Suryaa.co.in

National Telangana

స్టాలిన్ వితండవాదం

– బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

గత రెండు నెలలుగా డీఎంకే పార్టీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వితండవాదం చేస్తున్నారు. దక్షిణ భారతదేశానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్యాయం చేసేందుకు కుట్ర చేస్తోందంటూ, దాన్ని ఎదుర్కొంటామనే విధంగా కేంద్ర ప్రభుత్వంపై అనేక విమర్శలు చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దక్షిణ భారతదేశంలోని ప్రముఖులతో సమావేశం నిర్వహిస్తామంటూ ప్రకటించడం పూర్తిగా రాజకీయ ప్రేరేపిత చర్య. ఇది రాజకీయ దురుద్దేశంతో కూడిన చర్య. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీతో పాటు, పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన డీలిమిటేషన్ అంశాలపై డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు అనుసరిస్తున్న వైఖరి దివాళాకోరుతనంతో కూడింది.

వచ్చే ఆరు నెలల్లో తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో డీఎంకే ఓడిపోనుంది. డీఎంకే పాలన, స్టాలిన్ కుటుంబ అవినీతి, దోపిడీ, నియంతృత్వ ధోరణిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. దాన్నుంచి తప్పించుకోవడానికి రాజకీయ నాటకాలు ఆడేందుకు సిద్ధమయ్యారు.

తమిళనాడులో తీవ్రమైన అవినీతి, రాష్ట్ర ప్రభుత్వం విధించిన అధిక పన్నులు, విద్యుత్ ఛార్జీల పెంపు, గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలను అమలు చేయకపోవడం ప్రజల్లో అసంతృప్తిని పెంచింది.

మోదీ ని, కేంద్ర ప్రభుత్వాన్ని, హిందీ భాషను, పార్లమెంటు నియోజకవర్గాలను బూచీగా చూపించి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. లిక్కర్ కుంభకోణంలో అనేక మంది డీఎంకే నాయకుల ప్రమేయం ఉంది. కోట్ల రూపాయల ప్రజాధన దోపిడీపై ప్రజల దృష్టి మరల్చేందుకు ఈ రాజకీయం చేస్తున్నారు.

జాతీయ నూతన విద్యావిధానం ఇప్పుడే కొత్తగా ప్రవేశపెట్టలేదు. 1986లో కాంగ్రెస్ హయాంలోనే డీఎంకే మిత్ర ప్రభుత్వం దీనిని ప్రవేశపెట్టింది. అప్పుడు వ్యతిరేకించలేదు. హిందీయేతర రాష్ట్రాలకు మరింతగా స్థానిక భాషలను ప్రోత్సహించే విధానాన్ని నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకువచ్చింది.

త్రిభాషా సిద్దాంతం బ్రిటిష్ కాలంలోనే ప్రారంభమైంది. నరేంద్రమోదీ గారు కొత్తగా ప్రవేశపెట్టలేదు. సి. రాజగోపాలాచారి గారి ఆలోచనలతోనే త్రిభాషా సిద్దాంతం వచ్చింది. గతంలో కాంగ్రెస్ హయాంలో కొటారి కమిటీ త్రిభాషా సిద్ధాంతాన్ని మరింత బలపరిచింది. ఇవన్నీ డీఎంకే నాయకత్వానికి తెలుసు.

మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఏ రాష్ట్రంపైన హిందీ భాషను బలవంతంగా రుద్దలేదు. ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు కాంగ్రెస్, డీఎంకే పార్టీలు తప్పుడు ప్రచారాలు చేస్తాయి. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ అంశంపై రాద్ధాంతం చేస్తున్నారు.

డీఎంకే ఎమ్మెల్యే కుమారుడు ఉదయ్ కుమార్ రూపొందించిన రూపాయి డిజైన్ లోగోను డీఎంకే ప్రభుత్వం మార్చింది. కాంగ్రెస్, వారి మిత్రపక్షాలు ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయో దీనితో అర్థమవుతుంది. 15 సంవత్సరాల క్రితం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రూపాయి లోగో రూపొందించారు. ఇప్పుడు దాన్ని మార్చారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ వైఖరి ప్రజలకు అర్థమవుతోంది.

2010లో రూపాయి లోగో ప్రవేశపెట్టబడింది. 2020లో నూతన విద్యావిధానం అమల్లోకి వచ్చింది. తమిళనాడులో రిజర్వ్ బ్యాంక్ రూపొందించిన కరెన్సీ చెల్లుబాటు అవుతుందా, కాదా? రాహుల్ గాంధీ చెప్పాలి.

ఎవరికి నచ్చిన భాషను వారు మాట్లాడుకోవచ్చు, చదువుకోవచ్చు. హిందీ భాషను ఎవరికైనా బలవంతంగా రుద్దలేదు. 1968లో వచ్చిన విద్యావిధానంలో కూడా త్రిభాషా సిద్ధాంతం ఉంది. 2020లో మోదీ గారు తెచ్చిన నూతన విద్యావిధానంలో ఫలానా భాషనే నేర్చుకోవాలని ఒత్తిడి లేదు.

కాంగ్రెస్, డీఎంకే పార్టీలు ఓట్ల కోసం ప్రజలను రెచ్చగొట్టాలని ప్రయత్నించడం దేశానికి ఏమాత్రం మంచిది కాదు. డీఎంకే పార్టీకి కష్టం వచ్చినప్పుడు, కాంగ్రెస్ ఓడిపోయినప్పుడే అనవసరమైన చర్చలను తెరపైకి తీసుకొస్తారు. రేవంత్ రెడ్డి, స్టాలిన్, రాహుల్ గాంధీ మాట్లాడిన వాస్తవ విషయాలను ప్రజలు తెలుసుకోవాలి.

ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించి, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎడ్యుకేషన్‌ను ఉమ్మడి జాబితాలోకి తీసుకువచ్చారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా త్రిభాషా సిద్ధాంతం అమలులో ఉంది. దేశంలో హిందీ భాష ఉండకూడదని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోందా? గత పదేళ్లుగా తమిళ భాషను ప్రోత్సహించేందుకు నరేంద్రమోదీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది.

గత నాలుగున్నరేళ్లలో తమిళ భాష ప్రోత్సాహానికి స్టాలిన్ గారు ఏం చేశారో చెప్పాలి. మహాకవి సుబ్రమణ్యభారతి గారి జయంతిని జాతీయ భాషా దినోత్సవంగా నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రకటించింది. తమిళులకు సంబంధించిన అతి ప్రాచీన విధానం ‘సింగోల్’. ఈ సింగోల్‌ను నూతన పార్లమెంటు భవనంలో స్పీకర్ సమక్షంలో సగౌరవంగా ప్రతిష్టించి, తమిళ గొప్పతనాన్ని చాటిచెప్పిన నరేంద్ర డీఎంకే పార్టీ మాకు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు.

కాశీ-తమిళ్ సంగమం, కాశీ-సౌరాష్ట్ర సంగమం, కాశీ-తెలుగు సంగమం పేరుతో ప్రతి సంవత్సరం కళాకారులు, సంగీత విద్వాంసులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం నరేంద్రమోదీ ప్రభుత్వం. తమిళ భాషలో పవిత్రమైన గ్రంథం తిరుకురల్. మోదీ ప్రభుత్వం ఆ పుస్తకాన్ని 13 భాషల్లోకి అనువదించి, ముద్రించి, ప్రోత్సహించింది.

తమిళ భాష, సంస్కృతిని ప్రోత్సహించేందుకు తిరువల్లువర్ కల్చరల్ సెంటర్లను కేంద్ర ప్రభుత్వం అనేక దేశాల్లో ఏర్పాటు చేసింది. న్యాయస్థాన తీర్పులు మాతృభాషలో ఉండాలని 2023లో కేంద్ర ప్రభుత్వం నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది.

జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తొలగించిన తర్వాత స్థానిక భాషలు కశ్మీరీ, డోగ్రీలను 75 ఏళ్ల తర్వాత అధికారికంగా గుర్తించిన ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానిది. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే నూతన విద్యావిధానం కీలకపాత్ర పోషించనుంది.

2009లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చివరిసారిగా లోక్ సభ స్థానాల పునర్విభజన జరిగింది. ఈరోజు వరకు కూడా ఆ యాక్టులో ఏ మార్పులు చేయలేదు. డీలిమిటేషన్ జరగాలంటే సెన్సెస్ జరగాలి. దీనిపై ఇంతవరకు స్పష్టత లేదు. సెన్సెస్ జరిగిన తర్వాత డీలిమిటేషన్ యాక్టును పార్లమెంటులో మళ్లీ ప్రవేశపెట్టాలి. కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు డీలిమిటేషన్ యాక్టుపై చర్చించలేదు.

కాంగ్రెస్ పార్టీ, డీఎంకే పార్టీలు….. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకోండి. మాకు ఏమాత్రం అభ్యంతరం లేదు. కాని తప్పుడు ప్రచారం చేయొద్దు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ ప్రతిపత్తిని దెబ్బతీస్తోంది. సుప్రీంకోర్టు, న్యాయవ్యవస్థలను దెబ్బతీస్తోంది, రాజ్యాంగబద్దమైన రిజర్వ్ బ్యాంక్ ను దెబ్బతీస్తోంది. చివరకు దేశ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి, దేశాన్ని రక్షిస్తున్న ఆర్మీని అవమానపరుస్తోంది.

రాజకీయ స్వలాభం కోసం కాంగ్రెస్ పార్టీ చట్టబద్ధమైన సంస్థలను దెబ్బతీయాలనుకోవడం మంచిది కాదు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసేందుకు యాక్షన్ ప్లాన్ లేకుండా, ప్రజలను మోసం చేస్తోంది.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో లక్షా 52 వేల కోట్ల అప్ప చేసింది. అప్పుల్లో, అవినీతిలో అన్నింటిలో గత కేసీఆర్ ప్రభుత్వంతో పోటీ పడేలా వ్యవహరిస్తోంది. గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ కట్టడానికే మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సంక్షేమ కార్యక్రమాలు ఎలా అమలు చేస్తామని అంటూనే… మరో లక్షా 50 వేల కోట్లకు పైగా అప్పు చేశారంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి, మీకు ఉన్న తేడా ఏంటి..? తెలంగాణ ప్రజలకు ఒరిగిందేంటి..? తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన మార్పు ఏంటి..?

ఇసుక వ్యాపారం, లిక్కర్ దోపిడీ, అక్రమ భూముల వ్యవహారం, భూముల అమ్మకాలు, అప్పులు చేయడం, అహంకారపూరిత వ్యవహారశైలి.. ఇవన్నింటిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తరహాలోనే ఉన్నాయి.

LEAVE A RESPONSE