– సీఎం కూడా కేసీఆర్ ట్యాపింగ్ బాధితుడే
– బాధితులకు సిట్ ఏం న్యాయం చేస్తుందో చూస్తాం
– సిట్ విచారణకు హాజరైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
హైదరాబాద్: తన ఫోన్ ట్యాపింగ్ చేసిన కేసీఆర్ కుటుంబాన్ని కోర్టుకు ఈడుస్తానని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్‌కు
సంబంధించి తనకు సిట్ నోటీసులిచ్చిన నేపధ్యంలో, ఆయన సిట్ కార్యాలయానికి హాజరయ్యారు. అనంతరం బయటకు వచ్చిన మల్లన్న మీడియాతో మాట్లాడారు.
వ్యక్తిగత హక్కులను హరించిన కేసీఆర్ కుటుంబంపై, అప్పటి అధికారులపై చర్యల కోసం కోర్టులను ఆశ్రయిస్తామని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడేనని అన్నారు. ఈ ప్రభుత్వంలో అలాంటి దుర్మార్గాలు జరగవనే సంకేతాలను ప్రజలకు ముఖ్యమంత్రి ఇవ్వాలన్నారు. ఈ కేసులో సిట్ ఏ మేరకు న్యాయం చేయగలదో చూస్తామన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం తనతో పాటు పలువురి ఫోన్లను ట్యాప్ చేసిందని, ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి తన వద్ద ఉన్న ఆధారాలను అధికారులకు
అందించానని, తన వద్ద మరికొంత సమాచారం ఉందని, అది త్వరలోనే అధికారులకు పంపిస్తానని వెల్లడించారు.
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వెంట తెలంగాణ బిసి పొలిటికల్ జె.ఏ సి కోఆర్డినేషన్ కమిటి చైర్మన్ సుదగాని హరిశంకర్ గౌడ్ , బిసి పొలిటికల్ జె.ఏ సి సమన్వయకర్త లు ఎలబోయన ఓదేలు యాదవ్, బందారపు నర్సయ్య గౌడ్ , అడ్వకేట్ రమేష్ ,బిసి జె.ఏ సి నాయకులు తిరుమని నాగరాజు ఉన్నారు.