తాజాగా ఏపీఈఆర్‌సీ లేఖ బయటపెట్టిన వైనం
విద్యుత్ బకాయిలపై హెచ్చరిక
14 తర్వాత సర్కారు ఆఫీసులకు కరెంట్ కట్
ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, టీడీపీ ఫైర్‌బ్రాండ్ పయ్యావుల కేశవ్ తన వ్యూహాలతో జగనన్న సర్కారును వెంటాడుతున్నారు. విద్యుత్ డిస్కమ్‌లకు చెల్లించాల్సిన 25 వేల కోట్ల రూపాయల దస్త్రం తుట్టెను, కేశవ్ కదిలించారు. దానితో ఏపీఈఆర్‌సీ జగనన్న సర్కారుకు ఘాటు లేఖ రాసింది. ఆ సబ్సిడీని ఎప్పుడు చెల్లిస్తారని ప్రశ్నించింది. ప్రభుత్వం నుంచి 14 రోజుల తర్వాత కూడా స్పందన లేకపోతే.. ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేయాలంటూ, ఆదేశాలు జారీ చేయడం సంచలనం సృష్టిస్తోంది. విద్యుత్ వ్యవహారాలపై తొలి నుంచి జగన్ సర్కారుపై ఒంటికాలితో లేస్తున్న కేశవ్.. తాజాగా బయటపెట్టిన బకాయి అస్త్రం ప్రభుత్వానికి పరేషాన్‌గా మారింది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు, డిస్కంలకు, ఇంధన శాఖ సెక్రెటరీకి ఏపీఈఆర్సీ ఘాటుగా లేఖ రాసింది. ఏపీ డిస్కంలకు చెల్లించాల్సిన వేల కోట్ల సబ్సిడీ బకాయిల పెండింగ్‌పై ఎలక్ట్రసిటీ రెగ్యులేటరీ కమిషన్ లేఖ రాసింది. రూ. 25,257 కోట్ల బకాయిలపై ఈఆర్సీ రాసిన లేఖను పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ బయట పెట్టారు. ఈ నెల 9వ తేదీన ఏపీ ఈఆర్సీని కలిసి ఇంధన శాఖలో పరిస్థితులు, నిర్ణయాలపై ఈఆర్సీకి ఫిర్యాదు చేశారు.
ప్రభుత్వం నుంచి డిస్కంలకు రావాల్సిన రూ. 15,474 కోట్ల సబ్సిడీ బకాయలు వెంటనే చెల్లించాలంది. స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన రూ. 9,783 కోట్లను విడుదల చెయ్యాలని, బకాయిల చెల్లింపులపై 14 రోజుల గుడువుతో నోటీసులు ఇవ్వాలని సూచించింది. ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థల నుంచి 14 రోజుల్లో స్పందన రాకపోతే విద్యుత్ సరఫరా నిలిపివెయ్యాలని ఆదేశించింది. డిస్కంల మనుగడే ప్రమాదంలో పడిందని ఏపీఈఆర్సీ ఆ లేఖలో పేర్కొంది.