– సీఎంకు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ
అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని తక్షణం ఆదుకోవాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఆ మేరకు ఆయన సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. లేఖ సారాంశమిది.
20-03-2023
గౌరవనీయులైన శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారికి
తెలంగాణ ముఖ్యమంత్రి,
ప్రగతి భవన్, హైదరాబాద్.
విషయం : అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవడంతో పాటు సమగ్ర పంటల బీమా పథకం రూపొందించాలని కోరుతూ…..
గత నాలుగైదు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలతో రైతాంగం తీవ్రంగా దెబ్బతిన్నది. దాదాపు 13 జిల్లాల్లో 5 లక్షల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగినట్టుగా ప్రాథమికంగా తెలుస్తుంది. యాసంగిలో 73 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. దీనిలో వరి 55 లక్షల ఎకరాల్లో, మక్క 6.50 లక్షల ఎకరాల్లో, శనగ 3.65 లక్షల ఎకరాల్లో, పల్లి 2.50 లక్షల ఎకరాల్లో సాగు జరిగింది. ఈ అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇక మిర్చి, మామిడి రైతుల కష్టాలు చెప్పనలవి కాదు. 40వేల ఎకరాల్లో మామిడి పంట దెబ్బ తిన్నది. మామిడి పంట నిర్వహణలో 65 శాతం మంది కౌలు రైతులే. వేలాది ఎకరాల్లో మిర్చి సాగు చేసిన రైతులూ తీవ్రంగా నష్టపోయారు.
పంటనష్టం తేల్చే విషయంలో రాష్ట్ర పభుత్వ చర్యలు చాలా ఉదాసీనంగా ఉన్నాయి. మంత్రుల బృందం కేవలం వికారాబాద్‌లలోనే పర్యటించడం రైతుల పట్ల మీ ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం వెంటనే చర్యలు చేపట్టాలి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా పథకాన్ని రాష్ట్రానికి వర్తింపజేస్తే రైతులకు వెంటనే పరిహారం అందించే వీలుండేది. కేంద్రానికి పేరొస్తుందనే సాకుతో ఈ పథకాన్ని రాష్ట్రానికి వర్తింపజేయకపోవడం వల్ల తెలంగాణ రైతాంగానికి తీరని నష్టం చేశారు. ప్రత్యామ్నాయ పంటల బీమా పథకాన్ని తీసుకు వస్తామన్న మీ హామీ గత నాలుగేళ్లుగా అటకెక్కింది. మీ నిర్లక్ష్యం వల్ల ఏళ్ల తరబడి రైతులు నష్టపోతూనే ఉన్నారు.
గతంతో పోల్చినపుడు ఈ ఏడాది పంటల దిగుబడి బాగా తగ్గినట్టుగా తెలుస్తుంది. పెట్టుబడి వ్యయం బాగా పెరగడమే దీనికి ముఖ్యమైన కారణం. రైతాంగానికి అవసరమైన యూరియా సరఫరాలో వైఫల్యం, కౌలు రైతులకు ఎటువంటి ఆర్థిక భరోసా లేకపోవడం వల్లే రైతాంగం ఇంతటి దుస్థితిని ఎదుర్కొంటోంది. వ్యవసాయ రంగం పట్ల మాటలే తప్ప చేతల్లో రాష్ట్రం ప్రభుత్వం చేసిందేమి కన్పించడం లేదు.
ప్రస్తుతం సంభవించిన అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటల విస్తీర్ణం రైతుల స్థితిగతులతో అంచనా వేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. కమిటీలు, సర్వేలు, నివేదికల పేరుతో తాత్సారం చేయకుండా అకాల వర్షాలతో నష్టపోయిన ప్రతీ రైతుకు యుద్ధ ప్రాతిపదికన నష్ట పరిహారం చెల్లించాలి. రైతాంగానికి ఉచితంగా విత్తనాలు, యూరియా అందించి వ్యవసాయ రంగంలో అద్భుతాలు సృష్టిస్తామని మీరు ఇచ్చిన హామీ ఏళ్లు గడుస్తున్నా నేటికీ ఆచరణకు నోచుకోలేదు. మీ హామీల అమలుకు ఇదే ఆఖరి సంవత్సరం. రాబోయే వానాకాలం సీజన్‌కు ముందే రైతుబంధుతో పాటు రైతాంగానికి అవసరమైన ఎరువులు, విత్తనాలను ఉచితంగా అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
విత్తనాల నుండి పంట చేతికొచ్చి, మార్కెటింగ్ వరకు రైతుకు వెన్నంటి ఉంటూ ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పదేపదే ప్రకటిస్తున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ స్ఫూర్తిని ప్రదర్శించడం లేదు. కేవలం రైతుబంధు ఇచ్చి చేతులు దులుపుకొంటే సరిపోదు. రైతుబంధు అందక భూమి సేద్యం చేస్తూ చితికిపోతున్న 14 లక్షల మంది కౌలురైతులను ఆదుకునే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానిదే. కౌలు రైతుల విషయంలో మీ ప్రభుత్వ నిర్లిప్తత, నిర్లక్ష్యం తీవ్ర ఆక్షేపణీయం. ఇప్పటికైనా కౌలురైతుల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం.
అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల మూలంగా నష్టపోతున్న రైతాంగాన్ని ఆదుకునేందుకు తక్షణమే సమగ్ర పంటల బీమా పథకాన్ని అమలులోకి తేవాలని బీజేపీ తెలంగాణ శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
భారత్ మాతాకీ జై!
బండి సంజయ్ కుమార్, ఎంపీ,
అధ్యక్షులు, బీజేపీ తెలంగాణ శాఖ.