్తున్న టీఆర్ఎస్ …. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినం… ఆరోజు జెండాను ఎందుకు ఎగరేయడం లేదు?
• విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లు లేరు. అన్ని పోస్టలు ఖాళీగా ఉన్నాయి.
• ఉపాధి హామీ పథకం నిధులన్నీ ఠంచన్ గా కేంద్రం నిధులిస్తుంటే… రాష్ట్రం మాత్రం దుర్వినియోగం చేస్తోంది.
• కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వచ్చేదాకా ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతుంది.