– కూటమి నేతల అరాచకంతో పరిశ్రమలు విలవిల
– ఇలా అయితే రాయలసీమలో పారిశ్రామిక సంస్థలు కనుమరుగు
– కమీషన్లు, కాంట్రాక్టుల కోసం పారిశ్రామికవేత్తలను తరిమేస్తున్నారు
– సంపద సృష్టించకపోగా రాష్ట్ర సంపదను పంచుకు తింటున్నారు
– వైయస్సార్సీపీ పీఏసీ మెంబర్, మాజీ ఎంపీ తలారి రంగయ్య ఆగ్రహం
తాడేపల్లి: రాష్ట్రంలోని పరిశ్రమలపై కాంట్రాక్ట్లు, కమీషన్ల కోసం కూటమి నేతలు చేస్తున్న దౌర్జన్యాలతో పారిశ్రామికవేత్తలు పారిపోయే పరిస్థితిని కల్పిస్తున్నారని మాజీ ఎంపీ, వైయస్ఆర్సీపీ పీఏసీ సభ్యుడు తలారి రంగయ్య మండిపడ్డారు.
తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాయలసీమలోని కియా కంపెనీపైన కూడా తాజాగా కూటమి నేతలు కాంట్రాక్ట్లన్నీ తమకే ఇవ్వాలంటూ చేస్తున్న వేధింపులతో సంస్థ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాయలసీమలో సిమెంట్, సోలార్, పంప్డ్ విద్యుత్ ప్రాజెక్ట్లు, ఇప్పుడు కియా ఇలా ప్రతి దానిని వదిలిపెట్టకుండా కూటమి నేతలు చేస్తున్న వేధింపులు, దాడులతో పరిశ్రమలు మూతపడటమో, ఇక్కడి నుంచి తరలించుకుని పోవడమో తప్పదనే భావన కలుగుతోందని ధ్వజమెత్తారు. ఇదేనా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువస్తానంటున్న విజనరీ చంద్రబాబు పాలన అని ప్రశ్నించారు.
పెట్టుబడులు తెచ్చే విధానం ఇదేనా.?
కూటమి ప్రభుత్వం వచ్చాక సంపద సృష్టిస్తానని చంద్రబాబు చెప్పిన మాటలన్నీ అబద్ధాలని తేలిపోయింది. సంపద సృష్టించకపోగా ఉన్న సంపదను విచ్చలవిడిగా పంచుకుని తింటున్నారు. ఇసుక, మట్టి, క్వార్ట్జ్, లిక్కర్, ఉద్యోగాలు, కాంట్రాక్టులు.. ఏదీ వదలకుండా దోచేస్తున్నారు. ఇవి చాలదంటూ పరిశ్రమలపైన కూడా కూటమి నేతలు దృష్టి సారించారు. అన్ని పరిశ్రమల్లోనూ తమకే కాంట్రాక్ట్లు, కమిషన్లు, ఉద్యోగాలు ఇవ్వాలంటూ దౌర్జన్యాలకు దిగుతున్నారు.
రాయలసీమలో పలువురికి ఉపాధిని కల్పిస్తున్న కియా కంపెనీపైనా ఇదే తరహాలో వేధింపులు ప్రారంభించారు. చివరికి సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు చేస్తున్న వారిని కూడా బెదిరించి, బయటకు పంపిస్తున్నారు. ప్రభుత్వం మారగానే గతంలో పనిచేస్తున్న కాంట్రాక్టర్లను తొలగించి, తమకు చెందిన వారికే ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు.
చివరికి కియాను కూడా తరిమేస్తారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు సీఎం చంద్రబాబు సింగపూర్ వంటి దేశాలకు వెళ్ళి, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. తమ కూటమి పార్టీల నేతలు చేస్తున్న దుర్మార్గాలు మాత్రం ఆయనకు కనిపించడం లేదు.