విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానాన్ని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వర రావు (నాని) దర్శించుకున్నారు. శుక్రవారం గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ తో కలిసి మంత్రి కొడాలి నాని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ అర్చకులు మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఆలయ మర్యాదలతో, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు.
ఆలయ కార్యనిర్వహణాధికారి డి భ్రమరాంబ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అమ్మవారి శేష వస్త్రాలతో ఘనంగా సత్కరించారు. అమ్మ వారి చిత్రపటాన్ని బహుకరించిన అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ అమ్మ వారి కృపతో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్టు చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి శ్రీ దుర్గా దేవి ఆశీస్సులను అందజేయాలని మంత్రి కొడాలి నాని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నేత వల్లూరిపల్లి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.