ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతోనే నాడు తన తండ్రి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణంలో పాలు పంచుకున్నారని తెలుగుదేశం పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు యువ నేత డాక్టర్ కోడెల శివరాం తెలిపారు.స్వర్గీయ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ కేర్ హాస్పిటల్ సహకారంతో సత్తెనపల్లి రూరల్ మండలం లక్కరాజు గార్లపాడు గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యువ నేత డాక్టర్ కోడెల శివరాం ముందుగా అన్న నందమూరి తారకరామారావు, స్వర్గీయ డాక్టర్ కోడెల శివప్రసాదరావుల ప్రతిమలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా యువ నేత డాక్టర్ కోడెల శివరాం మాట్లాడుతూ క్యాన్సర్ రోగానికి ప్రతి ఒక్కరికి అందుబాటులో మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో అన్న నందమూరి తారక రామారావు క్యాన్సర్ కేర్ హాస్పిటల్ నిర్మాణం చేపట్టినప్పుడు తన తండ్రి స్వర్గీయ డాక్టర్ కోడెల శివప్రసాదరావు కి అప్పజెప్పిన బాధ్యతలును దిగ్విజయంగా పూర్తి చేశారన్నారు.
అంతేకాకుండా తన తండ్రి ప్రతి ఒక్కరు అవయవదానంలో పాలుపంచుకోవాలని ఉన్నతమైన ఆశయంతో గిన్నిస్ రికార్డు స్థాయిలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు .అదేవిధంగా తన తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ రాజకీయంగానే కాక సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటామని యువ నేత డాక్టర్ కోడెల శివరాం తెలిపారు. తన తండ్రి పేరు మీద ట్రస్టు ఏర్పాటు చేసిన నాటి నుండి నేటి వరకు ఉచిత మెగా వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, సామాజిక సేవా కార్యక్రమాలు, బసవ తారక రామా క్యాన్సర్ కేర్ హాస్పిటల్ నందు ప్రతి శనివారం ఉచిత అన్నదాన కార్యక్రమం వంటి అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని డాక్టర్ కోడెల శివరాం తెలిపారు.
అనంతరం గ్రామాల్లోని ప్రజలు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యానికి సంబంధించిన వైద్య పరీక్షలు పూర్తి స్థాయిలో ఉచితంగా చేయించుకున్నారు. ఈ ఉచిత వైద్య శిబిరం నందు ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ అయిన వారికి తగిన ట్రీట్మెంట్ అందజేయడం జరుగుతుందని వైద్య అధికారులు తెలిపారు. గ్రామ స్థాయిలో ఇటువంటి అత్యున్నతమైన హాస్పిటల్ యొక్క వైద్య శిబిరాన్ని ఉచితంగా ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని వైద్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు యువ నేత డాక్టర్ కోడెల శివరాం కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.