Suryaa.co.in

Andhra Pradesh Telangana

తెలంగాణ బీజేపీలో కిరణ్‌ కుమార్‌రెడ్డి?

‘కమలవనం’లో మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి?
– కిరణ్‌తో బీజేపీ నేతల భేటీ?
-కిరణ్‌తో తెలంగాణ రెడ్డివర్గంపై వల
– కాంగ్రెస్‌ లోని రెడ్డి నేతల చేరికలే లక్ష్యం
– కాంగ్రెస్‌కు దూరంగా కిరణ్‌
– రాహుల్‌ జోడో యాత్రకూ దూరం
– గతంలోనే కిరణ్‌తో బీజేపీ చర్చలు
– కాంగ్రెస్‌తో కష్టమని గ్రహించిన కిరణ్‌
– కమలంలో ప్రయాణానికి సిద్ధం?
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రిగా చేసిన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి, బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆ మేరకు ఆయనతో బీజేపీ అగ్రనేతలు చర్చిస్తున్నట్లు సమాచారం. ఆయనకు తెలంగాణలో రెడ్డి వర్గాన్ని సమీకరించే బాధ్యత అప్పగించవచ్చని తెలుస్తోంది. నిజానికి కిరణ్‌తో గతంలోనే బీజేపీ నాయకత్వం చర్చలు జరిపినా, మళ్లీ ఆయన మనసు మార్చుకుని కాంగ్రెస్‌లో చేరారు. కిరణ్‌ ప్రస్తుతం కాంగ్రెస్‌లోనే ఉన్నప్పటికీ, ఏపీలో జరిగే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.

జై సమైక్యాంధ్ర పార్టీ పేరుతో ఎన్నికల్లో దిగి ఘోర ంగా ఓడిన తర్వాత, కిరణ్‌కుమార్‌రెడ్డి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన ఎక్కువ కాలం తమ మిత్రులతోనే గడుపుతున్నారు. గోల్ఫ్‌, వాకింగ్‌తో కాలక్షేపం చేస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఆయన బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌ షోలో తెరపై కనిపించారు. రాహుల్‌గాంధీ ఏపీ-తెలంగాణలో పాదతయాత్ర చేసినప్పుడు కూడా కిరణ్‌ కనిపించలేదు.
కిరణ్‌ చివరకు తన చిత్తూరు జిల్లా రాజకీయాలకు సైతం దూరంగా ఉంటున్నారు. కిరణ్‌ సోదరుడు నల్లారి కిశోర్‌రెడ్డి టీడీపీలో చురుకుగా ఉన్నారు. అప్పుడప్పుడు స్వంత గ్రామానికి వెళ్లడం మినహాయించి, కిరణ్‌ ఎక్కువగా హైదరాబాద్‌లోనే గడుపుతున్నారు. ఒక దశలో ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి ఆయన పేరు ప్రతిపాదించినప్పటికీ, అందుకు కిరణ్‌ విముఖత ప్రదర్శించారు.

అసలు రాహుల్‌ గాంధీ రాజకీయ భవిష్యత్తే గందరగోళంగా ఉండటం, కాంగ్రెస్‌ విధానాల్లో ఇంకా స్పష్టత లేకపోవడం వంటి అంశాలే, కిరణ్‌ విముఖతకు కారణంగా కనిపించాయి. అయితే ఏఐసీసీలో కీలకపదవి ఇస్తారని ఆశించినప్పటికీ, అది కూడా నెరవేరే సూచనలు కనిపించడం లేదు.

ఈలోగా బీజేపీ నేతలు ఆయనను సంప్రదించినట్లు తెలిసింది. ప్రధానంగా కిరణ్‌కుమార్‌రెడ్డి సేవలను తెలంగాణలో ఎక్కువగా వినియోగించుకునే లక్ష్యంతోనే, ఆయనను పార్టీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. తెలంగాణలోని రెడ్డి సామాజికవర్గంపై ప్రభావం చూపే స్థాయి నేత, బీజేపీలో లేరు.

దానితో.. ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలం పనిచేసి, సీఎంగా వ్యవహరించిన కిరణ్‌ సేవలను ఆమేరకు వినియోగించుకోవచ్చన్నది, బీజేపీ వ్యూహంలా కనిపిస్తోంది. కాంగ్రెస్‌లో ఉండగా, తెలంగాణలోని రెడ్డి ప్రముఖులు, కాంగ్రెస్‌ రెడ్డి నేతలతో కిరణ్‌ సన్నిహితంగా వ్యవహరించేవారు. కిరణ్‌ సీఎంగా ఉన్నప్పుడు.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వంటి నేతలు, ఆయనకు సన్నిహితంగా వ్యవహరించేవారు. ఇప్పుడు కిరణ్‌ ద్వారా వారిని బీజేపీ వైపు మళ్లించాలన్నది నాయకత్వం వ్యూహం.

అయితే.. రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించడంతోపాటు, కాంగ్రెస్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా జై సమైక్యాంధ్ర పార్టీ స్థాపించిన కిరణ్‌కుమార్‌రెడ్డి సేవలు, తెలంగాణలో ఏవిధంగా పనికివస్తాయన్న చర్చ బీజేపీ వర్గాల్లో జరుగుతుంది. అయితే ఇప్పుడు తెలంగాణ వాదానికి స్వయంగా కేసీఆరే తెరదించి.. జాతీయవాదాన్ని ఎత్తుకున్నందున, నాటి ప్రభావం ఉండదన్న వాదన కూడా లేకపోలేదు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఏపీలో కూడా పెట్టినందున, కిరణ్‌ రాకపై ఎవరికీ అభ్యంతరాలు ఉండకపోవచ్చంటున్నారు. అయితే క్రియాశీల రాజకీయాలకు చాలాకాలం పాటు దూరంగా ఉన్న కిరణ్‌, తాజా రాజకీయాల్లో సర్దుకుపోగలరా? రెడ్డి సామాజికవర్గాన్ని ఒకతాటిపైకి తెచ్చి, వారిని బీజేపీ వైపు మళ్లించగలరా? అన్న ప్రశ్నలు బీజేపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

‘మాజీ సీఎం స్థాయి నేత పార్టీలోకి రావడం మంచిదే. ఒక మాజీ సీఎం మా పార్టీలోకి వచ్చారంటే అది మాకు గర్వకారణమే కదా? అప్పుడు ఆయనకు బలం ఉండి సీఎం అయ్యారా? లేక అదృష్టం వరించి సీఎం అయ్యారా అన్నది అనవసరం. మాజీ సీఎం మాజీ సీఎం కదా? మా పార్టీ నాయకత్వం కూడా, మాజీ సీఎం అన్న కోణంలోనే చూస్తుంది. అయితే ఆయన వల్ల తెలంగాణలో పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. ఆంధ్రాలో అయితే కొంతవరకూ రెడ్లపై ప్రభావం చూపవచ్చేమో. అదీగాకపోతే చిత్తూరు జిల్లా వరకూ ప్రభావితం చూపగలిగినా పార్టీకి ఉపయోగమే. ఆయన పార్టీలో చేరుతున్నారని తెలుసు. తెలంగాణలో బాధ్యతలు అప్పగిస్తారన్న చర్చ ఉంది. అయితే అది ఎంతవరకూ ఫలిస్తుందో చూడాలి’ అని ఓ బీజేపీ రాష్ట్ర నేత వ్యాఖ్యానించారు.

 

LEAVE A RESPONSE