Suryaa.co.in

Andhra Pradesh

చెత్త పన్ను వసూలు చేయొద్దని మున్సిపల్ సహాయ కమిషన్ కు కొడాలి నాని ఆదేశం

-గుడివాడలో ‘గడప గడపకూ..’ కార్యక్రమంలో పాల్గొన్న కొడాలి నాని
-చెత్త పన్ను భారంగా ఉందన్న ప్రజలు
-చెత్తపై పన్ను చాలా ఇబ్బందిగా ఉంది.. సీఎంను కలుద్దామన్నా!- పేర్ని నానికి కొడాలి నాని ఫోన్

ప్రజల నుంచి చెత్త పన్ను వసూలు చేయవద్దని గుడివాడ మున్సిపల్ సహాయ కమిషనర్ ను వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ఆదేశించారు. గుడివాడలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెత్త పన్ను చెల్లించడం భారంగా ఉందని… పన్ను చెల్లించాలని వాలంటీర్లు ఒత్తిడి చేస్తున్నారని ప్రజలు కొడాలి నానికి చెప్పారు. దీంతో మున్సిపల్ సహాయ కమిషనర్ ను పిలిచి చెత్త పన్ను వసూలు చేయవద్దని ఇంతకు ముందే చెప్పాను కదా… మళ్లీ ఎందుకు వసూలు చేస్తున్నారని ప్రశ్నించారు.

చెత్త పన్ను వసూళ్లలో రాష్ట్రంలోనే గుడివాడ తొలి స్థానంలో ఉందని కొడాలి నానికి సహాయ కమిషనర్ తెలిపారు. దీంతో ఎంత వసూలవుతోందని నాని ప్రశ్నించగా.. రూ. 16 లక్షల వసూళ్లు టార్గెట్ కాగా రూ. 14 లక్షలు వసూలవుతోందని ఆయన చెప్పారు. ఈ మాత్రం దానికి ప్రజలపై పన్ను భారం వేయడం సరికాదని… ఇకపై చెత్త పన్ను వసూలు చేయవద్దని ఆదేశించారు.

మరోవైపు అక్కడి నుంచే మరో మాజీ మంత్రి పేర్ని నానికి కొడాలి నాని ఫోన్ చేశారు. ‘అన్నా… చెత్త పన్ను వసూళ్లు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి… ఈ విషయంలో ఒకసారి సీఎంను కలుద్దాం’ అని చెప్పారు.

LEAVE A RESPONSE