– డిబేట్లు పెట్టి మాట్లాడుకోవడం మంచిది కాదు
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
హైదరాబాద్, ఏప్రిల్ 9: సీఎం జగన్మోహనరెడ్డి చెప్పినట్టుగానే రాష్ట్ర కేబినెట్ విస్తరణపై కసరత్తు జరుగుతోందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. శనివారం హైదరాబాద్లోని నివాసంలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై పనికిమాలిన ప్రతిపక్షాలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహనరెడ్డి పాత మంత్రులు అందరినీ తొలగిస్తానన్నారని, ఇప్పుడు భయపడుతున్నారంటూ గత రెండు రోజులుగా మీడియా సమావేశాలను పెట్టి మాట్లాడుతున్నారన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో కేబినెట్ గురించి సీఎం జగన్మోహనరెడ్డి చెప్పలేదన్నారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభల్లో కూడా మాట్లాడలేదన్నారు.
సీఎల్పీ సమావేశంలో సీఎం జగన్మోహనరెడ్డి మాట్లాడుతూ 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారని, అందరూ మంత్రి పదవులను ఆశిస్తారని మాత్రం చెప్పారన్నారు. మొదటి రెండున్నరేళ్ళు కొంత మందిని, మిగతా రెండున్నరేళ్ళు ఇంకొంత మందిని కేబినెట్లోకి తీసుకుంటే దాదాపు 50 మందికి అవకాశం ఇచ్చినట్టు అవుతుందని భావించారన్నారు. అదే సమయంలో కేబినెట్ మొత్తాన్ని మార్చలేమని స్పష్టం చేస్తూనే 80 శాతం వరకు చేర్పులు, మార్పులు ఉంటాయని తెలిపారన్నారు.
సీఎం జగన్మోహనరెడ్డి అనుకున్న ప్రకారం 5 శాతం తక్కువ, ఎక్కువ మార్పులు ఉండవచ్చని అనుకుంటున్నామని చెప్పారు. కేబినెట్ లోని 24 మంది రాజీనామాలు తీసుకునే ముందు చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, పనికిమాలిన ఛానల్స్ కు సీఎం జగన్మోహనరెడ్డి ఎక్కడా చెప్పలేదన్నారు. కేబినెట్ విస్తరణపై తమకు చెప్పిన విషయాలు గుర్తున్నాయని, ఆ విధంగానే సీఎం జగన్ ముందుకు వెళ్తున్నారన్నారు.
కేబినెట్, సీఎం జగన్మోహనరెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల గురించి మాకన్నా కొంత మంది వెధవలే ఎక్కువగా బాధపడుతున్నారని చెప్పారు. మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమీకరణలు ఉంటాయన్నారు. పాత, కొత్త మంత్రులు, అన్ని జిల్లాలు, కులాలకు ప్రాతినిధ్యంపై కూడా ఎంతో కసరత్తు చేయాల్సి ఉంటుందని, ప్రస్తుతం సీఎం జగన్మోహనరెడ్డి అదే చేస్తున్నారన్నారు.
సీఎం జగన్మోహనరెడ్డి టీంలోనే తాను ఉంటానన్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని నడిపే ఏదో ఒక టీంలో తనను ఉంచుతారని తెలిపారు. సీఎం జగన్మోహనరెడ్డి ఆలోచన మేరకు జరిగే కేబినెట్ కూర్పు, నిర్ణయాల గురించి డిబేట్లు పెట్టుకుని మాట్లాడుకోవడం అంత మంచిది కాదన్నారు. మంత్రివర్గ విస్తరణ వల్ల తనకేమీ సమస్య ఉండదని, పార్టీలోగాని, ప్రభుత్వంలో గాని ఉంటానని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు.