Suryaa.co.in

Telangana

కేసీఆర్ మాటలు ఆధునిక తుపాకీ రాముడు మాదిరి ఉన్నాయి

-కేసీఆర్ మాత్రం చంచల్ గూడ జైలు కు పోవడం ఖాయం
-అప్పు చేసి రాష్ట్రాన్ని దివాళా తీసేలా చేశావ్ నువ్వా మాట్లాడేది?
-ఎనిమిదన్నరేళ్లుగా నీటి పంచాయతీలు ఏమి తేల్చావు?
-పక్క రాష్ట్రం సీఎంతో కలిసి భోజనం చేస్తావ్
-ఉద్యోగులకు సరిగ్గా జీతాలు ఇవ్వడానికి దిక్కు లేదు కానీ దేశం గురించి మాట్లాడుతున్నావు
-ఎవరిని అయితే విమర్శిస్తావో వాళ్లకే తెరవెనుక మద్దతు ఇవ్వడం కేసీఆర్ బీఆర్ఎస్ పని
-తెలంగాణ సీఎం కేసీఆర్‌పై పీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య విసుర్లు

ఖమ్మం బీఆర్‌ఎస్‌ సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగంపై పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విరుచుకుపడ్డారు. జలవివాదం గురించి వాపోతున్న కేసీఆర్‌.. ఎనిమిదేళ్లుగా ఏపీతో ఉన్న వివాదం గురించి ఎందుకు తేల్చలేకపోయాడు? ఆ రాష్ట్ర సీఎం జగన్‌తో కలసి భోజనం మాత్రం చేశాడు అని వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. సొంత రాష్ట్రంలో ఉద్యోగులకు సకాలంలో జీతాలిచ్చే దిక్కులేని కేసీఆర్‌.. దేశం, ప్రపంచం గురించి డబ్బాలు కొడుతున్నారంటూ విరుచుకుపడ్డారు.

పొన్నాల ఇంకా ఏం మాట్లాడారంటే.. ఖమ్మం బహిరంగ సభలో దేశం గురించి కేసీఆర్ మాట్లాడితే చాలా ఆశ్చర్యంగా ఉంది. కేసీఆర్ మాటలు సంక్రాంతి నాడు ఆధునిక తుపాకీ రాముడు మాదిరి ఉన్నాయి. కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీశాడు అంట అలా ఉంది కేసీఆర్ తీరు. ఎవరు ఎక్కడికి పోయినా, కేసీఆర్ మాత్రం చంచల్ గూడ జైలు కు పోవడం ఖాయం రాసి పెట్టుకోండి. దేశ విషయాల మీద ఏనాడైనా కేసీఆర్ మాట్లాడాడ?. కేంద్ర మంత్రిగా ఇప్పుడు సీఎంగా ఆయన మాట్లాడిన ప్రతిదానికి సమాధానం చెప్తా దమ్ముంటే చర్చకు వస్తారా? ఫిరాయింపుల చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న కేసీఆర్, మోడీ గురివింద నీతులు చెబుతున్నారు.

సుమారు 5 లక్ష కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని దివాళా తీసేలా చేశావ్ నువ్వా మాట్లాడేది?రాష్ట్రంలో 17 లక్షల మంది ఉంటే ఇప్పటికి ఎంత మందికి దళిత బంధు ఇచ్చావు.. 30 వేల మందికా ఇచ్చేది ఎన్నికల ముందు మాట్లాడిన మూడెకరాల ఎంతమందికి ఇచ్చావు? దేశాన్ని ఉద్దరిస్తానంటూ కేసీఆర్ మాటల గారడీ. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఆహార ధాన్యాలు ఎగుమతి105 దేశాలకి ఎగుమతి చేస్తున్నాం. నల్గొండను ఫ్లోరైడ్ రహితంగా చేస్తాని ఏతులు గొట్టాడు. మిషన్ భగీరథ నీళ్లు 20 నుంచి 30 నిమిషాలు కూడా రావట్లేదు. అదీ మంచి నీరు రావట్లేదు. మిషన్ భగీరథ కోసం 40 వేల కోట్లు ఖర్చు పెట్టినా నీళ్లు తాగలేని దుస్థితి.ఎనిమిదన్నరేళ్లుగా నీటి పంచాయతీలు ఏమి తేల్చావు. పక్క రాష్ట్రం సీఎంతో కలిసి భోజనం చేస్తావ్.ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేర్చవా కేసీఆర్?

మా దగ్గర చూసి వచ్చి ఇక్కడ ఫోజులు కొడుతున్నాడు అన్నట్లుగా ఉంది కేజ్రీవాల్ ప్రసంగం. ఖాళీలను భర్తీ చేస్తే కొత్త ఉద్యోగాలు ఇచ్చినట్లా? రాష్ట్రంలో ఉద్యోగులకు సరిగ్గా జీతాలు ఇవ్వడానికి దిక్కు లేదు కానీ దేశం, ప్రపంచ బ్యాంకు గురించి మాట్లాడుతున్నావు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా ప్రజలు 9 రకాల సరుకులు ఇచ్చాం. నువ్ బియ్యం తప్ప ఇంకేమైనా ఇచ్చావా? అధికారంలోకి వచ్చే వాళ్ళని రానీయకుండా అడ్డుకోవడం ఒక పని, ఎవరిని అయితే విమర్శిస్తావో వాళ్లకే తెరవెనుక మద్దతు ఇవ్వడం ఇది కేసీఆర్ బీఆర్ఎస్ పని.

LEAVE A RESPONSE