Suryaa.co.in

Telangana

కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి

• బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ ను ఆహ్వానించకపోవడం సీఎం మూర్ఖత్వానికి పరాకాష్ట
– పీకేలు, గీకేలు ఏమీ చేయలేరనే విషయాన్ని గుర్తుంచుకోవాలి
• బెంగాల్ తరహా రాజకీయాలు చేస్తానంటే చూస్తూ ఊరుకునేది లేదు
• బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫైర్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. అనంతరం భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. ఇబ్బందులను గమనించారు. అన్నదాత సత్రాన్ని సందర్శించారు. ప్రత్యేక వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు….

ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ బంధువలందరికీ పవిత్రమైన, శక్తివంతమైన మహా శివరాత్రి శుభాకాంక్షలు. దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని మంగళ శాసనాలు పొందడం సంతోషంగా ఉంది. హిందూ బంధువులందరూ సుఖ:సంతోషాలతో నిండు నూరేళ్లు సంస్కారవంతమైన జీవితాన్ని కొనసాగించాలని భగవంతుడిని కోరుకున్నా.

వేములవాడ ఆలయంలో సిస్టమ్ లేదు. సౌకర్యాల్లేవు. తాగడానికి నీళ్లు లేవు. పార్కింగ్ కు అన్నీ ఇబ్బందులే. అధికారులకు ఎవరూ సహకరించడం లేదు. దేవాలయ అభివృద్ధి కి నిధులివ్వడం లేదు… ఏటా వంద కోట్లు ఇస్తామన్న హామీని అమలు చేయడం లేదు. ఉన్న నిధులను ప్రభుత్వం దారి మళ్లిస్తోంది.

వేములవాడ దేవాలయాన్ని అభివృద్ధి చేసేందుకు ‘ప్రసాదం’ స్కీం కింద ప్రతిపాదనలు పంపితే కేంద్రం నుండి నిధులు మంజూరు చేయిస్తానని పలుమార్లు చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
ఇకనైనా పేరు ప్రతిష్టలు, పంతాలు, రాజకీయాలకు పోకుండా వెంటనే ‘ప్రసాదం’ స్కీం కింద ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మరొక్కసారి కోరుతున్నా. మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం సమీక్ష కూడా నిర్వహించలేదు.

శివరాత్రి పండుగ తరువాత ఆలయానికి వచ్చిన ఆదాయాన్ని ఎట్లా దారి మళ్లించాలనే దానిపై మాత్రం, సమీక్షలు చేయడం కేసీఆర్ కు అలవాటైంది. మంచి పద్దతి కాదు.బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ ను ఆహ్వానించకపోవడం మూర్ఖత్వం. గవర్నర్ సొంత ప్రసంగం ఉండదు.. కేబినెట్ ఆమోదించిన ప్రసంగ పాఠాన్ని మాత్రమే అసెంబ్లీలో చదివి విన్పిస్తారు. బహుశా కేసీఆర్ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి ఏమీ లేనట్లుంది. అందుకే ఇట్ల చేస్తున్నరేమో.

గవర్నర్ ప్రథమ పౌరురాలు. రాజ్యాంగ పరిరక్షకురాలైన మహిళ రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తున్నారు. ఏనాడూ వివాదాస్పదం కాలేదు. సీఎంను ఎన్నడూ గవర్నర్ అవమానించలేదు. ఏ ఒక్క పార్టీకి సపోర్ట్ చేయలేదు. ఇదే సీఎం గతంలో గవర్నర్ ను పొగిడారు. మరి అట్లాంటప్పుడు ఎందుకు బడ్జెట్ సమావేశాలకు ఆహ్వానించలేదో కేసీఆర్ వివరణ ఇవ్వాలి.

సీఎం కేసీఆర్ కు మహిళలంటే చులకన భావన. మొదటి నుండి కించపర్చడం ఆయనకు అలవాటు. మొదటి కేబినెట్ లో ఒక్క మహిళకు కూడా చోటివ్వలేదు.
గవర్నర్ వ్యవస్థనే సీఎం కేసీఆర్ కించపర్చుస్తున్నారు. మహళా గవర్నర్ ను అవమానించడమంటే రాష్ట్రంలోని మహిళలందరినీ అవమానించినట్లే. ఇది మంచి పద్దతి కాదు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. కేసీఆర్ బెంగాల్ తరహా రాజకీయాలు చేద్దామనుకుంటున్నడు. బీజేపీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు.

ఇకనైనా ప్రజాస్వామ్యబద్దంగా, రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాలి. బరితెగించి ఏది పడితే అది చేస్తానంటే ప్రజలు తిరగబడతారనే సంగతిని సీఎం గ్రహించాలి. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు. కేసీఆర్ పీకేతో కలిసి పనిచేసినా…ఆ పీకేలు, గీకేలు ఏమీ చేయలేరనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

LEAVE A RESPONSE