Suryaa.co.in

Telangana

రైతుని రాజుని చేసింది కేసీఆర్

  • జనగామ నియోజకవర్గంలో రైతు ధర్నాలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు

ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ… రేవంత్ రెడ్డి నిజ స్వరూపం బయటపడ్డది. అసెంబ్లీ ఎన్నికల ముందు రెండు లక్షల రుణమాఫీ అందరికీ చేస్తామని, రైతులు వెంటనే వెళ్లి రెండు లక్షల రుణం తెచ్చుకోండి.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మాఫీ చేస్తామని అన్నారు.

డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తామన్నాడు. ఏమైంది రుణమాఫీ అని అడిగితే పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉందని అన్నాడు. జనం నమ్మేటట్టు లేరని, జనగామకొచ్చి కొమరవెల్లి మల్లన్న మీద ఒట్టు పెట్టిండు. అన్ని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి పంద్రాగస్టులోపు రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తామన్నారు.

పంద్రాగస్టులోగా రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తానని ప్రకటించాను. రుణ మాఫీ చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలని అడిగాను.

రుణమాఫీ చేస్తానని చెప్పిండు కానీ రుణమాఫీ చేసిండా? రేవంత్ రెడ్డి ఖమ్మం సభలో పూర్తి రుణమాఫీ చేశానని ప్రకటించారు. రేవంత్ రెడ్డి.. ఏ ఊరికొస్తావో చెప్పు, ఏ మండలానికి వస్తావో చెప్పు.

ఎక్కడైనా 100% రుణమాఫీ అయిందా లేదా అని అడుగుదాం. అంత ఎందుకు రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పూర్తి రుణమాఫీ కాలేదని అన్నారు. నిన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు 49 లక్షల మందికి రుణమాఫీ చేయాల్సి ఉంది కానీ 22 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందని ఒప్పుకున్నారు.

డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు రూ.7,000 కోట్ల రుణమాఫీ జరిగిందని బ్యాంకర్ల సమావేశంలో అన్నారు. ఎవరి మాట నమ్మాలో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ ముఖ్యమంత్రి రైతులనే కాదు, దేవుళ్లను కూడా మోసం చేసి, దైవ ద్రోహానికి పాల్పడ్డాడు.

పాలకులు దైవ ద్రోహం చేస్తే, ప్రజల మీద, రాష్ట్రం మీద దేవుడు కోపానికి వస్తాడు అని, ఈరోజు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి వెళ్లి, తెలంగాణ ప్రజలను కాపాడండి అని పూజ చేయడం జరిగింది.

రుణమాఫీ విషయంలో దేవుడిపై ఒట్టు పెట్టి ప్రజలను మోసం చేశానని తప్పు ఒప్పుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాప పరిహారం చేయాలి.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భయపడే ప్రసక్తే లేదు. ఇది ఉద్యమాల గడ్డ. ఉద్యమాలు, పోరాటాలు మాకు కొత్త కాదు. రైతులకు పూర్తి రుణమాఫీ చేసేదాకా ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే ఉంటాం, రైతులకు అండగా నిలుస్తాం. కేసీఆర్ వ్యవసాయ స్థిరీకరణ చేశారు. 11 విడతల్లో 70 వేల కోట్లు రైతు బంధు ఇచ్చారు కేసీఆర్. రైతుని రాజుని చేసింది కేసీఆర్.

కానీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల పరిస్థితి దారుణంగా మారింది. వరికి బోనస్ ఇస్తానని చెప్పి, ఇప్పుడు సన్నాలకు మాత్రమే అని చెప్పి రైతులను మోసం చేశారు.

రైతులనే కాదు, అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత ఈ ముఖ్యమంత్రిది. జాబ్ క్యాలెండర్ తెస్తామని, రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామని యువతను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీలో చర్చ పెట్టకుండా పారిపోయింది ప్రభుత్వం.

4000 పింఛన్ బోగస్, తులం బంగారం బోగస్, మహిళలకు 2500 బోగస్. ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ప్రజలను మోసం చేసింది ఈ ప్రభుత్వం.

బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా ప్రభుత్వం, పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యేపై దాడి చేసే ప్రయత్నం జరిగింది.

మా కార్యకర్తలను ఎక్కడ ఇబ్బంది పెట్టినా, భవిష్యత్తులో మూల్యం చెల్లించక తప్పదు. పోలీస్ అధికారులు జాగ్రత్త. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంతటి అణిచివేత చూడలేదు, కానీ రేవంత్ రెడ్డి సర్కార్ తీవ్ర అణిచివేతకు గురిచేస్తుంది.

LEAVE A RESPONSE