Suryaa.co.in

Telangana

తెలంగాణ 119 నియోజకవర్గాల్లో కేసీఆర్ ఉన్నారు

రైతులను ఇప్పుడు కరంటు గురించి అడిగేవాళ్లు లేరు
నీళ్ల నిరంజనుడు జిల్లాను సాధించారు
ధరణితో రైతులకు భూమి మీద అధికారం కట్టబెట్టిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ.
వనపర్తి సభలో ముఖ్యమంత్రి కేసీఅర్

తెలంగాణ 119 నియోజకవర్గాల్లో కేసీఆర్ ఉన్నారు.వనపర్తి కేసీఆర్ నిరంజన్ రెడ్డి నా పక్కన ఉన్నారు. 24 ఏళ్ల నాడు పిడికెడు మందిమి ఉద్యమం ప్రారంభించాం. నేడు సవాల్ విసురుతున్న వారు నాడు ఎవరి బూట్లు మోశారు మీకు తెలుసు. గంజి కేంద్రాలు, అంబలి కేంద్రాలకు నిలయమైన జిల్లా విముక్తి కోసం మేము పోరాడిన నాడు ఎవ్వరూ లేరు. పక్షుల్లా తిరిగి ప్రజలను చైతన్యం చేశాం.

గోరటి వెంకన్న, సాయిచంద్ వంటి వారితో పాటలు రాసి ప్రజలను ఒక్కటి చేశాం. 2004లో మోసం జరిగితే, 2009 లో నేను చావునోట్లో తల పెట్టి ఆమరణదీక్ష కు తెలంగాణ ప్రకటన వచ్చింది. తెలంగాణకు నీళ్లు, నిధులు, నియామకాలు, కరంటులో అన్యాయం జరుగుతుంటే నిలదీసి నిలబడ్డది ఎవరు ? నోరు మూసుకుని కూర్చున్నది ఎవరు ప్రజలు ఆలోచన చేయాలి.

వనపర్తికి కేఎల్ఐ ద్వారా లక్ష పై చిలుకు ఎకరాలకు సాగునీరు వస్తున్నది. వనపర్తిని వరి పంటల వనపర్తిని చేసిన మొనగాడు నిరంజన్ రెడ్డి. ఏమీ చేయకుండా చిల్లరమల్లర మాటలు మాట్లాడుతున్నది ఎవరు ? మంత్రి అయినా కూడా చిన్నమందడి, పెద్దమందడి, తండాల పేర్లు చెప్పి లిఫ్టులు అడుగుతాడు. తండ్లాడి కావాల్సిన ప్రతి నీటి చుక్క డీ 8 కోసం వందలసార్లు వాదించి చేసుకున్నారు.డీ 8 ఆధునీకరణ చేస్తాం.

కొట్లాడి ఏదుల రిజర్వాయర్ నిర్మించింది నిరంజన్ రెడ్డి.అందులో నష్టపోయిన వారికి వీలయినంత సాయం చేస్తాం.ఈ రోజు మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్ట్ కాకుండా కాళ్లలో కట్టెలు పెట్టింది. పాలమూరు రంగారెడ్డి ద్వారా పాలమూరు సస్యశ్యామలం అవుతుంది. భవిష్యత్ లో ఎవరైనా గంజి కేంద్రం అంటే గుంజి కొట్టే పరిస్థితి తెచ్చాం. జిల్లా మంత్రులు ఇద్దరూ జిల్లాలో అభివృద్ది పనులు చేశారు.

గతంలోని మంత్రులు జిల్లాకు ఒక్క మొడికల్ కళాశాల తీసుకురాలేదు. ఉమ్మడి జిల్లాలో 5 మొడికల్ కళాశాలలు తెచ్చిన ఘనులు ఇద్దరు మంత్రులు. వనపర్తి సంస్కారవంతమైన, సాంస్కృతిక స్పృహ ఉన్న పట్టణం వనపర్తి.కలెక్టరేట్ ప్రారంభానికి వచ్చినప్పుడు దక్షిణభాగం బైపాస్ రోడ్డు అడిగారు .. ఇప్పుడు ఉత్తరభాగం బైపాస్ రోడ్డు అడుగుతున్నారు.

వందకు వంద శాతం మంజూరు చేస్తాం.గత ఎన్నికల సభలో ఉద్యమ నాయకుడు నిరంజన్ రెడ్డిని గెలిపిస్తే మంత్రిని చేస్తానని చెప్పి చేశాను .. ఐదేళ్లు బ్రహ్మండంగా మీ సేవలో పునీతమయ్యారు. రైతులు, ముస్లింలు, దళితులు ఆలోచించాలి. ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకున్నది కాంగ్రెస్ పార్టీ. అగ్రవర్ణ పేదలకు సంక్షేమ గురుకులాలు నిర్మిస్తాం.

ఆకలిచావులు, వలసలు, ఆత్మహత్యల తెలంగాణను ఎంతో బాధ్యతతో ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రతి పథకం బాధ్యతతో ప్రకటిస్తున్నాం. అభాగ్యులకు అండగా నిలవాలని ఆసరా ఫించన్లను మానవీయ కోణంలో రూ.1000, రూ.1500 కు చేశాం. ఆదాయం పెరిగే కొద్దీ దానిని రూ.2016, రూ.3016, రూ.4016 చేసుకున్నాం.మేనిఫెస్టోలో చెప్పినట్లు విడతలవారీగా ఐదేళ్లలో రూ.5 వేలకు పెంచుతాం. కాంగ్రెస్ హయాంలో గుంజుకపోవుడు తప్ప ఇచ్చింది లేదు.

రైతులకు ఉల్టా రైతుబంధు ఇచ్చింది, ప్రపంచంలో రైతుబంధు పెట్టింది కేసీఆర్. రైతులకు ప్రభుత్వ సహకారం ఉండాలని 24 గంటల కరంటు, రైతుబంధు, రైతుభీమా ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. రైతులను ఇప్పుడు కరంటు గురించి అడిగేవాళ్లు లేరు. దాదాపు రూ.లక్ష కోట్ల ఉచిత కరంటు ఇచ్చిన ఒకేఒక రాష్ట్రం తెలంగాణ. ధరణితో రైతులకు భూమి మీద అధికారం కట్టబెట్టిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ.

ప్రభుత్వ అధికారాన్ని రైతులకు అప్పజెప్పాం.ధరణిని తీసేస్తామని కాంగ్రెస్ చెబుతున్నది. అది ఉండాలా పోవాలా ? ప్రజలు నిర్ణయించాలి. వనపర్తి ప్రజలు కులాలు, మతాలకు అతీతంగా నిరంజన్ రెడ్డిని దగ్గరుండి గెలిపించాలి .. నీళ్ల నిరంజనుడు జిల్లాను సాధించారు .. మిగిలిన పనులూ పూర్తి చేసే బాధ్యత నాది.

మోడీ ప్రభుత్వం మొద్దు ప్రభుత్వం .. వాల్మీకి సోదరుల హక్కుల కోసం రెండు సార్లు తీర్మానం చేశాం .. భవిష్యత్ లో మళ్లీ పోరాటం చేస్తాం. పదేళ్లలో జరిగిన అభివృద్ది ప్రజల కండ్ల ముందు ఉన్నది. ప్రజలు మీ ఇళ్లలో, గ్రామాల్లో, బస్తీల్లో చర్చ జరిపి ఎన్నికల్లో ఎవరి పక్షాన నిలబడాలో నిర్ణయం తీసుకోవాలి.

LEAVE A RESPONSE