బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు కుటుంబ, అవినీతి పార్టీలే
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
పాలమూరు: ప్రధాని ఈరోజు పాలమూరు గడ్డపై ఉన్నారు. సమ్మక్క సారక్కల పేరుతో ములుగులో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం ఎంతో గొప్ప విషయం. నేను ప్రధాని గారికి ధన్యవాదాలు చెబుతున్నాను.
పసుపు రైతులు బోర్డు కావాలని ఎన్నో ఏండ్లుగా ఉద్యమాలు చేశారు.. ఇవాళ తెలంగాణ రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకొని తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రధాని చెప్పారు. నేను తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలు చెబుతున్న.
అనేక పోరాటాలు, 1200 మంది ఆత్మబలిదానాలతో వచ్చిన తెలంగాణలో ఏం జరుగుతున్నదో మనం చూస్తున్నం. ఇంత దరిద్ర ముఖ్యమంత్రి ఎక్కడా చూడలేదు మనం. ప్రధాని మోదీ తెలంగాణలో అభివృద్ధి కార్య క్రమాల ప్రారంభించేందుకు వస్తే.. ముఖ్యమంత్రి హాజరు కారు. తొమ్మిదేండ్లలో 9 లక్షల కోట్లు ఇస్తే.. మాకేం ఇచ్చారు? మా కుటుంబానికి ఏం ఇచ్చారు? మా ఫామ్హౌజ్కు ఏమిచ్చారని అడుగుతున్నారు.
దేశంలో సిద్ధాంతపరంగా విభేదించే ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ.. తెలంగాణ ముఖ్యమంత్రిలా ఎవరూ లేరు. ఏ అభివృద్ధి కార్యక్రమానికైనా ప్రధాని తెలంగాణకు వస్తే.. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రారు. ఆయనకు తీరిక ఉండదు. మన ముఖ్యమంత్రి ఫామ్హౌజ్లో ఉంటాడు. ఆయన మాటలు కోటలు దాటుతాయి.. పనులు ప్రగతిభవన్ దాటవు.
నేను పాలమూరు గడ్డ మీది నుంచి అడుగుతున్నాను.. ఈ ముఖ్యమంత్రికి అభివృద్ధి అవసరం లేదు. తాను, తన కొడుకు,తన కుటుంబం కోసం నిజాంలాగా , రజాకార్ల లాగా ఆలోచిస్తున్నాడు. ఆయనకు ప్రజల సంక్షేమం అక్కరలేదు. గత 9 ఏండ్లలో మోదీ ప్రభుత్వం 9 లక్షల కోట్లు ఇచ్చింది. కేసీఆర్ ఇచ్చిన హామీలేమీ అమలు చేయలేదు.. దళిత ముఖ్యమంత్రి, డబుల్బెడ్ రూమ్ ఇండ్లు, నిరుద్యోగ భృతి ఏమీ ఇవ్వలేదు.
కాంగ్రెస్ పార్టీ తాను ఉన్నానంటూ.. ముందుకు వస్తున్నది. గతంలో కాంగ్రెస్ పార్టీ పాలన చూశాం. అవినీతి, కుటుంబ పార్టీ గురించి మనకు తెలుసు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు కుటుంబ, అవినీతి పార్టీలే.. ఈ రెండు పార్టీలు మజ్లిస్ పార్టీ తొత్తులు.
కాబట్టి బీజేపీని ఆదరించండి, మోడీ నాయకత్వాన్ని బలపర్చండి, అవినీతి లేని, సమర్థ పాలన అందిస్తాం. గొల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేద్దాం.. తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. గిరిజన వర్సిటీ, పసుపు బోర్డు ఇచ్చిన మోదీ గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.