– రెడ్కో మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్ రెడ్డి
హైదరాబాద్: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉందని నిరూపించింది. నిజానిదే అంతిమ విజయం అని కూడారుజువైంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కాంగ్రెస్ సిఫారసు చేసిన కోదండరాం రెడ్డి, అమీర్ అలీ పదవులను సుప్రీంకోర్టు రద్దు చేయడం సంతోషకరం.
గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేసి ఇద్దరు బడుగు, బలహీన వర్గాల బిడ్డలను చట్టసభలకు వెళ్లకుండా కాంగ్రెస్, బీజేపీలు ఆనాడు కుట్రలు చేశాయి. దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పేర్లను బీఆర్ఎస్ ప్రభుత్వం సిఫారసు చేస్తే ఆనాటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆ ఫైల్ ను ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టి వారికి అన్యాయం చేశారు.
వారి నుంచిబలవంతంగా ఆ పదవులను లాక్కుని కోదండరాంకు ఇచ్చారు. అక్రమంగా పదవులు గుంజుకున్నందుకు సుప్రీంకోర్టు తగిన బుద్ధి చెప్పింది.
కాంగ్రెస్ పార్టీ మోసపూరిత రాజకీయాలను కోదండరాం రెడ్డి ఇకనైనా గుర్తించాలి. అది నిలబడే పదవి కాదని, అక్రమంగా లాక్కున్నదని తెలిసి కూడా ఆయనను అందులో కూర్చోబెట్టారు. మోసాన్ని గమనించకుండా కోదండరాం రెడ్డి పదవివ్యామోహంలో మునిగిపోయారు. ప్రజలు, నిరుద్యోగుల గొంతుకనని పదేళ్లు మొత్తుకున్న కోదండరాం.. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పదవి రాగానే అన్నీ మరిచిపోయారు.
నమ్మించి ఓట్లేయించుకున్న నిరుద్యోగుల వైపు కన్నెత్తి చూడటం కూడా మానేశారు. ఇప్పుడేమో ఆ పదవే పోయింది. ఇప్పటికైనా కాంగ్రెస్ కుట్రపూరిత రాజకీయాలను కోదండరాం రెడ్డి అర్థం చేసుకోవాలి.