-
కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య
-
రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి దౌర్జన్యమే కారణమంటూ సూసైడ్ నోట్
-
తన ఇంటికి సీఎం సోదరులు అడ్డుగా గోడకట్టారని ఆవేదన
-
పశువుల దవాఖానా పేరుతో దారిలేకుండా గోడ కట్టడంతో ఆత్మహత్య
-
రెండుసార్లు కొండారెడ్డిపల్లి సర్పంచ్‌గా పనిచేసిన సాయిరెడ్డి
-
పురుగులమందు తాగి బలవన్మరణం
-
సీఎం సోదరులే కారణమంటూ మరణవాంగూల్మం
-
సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న సాయిరెడ్డి సూసైడ్‌నోట్
-
ఇది రేవంత్ సోదరుల హత్యేనన్న కేటీఆర్
-
సూసైడ్‌నోట్ ఆధారంగా రేవంత్ సోదరులపై కేసు పెట్టాలని బీఆర్‌ఎస్ నేతల డిమాండ్
-
తాజాగా కొడంగల్‌లో ఫార్మా కంపెనీల భూసేకరణను అడ్డుకున్న గ్రామస్తులు
-
సీఎం సోదరులు తమను బెదిరిస్తున్నారంటూ ఢిల్లీకి వెళ్లి గళమెత్తిన బాధితులు
-
ఇప్పుడు మళ్లీ రేవంత్ సొంత గ్రామ మాజీ సర్పంచ్ సైతం రేవంత్ సోదరుల వేధింపులతోనే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ బలవన్మరణం
-
నిన్న కొడంగల్.. నేడు కొండారెడ్డిపల్లి
-
కొడం‘ఘొల్లు’
( మార్తి సుబ్రహ్మణ్యం)
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఆయన బలమైన కోట అయిన కొడంగల్‌లో, రేవంత్‌కు వ్యతిరేక పవనాలు వీస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలే ఆయన సొంత కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో.. ఫార్మా కంపెనీలకు భూసేకరణను అడ్డుకున్న రైతులు, జిల్లాకలెక్టర్‌పై తిరుగుబాటు చేసిన ఫలితంగా వారంతా జైల్లో ఉన్న నే పథ్యంలో.. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి సొంత గ్రామమైన వంగూరు మండలం కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్, వృద్ధుడైన పాముకుంట్ల సాయిరెడ్డి (85)బలవన్మరణానికి పాల్పడిన వైనం సంచలనం సృష్టించింది.
తన చావుకు సీఎం రేవంత్‌రెడ్డి సోదరులే కారణమంటూ, ఆయన రాసిన సూసైడ్‌నోట్ ఇప్పుడు సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది. కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో ఫార్మా కంపెనీలకు భూసేకరణ, తాజాగా మాజీ సర్పంచ్ బలవన్మరణం రెండు అంశాల్లో సీఎం రేవంత్‌రెడ్డి సోదరులే కేంద్రబిందువులన్న ఆరోపణలు వెల్లువెత్తడం ప్రస్తావనార్హం. దానికి తోడు రేవంత్‌రెడ్డి సోదరులపై బీఆర్‌ఎస్, బీజేపీ తరచూ ఆరోపణాస్త్రాలు సంధించడం రేవంత్‌కు రాజకీయంగా ఇబ్బందికరంగా పరిణమించింది.
సీఎం రేవంత్‌రెడ్డికి బ్రద ర్స్ స్ట్రోక్ పెరుగుతోంది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజవర్గం లగచర్లలో, ఫార్మాకంపెనీలకు భూసేకరణను నియోజక వర్గ రైతులు అడ్డుకుంటున్నారు. వారిలో గిరిజనులే ఎక్కువగా ఉండటం ప్రస్తావనార్హం. తమ పొలాలు ఇచ్చేది లేదంటూ అడ్డం తిరుగుతున్నారు. ఈ క్రమంలో అక్కడికి ప్రజాభిప్రాయసేకరణకు వచ్చిన కలెక్టర్‌పై రైతులు తిరుగుబాటు చేసి, ఆయనపై చేసు చేసుకున్న వైనం తెలంగాణను ఉలిక్కిపడేలా చేసింది.
ఫలితంగా డజన్ల మంది గిరిజన రైతులను అరెస్టు చేసి, జైలుకు పంపిన వైనంపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. ఈ ఘటనకు కారకుడిగా అనుమానిస్తున్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని అరెస్టు చేసి, జైలుకు పంపిన విషయం తెలిసిందే. బీజేపీ ఎంపి డికె అరుణను అడ్డుకున్న పోలీసులు, సీఎం రేవంత్ సోదరులను మాత్రం ఎస్కార్టు ఇచ్చి పంపించడాన్ని బీజేపీ రచ్చ చేసింది. ఈ ఘటన సీఎం రేవంత్ సొంత నియోజకవర్గంలోనే జరగడం, బాధితులను బీఆర్‌ఎస్ నేతలు ఢిల్లీకి తీసుకువెళ్లి జాతీయ మానవ హక్కుల కమిషన్, ఎస్టీ కమిషన్ ఎదుట వారిని హాజరపరచటంతో, లగచర్ల వ్యవహారం ఢిల్లీకి పాకినట్లయింది.
తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో, రెండుసార్లు సర్పంచ్‌గా గెలిచిన సాయిరెడ్డి అనే వృద్ధుడు.. తాను సీఎం రేవంత్‌రెడ్డి సోదరుల దాష్టీకాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటానని, పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడిన వైనం ఉలిక్కిపడేలా చేసింది. తాను 40 ఏళ్ల క్రితం కట్టుకున్న ఇంటిముందు పశువుల ఆసుపత్రి కట్టడమే కాకుండా, ఇంటికి దారిలేకుండా అడ్డంగా గోడక ట్టేందుకు పూనుకున్న వైనం ఆయనను ఆత్మహత్యకు ప్రేరేపించింది.
ఆసుపత్రి నిర్మాణానికి తానెలాంటి అభ్యంతరం చెప్పలేదని, ఇంటికి వెళ్లడానికి వెనకనుంచి స్థలం అడిగానని ఆయన తన లేఖలో వివరించారు. తొలుత దారి ఇస్తామని చెప్పి, ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి సోదరులు.. తనపై పార్టీల నిందమోపి ఇంటి దారికి అడ్డంగా గోడ నిర్మించపూనారని వెల్లడించారు.
‘‘నాకు ఇలాంటి పరిస్థితి వస్తుందనుకోలేదు. నా ఇంటికే దారి ఉండదనుకోలేదు. అందుకే బాధతో చనిపోతున్నా’’నంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిషయాన్ని సాయిరెడ్డి తన సూసైడ్‌నోట్‌లో స్పష్టం చేశారు. అయితే కొద్దినెలల క్రితం ఒక యూట్యూబ్ చానెల్‌లో.. తమకు వ్యతిరేకంగా మాట్లాడినందుకే, సాయిరెడ్డిపై రేవంత్‌రెడ్డి సోదరులు కక్షకట్టారన్నది బీఆర్‌ఎస్ ఆరోపణ.
తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి సొంత గ్రామంలో, ఆయన సోదరుల దాష్టీకం వల్ల వృద్ధుడైన మాజీ సర్పంచ్ బలవన్మరణానికి పాల్పడ్డ వైనాన్ని.. బీఆర్‌ఎస్ బ్రహ్మాస్త్రంగా మలిచి కాంగ్రెస్‌పై సంధించడంతో, అధికార పార్టీ సహజంగా ఆత్మరక్షణలో పడింది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు, మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, దాసోజు శ్రవణ్ తదితర నే తలంతా ఇది సీఎం రేవంత్‌రెడ్డి సోదరులు చేసిన హత్య అని, సాయిరెడ్డి సూసైడ్ నోట్ ఆధారంగా వారిపై హత్యాయత్న కేసు నమోదు చేయాలన్న డిమాండ్‌కు పదునుపెడుతున్నారు. సీఎం సొంత గ్రామంలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య అంశం.. చివరకు ఏ మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ, తెలంగాణ రాజకీయ వర్గాల్లో కనిపిస్తోంది.
అది రేవంత్ సోదరులు చేసిన హత్య: కేటీఆర్
హైదరాబాద్ : సీఎం స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పాముకుంట్ల సాయిరెడ్డిది ఆత్మహత్య కానే కాదు.. ముఖ్యమంత్రి సోదరులు చేసిన హత్యనే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. పోలీసులు సూసైడ్ నోట్ ఆధారంగా అనుముల బ్రదర్స్ పై కేసు నమోదుచేసి సమగ్ర దర్యాప్తు జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రదర్స్ అరాచకాలు తట్టుకోలేక సీఎం స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పాముకుంట్ల సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం. ఇది ఆత్మహత్య కానే కాదు.. ముఖ్యమంత్రి సోదరులు చేసిన హత్య ఇది.
ఆరు నెలల క్రితం ఒక యూట్యూబ్ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారనే కక్షతో.. 40 ఏళ్ల క్రితం కట్టుకున్న ఇంటి ముందు పశువుల దవాఖానాను కట్టడమే కాకుండా.. సీఎం ఆదేశాలతో ఇంటికి దారి కూడా లేకుండా అడ్డంగా గోడ కట్టేందుకు పూనుకోవడంతోనే తీవ్ర మనస్థాపానికి గురై సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.
రెండుసార్లు కొండారెడ్డిపల్లికి సర్పంచ్‌గా ఎన్నో సేవలందించిన వ్యక్తిని గౌరవించాల్సింది పోయి, 85 ఏళ్ల వయస్సున్న పెద్దాయన అని కూడా చూడకుండా గత కొన్ని నెలలుగా వేధింపులకు గురిచేయడంతో తట్టుకోలేకే చివరికి పురుగుల మందుతాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ లో చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి బ్రదర్స్ తనపై కక్ష కట్టడం వల్లే చనిపోతున్నానని సాయిరెడ్డి స్పష్టంచేసిన నేపథ్యంలో.. దీనికి సీఎం రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలి. పోలీసులు సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదుచేసి సమగ్ర దర్యాప్తు జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇటీవల సొంత నియోజకవర్గం కొడంగల్‌లో గిరిజన ఆడబిడ్డలపై దమనకాండను దేశం మరిచిపోకముందే.. సీఎం సొంత గ్రామంలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన చూస్తుంటే.. రాష్ట్రంలో సీఎం, ఆయన సోదరుల ఆరచకాలకు అంతేలేకుండా పోయిందని స్పష్టమవుతోంది. ఇది ప్రజాపాలన కాదు.. అరాచక పాలన, నియంత పాలన, దుర్మార్గపు పాలన అని కేటీఆర్ మండిపడ్డారు
రేవంత్ అన్నదమ్ములపై హత్యా నేరం పెట్టాలి: హరీశ్ రావు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లె మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారని, ఇది తనను కలచివేసిందని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. సాక్షాత్తు సీఎం సొంత గ్రామంలో ఉన్న దారుణ పరిస్థితికి సాయిరెడ్డి ఆత్మహత్య నిదర్శనమని పేర్కొన్నారు.
“రేవంత్… నీ సొంత గ్రామ మాజీ సర్పంచ్ ను ఆత్మహత్యకు ఉసిగొల్పిన వాళ్లపై చట్టరీత్యా చర్యలకు సిద్ధమా? మీ అన్నదమ్ముల అరాచకాలు శృతి మించాయనడానికి ఇది నిదర్శనం కాదా? సాయిరెడ్డి మృతికి కారణమైన మీ అన్నదమ్ములపై చట్టరీత్యా హత్యా నేరం పెట్టాలి” అని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. ఈ మేరకు మాజీ సర్పంచ్ రాసిన సూసైడ్ నోట్ ను ఆయన ట్వీట్‌లో జత చేశారు.