Suryaa.co.in

Editorial

’కిషన్‌రెడ్డి కి ..‘టీటీడీ రవిప్రసాద్ ‘ ఎవరో తెలుసు!… కానీ లేఖ మాత్రం రాయలేదు!!

– సోషల్‌మీడియాలో హల్‌చల్ అవుతున్న కిషన్‌రెడ్డి-రవిప్రసాద్ ఫొటోలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త యలిశాల రవిప్రసాద్ టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమితుడైన వైనం బీజేపీని కుదిపేస్తోంది. తాను రవిప్రసాద్ పేరును సిఫార్సు చేయలేదని, అయినా తన పేరును దుర్వినియోగం అవుతున్నందున.. ఈ వ్యవహారంపై విచారణ జరిపి తగిన చర్య తీసుకోవాలని, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి శనివారం ఏపీ సీఎం జగన్‌కు లేఖ రాయాల్సివచ్చింది. మరోవైపు టీటీడీ బోర్డు మెంబర్ల కోసం, కేంద్రమంత్రులు ఇచ్చిన సిఫార్సు లేఖలను బయటపెట్టాలన్న డిమాండ్ ఊపందుకుంది.
హైదరాబాద్‌లోని వైష్ణోయ్ గ్రూప్ సీఎండీగా ఉన్న యలిశాల రవిప్రసాద్‌కు టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుడి పదవి దక్కడం వివాదాస్పదమయింది. వైసీపీకి ఎలాంటి సంబంధం లేని ఆయనకు ఆ హోదా ఎలా వచ్చిందని అటు వైసీపీ నేతలు.. బీజేపీలో ఎలాంటి పదవి లేనందున ఆయనకు ఎవరు సిఫార్సు చేశారని ఇటు బీజేపీ నేతలు తలపట్టుకున్నారు. ఈలోగా రవిప్రసాద్ గురించి తెలుసుకునేందుకు చాలామంది రంగంలోకి దిగారు. ఆయన ఎవరు? ఏం చేస్తుంటారు? కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేరు వినియోగించుకునేంత స్థాయికి ఎలా ఎదిగారు? అసలు కిషన్‌రెడ్డి ఆయనెవరో తెలియకుండానే లేఖ ఇచ్చారా? పోనీ కిషన్‌రె డ్డికి తెలియకుండా, ఎవరైనా ఏపీ బీజేపీ అగ్రనేతలెవ రయినా ఆయనతో మొహమాటపెట్టి సంతకం చేయించారా? అనే సందేహాలు బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
ఈ నేపథ్యంలో యలిశాల రవిప్రసాద్ కుటుంబం, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో ఉన్న ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ కావడం సంచలనం సృష్టించింది. కొద్దికాలం క్రితం అయోధ్య రామమందిర నిర్మాణానికి కోటి రూపాయల విరాళాన్ని, రవిప్రసాద్ కుటుంబం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేతులమీదుగా ఇస్తున్న ఫోటోలు, ఇప్పుడు వైరల్ అవుతుండటంతో.. టీటీడీ లేఖ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.
దీనితో కిషన్‌రెడ్డి సదరు రవిప్రసాద్‌కు పదవి సిఫార్సు చేశారా? లేదా అన్నది పక్కనపెడితే.. ఆయనతో కిషన్‌రెడ్డికి సత్సంబంధాలున్నాయన్న వాస్తవాన్ని ఆ ఫొటో స్పష్టం చేసిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో అయోధ్య మందిరానికి భారీ ఎత్తున విరాళమిచ్చినందుకు నజరానాగా, రవిప్రసాద్‌కు టీటీడీ బోర్డు మెంబరు పదవి లభించింన్న వ్యాఖ్యలు అటు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
అయితే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి, రవిప్రసాద్ ఎవరో తెలిసినా.. టీటీడీలో మెంబరు పదవికి మాత్రం, ఆయన సిఫార్సు చేసి ఉండకపోవచ్చని బీజేపీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ‘రోజూ చాలామంది కేంద్రమంత్రులు కలుస్తుంటారు. అంతమాత్రం చేత వారంతా ఆయనకు సన్నిహితులనుకుంటే ఎలా? ఇప్పుడు టీటీడీలో పదవి పొందిన రవిప్రసాద్ అనే వ్యక్తి కిషన్‌రెడ్డికి తెలిసే ఉండవచ్చు. అంతమాత్రాన ఆయనకు టీటీడీలో పదవి ఇవ్వాలని కిషన్‌రెడ్డి సిఫార్సు చేయలేదు కదా? ఒకవేళ లేఖ ఇచ్చి ఉంటే, దానిపై విచారణ జరిపించాలని కిషన్‌రెడ్డి స్వయంగా సీఎంకు ఎందుకు లేఖ రాస్తారు’ అని ఓ బీజేపీ నేత వ్యాఖ్యానించారు.

LEAVE A RESPONSE