Suryaa.co.in

Telangana

రవ్వంత నిజం లేదు.. బండెడు బొంకులు.. ‘వంద’ అబద్ధాలు..

రేవంత్‌, బండి సంజయ్‌ ను ఎండగట్టిన మంత్రి కేటీఆర్‌

కేసీఆర్‌ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తుంటే, ఆయన కొడుకు కేటీఆర్‌ ప్రశ్నపత్రాలు లీక్‌ చేసి అమ్ముకొంటున్నారు. ప్రశ్నపత్రాల లీక్‌ విషయంలో కేటీఆర్‌ పీఏ తిరుపతికి సంబంధం ఉన్నది. తిరుపతి సొంత మండలం మల్యాల. ఈ మండలంలో గ్రూప్‌ – 1 పరీక్ష వంద మంది రాయగా, వారందరికీ వందకు పైగా మార్కులు వచ్చాయి. కేటీఆర్‌ పీఏ వీరందరికి ప్రశ్నపత్రాలు అందించాడు. టీఎస్‌పీఎస్సీలో పెద్ద తలకాయలను తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.

-ఈ నెల 18న కామారెడ్డిలో రేవంత్‌రెడ్డి
జగిత్యాల జిల్లాలోని ఒక మండలం నుంచి 50 మందికి పైగా అర్హత సాధించినట్టు సమాచారం ఉన్నది. చిన్న గ్రామం నుంచి ఆరుగురు క్వాలిఫై అయ్యారు. ఇందులో నలుగురు సర్పంచుల కొడుకులు, ఒకరు సింగిల్‌ విండో చైర్మన్‌ కొడుకు, మరొకరు జడ్పీటీసీ బాడీగార్డ్‌గా పనిచేసే వ్యక్తి కొడుకు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కొడుకు సైతం క్వాలిఫై అయ్యారు. ఒక సర్పంచ్‌ కొడుకు క్వాలిఫై అయ్యేందుకు అవకాశం లేకున్నా క్వాలిఫై చేశారు. సీఎం కొడుక్కు సన్నిహితంగా ఉండే వ్యక్తే ఇదంతా చేశాడు. ఒక్కొక్కరి దగ్గర రూ.3 నుంచి రూ.5 లక్షలు తీసుకొని చేశాడు. ప్రశ్నపత్రాల లీకేజీపై మంత్రి కేటీఆర్‌ నిర్వాకంపై అతి త్వరలోనే పూర్తి వివరాలు బయటపెడుతాం.

– ఈ నెల 19న బండి సంజయ్‌
సిరిసిల్ల జిల్లాలో మొత్తంలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌కు 4,205 మంది దరఖాస్తు చేసుకొంటే, 3,254 మంది పరీక్ష రాశారు. ఇందులో 255 మందికి 23 నుంచి 90 మధ్య మార్కులు వచ్చాయి. వీరిలో ఒక్కరికి కూడా వంద మార్కులు రాలేదు.
జగిత్యాల జిల్లా మొత్తంలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో వందకుపైగా మార్కులు సాధించినవారు కేవలం ఒక్కరు.
మల్యాల మండలంలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రాసినవారు 417 మంది. వీరిలో అర్హత సాధించింది కేవలం 35 మంది.
తిరుపతి ఊరు పోతారంలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రాసింది ముగ్గురే. ఆ ముగ్గురిలోనూ ఒక్కరూ అర్హత సాధించలేదు.
మల్యాల మండల కేంద్రంలో పరీక్ష రాసింది ముగ్గురైతే ఒక్కరే క్వాలిఫై అయ్యారు.

పేపర్‌ లీకేజీపై బండి, రేవంత్‌ కారు కూతలు.. ఇజ్జత్‌ లేకుండా మాట్లాడితే సహించం జగిత్యాల జిల్లాలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో వంద మార్కులు వచ్చింది ఒక్క అభ్యర్థికే నా పీఏ ఊర్లో ఎవరూ క్వాలిఫై కాలే.. సిరిసిల్ల జిల్లాలో వంద మార్కులొచ్చినోళ్లే లేరు గుజరాత్‌లో 13 సార్లు పేపర్లు లీక్‌.. ఎందరు అధికారులను, మంత్రులను తీసేశారు?

సిరిసిల్ల పర్యటనలో బీజేపీ, కాంగ్రెస్‌ నేతల తీరుపై నిప్పులు చెరిగిన మంత్రి కేటీఆర్‌
గ్రూప్‌-1 ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో తలాతోకా లేకుండా, ఆధారరహితంగా ఆరోపణలు చేసిన బీజేపీ, కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుల తీరుపై మంత్రి కేటీఆర్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక్కొక్క ఆరోపణను ఎండగడుతూ.. వాస్తవాలను ఆధారాలతో సహా వివరించారు. అంకెలను ప్రజల ముందుపెట్టి అబద్ధాల గుట్టురట్టు చేశారు. టీఎస్‌పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజీ వ్యహారంలో కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఇజ్జత్‌ మానం లేకుండా అబద్ధాలు చెప్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు విమర్శించారు. తన పీఏ తిరుపతి సొంత మండలం మల్యాలకు చెందినవారికి ఒక్కరికి కూడా గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో వంద మార్కులు రాకున్నా, ప్రతిపక్ష నేతలు బట్టకాల్చి మీదవేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బండి సంజయ్‌, రేవంత్‌రెడ్డి ఎన్నడైనా పరీక్షలు రాశారా? అని ఎద్దేవా చేశారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన బీఆర్‌ఎస్‌ అత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. పేపర్‌ లీకేజీపై కాంగ్రెస్‌, బీజేపీ నేతల ఆరోపణలను తిప్పికొట్టారు. స్పష్టమైన ఆధారాలతో బండి, రేవంత్‌ బండారాన్ని బయటపెట్టారు.

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక్కరికి కూడా వంద మార్కులు రాలేదని మంత్రి కేటీఆర్‌ స్పష్టంచేశారు. ‘నేను పేపర్‌ లీక్‌ చేసి అమ్ముకొని బతుకుతున్నానంటుండ్రు. నాతో పదిహేను పదహారేండ్లసంది ఉంటున్న పీఏ తిరుపతిపై పడ్డరు. నేను తీసిన అధికారిక లెక్కలు మీముందు పెడుతున్న. కారుకూతలు కూసిన సన్నాసులు రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌ యాడున్నరో.. జెర వినుండ్రి. మల్యాల మండలంలో 417 మంది అభ్యర్థులు గ్రూప్‌ -1 ప్రిలిమ్స్‌ రాస్తే 35 మంది మాత్రమే అర్హత సాధించారు. కానీ బండి సంజయ్‌, రేవంత్‌ మాత్రం వంద మందికి వందకు పైగా మార్కులు వచ్చాయని చెప్తున్నరు. జగిత్యాల జిల్లా మొత్తంలో ఒకే ఒక్కరికి వందకు పైగా మార్కులు వచ్చాయి. మల్యాలలో వంద మందికి వందకు పైగా మార్కులొచ్చాయని పనికిమాలిన మాటలు మాట్లాడిన రేవంత్‌రెడ్డి.. నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావ్‌? నా పీఏ తిరుపతి ఊరు పోతారంలో పరీక్ష రాసింది ముగ్గురే. ఆ ముగ్గురిలోనూ ఒక్కరూ క్వాలిఫై కాలేదు. ఇక మల్యాల మండల కేంద్రంలో ముగ్గురు పరీక్ష రాస్తే ఒక్కరే అర్హత సాధించారు. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం 4,205 మంది అభ్యర్థులు గ్రూప్‌-1 కోసం దరఖాస్తు చేసుకొంటే, అందులో 3,254 మంది పరీక్ష రాశారు. ఇందులో 255 మందికి 23 నుంచి 90 మధ్య మార్కులు వచ్చాయి. ఒక్కరికి కూడా వంద మార్కులు రాలేదు. నేను పేపర్‌ లీక్‌ చేసింది నిజమే అయితే నా జిల్లాలో ఒక్కరికి కూడా వందకు పైగా మార్కులు ఎందుకు రాలేదో బండి, రేవంత్‌ చెప్పాలి. ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్‌లో గత ఎనిమిదేండ్లలో 13 పేపర్లు లీక్‌ అయితే, అక్కడ ఎవడైనా మంత్రి, ముఖ్యమంత్రి రాజీనామా చేశారా? ఒక్క అధికారినైనా తీసేశారా? నిజామాబాద్‌ ఎంపీ రాజస్థాన్‌ నుంచి ఫేక్‌ డిగ్రీ పట్టా తెచ్చుకొని దొరికిపోయిండు. గుజరాతోళ్ల చెప్పులు మోసేటోడు తెలంగాణలో పుట్టడం దౌర్భాగ్యం. పేపర్‌ లీక్‌పై అనవసర ఆరోపణలు చేస్తే సహించేది లేదు’ అని హెచ్చరించారు. ఇటీవలి వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్‌ ఎకరానికి రూ.10 వేలు ప్రకటిస్తే బండి సంజయ్‌ తప్పు పడుతున్నారని, ఆయన కేంద్రం నుంచి రైతులకు ఎకరానికి రూ.లక్ష ఇప్పిస్తే తాము వద్దంటున్నామా? అని ప్రశ్నించారు.

తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పగబట్టిందని మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. పీక్‌ అవర్‌లో కరెంటు చార్జీలు పెంచాలని, లేదంటే పవర్‌ కట్‌ చేయాలని కేంద్రం రాష్ర్టాలను ఆదేశించటంపై తీవ్రంగా స్పందించారు. ‘కేంద్రం తీరు ఆకలి అయినప్పుడు అన్నం పెట్టవద్దు.. కడుపు నిండిన తర్వాతే పెట్టాలన్నట్టుగా ఉన్నది. కేంద్రం దుర్మార్గపు ఆలోచనకు సిగ్గు, శరం లేకుండా సన్నాసులు వంత పాడుతున్నారు. సింగరేణి, కోల్‌ ఇండియా ప్రభుత్వ సంస్థలకు మన దగ్గరే కాకుండా జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌లో బొగ్గు గనులున్నాయి. దేశంలో 361 బిలియన్‌ మెట్రిక్‌ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నప్పటికీ అదానీ కోసం అస్ట్రేలియా నుంచి బొగ్గు దిగుమతికి ఒప్పందం చేసుకొన్నారు. ఇక్కడ రూ.3 వేలకు టన్ను దొరికే బొగ్గును వదులుకొని, దోస్తుకు దోచి పెట్టేందుకు పదిరెట్లు ధర ఉన్న బొగ్గు కొనాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. అదానీ కోసం ఎంతకైనా తెగించి, ఆయన ఇచ్చే చందాల కోసం దిగజారి పాలసీ తెచ్చినోడు సిగ్గులేని నరేంద్రమోదీ’ అని నిప్పులు చెరిగారు.

రాష్ట్రంలోని పంచాయతీలకు త్వరలో రూ.1,300 కోట్లు విడుదల చేయనున్నట్టు మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. రూ.కోటి బకాయి ఉన్న పంచాయతీలకే తొలుత నిధులు విడుదల చేస్తున్నట్టు చెప్పారు. రాజకీయంగా వైరుధ్యం ఉన్నప్పటికి కేంద్రం ఎంపికచేసే ఉత్తమ పంచాయతీల్లో ప్రతి 20లో 19 తెలంగాణ పంచాయతీలే అవార్డులు సాధించాయని గుర్తు చేశారు. ఉత్తమ గ్రామ పంచాయతీలు, మున్సిపాల్టీలు అత్యధిక శాతం తెలంగాణలో ఉండటం సీఎం కేసీఆర్‌ కార్యదక్షతకు నిదర్శనమని పేర్కొన్నారు. దళిత బంధు పథకం అమలులో సిరిసిల్ల జిల్లా రాష్ర్టానికే ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. దళిత బంధు పథకం కింద ముగ్గురు లబ్ధిదారులు కలిసి రైసు మిల్లు ఏర్పాటు చేయడాన్ని అభినందించారు. చాలామంది కార్లు, టాక్సీలు కొంటున్న సమయంలో రైసు మిల్లు ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచన అద్భుతమని ప్రశంసించారు. కాగా బలగం సినిమా దర్శకుడు వేణును మంత్రి అభినందించారు. బలగం సినిమాను తాను తన కుటుంబ సభ్యులతో కలిసి చూసినట్టు చెప్పారు. ఆత్మీయ సమ్మేళనం వేదికపై వేణును కేటీఆర్‌ సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, ఎమ్మెల్సీ రమణ, ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేశ్‌బాబు, సుంకె రవిశంకర్‌, రసమయి బాలకిషన్‌, నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, టీఎస్‌టీపీడీసీ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌, సెస్‌ చైర్మన్‌ చిక్కాల రామారావు, ఆర్‌బీఎస్‌ జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, గ్రంథాలయ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు జిందం కళ, రామతీర్థపు మాధవి తదితరులు పాల్గొన్నారు.

సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్‌ విస్తృతంగా పర్యటించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాల్లో బిజీగా గడిపారు. ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్‌ గ్రామంలో దళితబంధు పథకం కింద లబ్ధిదారులు ఏర్పాటు చేసుకొన్న రైస్‌మిల్లును ప్రారంభించారు. సిరిసిల్ల పట్టణంలోని అంబా భవానీ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన జిల్లా రేషన్‌ డీలర్ల పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. సంజీవయ్యనగర్‌లో హిమాన్సి పిల్లల దవాఖానను ప్రారంభించి సమీకృత కలెక్టరేట్‌కు చేరుకొన్నారు. సిరిసిల్ల డిపో నుంచి కాకినాడ, వరంగల్‌కు నూతన బస్‌ సర్వీసులను ప్రారంభించారు. కలెక్టరేట్‌లో 27 ఉత్తమ గ్రామ పంచాయతీల సర్పంచులకు అవార్డులను ప్రదానం చేశారు. అక్కడే ట్రాన్స్‌జెండర్లతో ముచ్చటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. తర్వాత పద్మనాయక కల్యాణ మండపంలో బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సమావేశం ముగిసిన అనంతరం ఇటీవల మృతిచెందిన బీవై నగర్‌కు చెందిన చిటికెన నవీన్‌ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల శివారులోని రంగనాయక సాగర్‌ కాలువ ద్వారా సోమవారం కాళేశ్వర జలాలు రావడంతో మంత్రి కేటీఆర్‌ పూజలు చేశారు.

LEAVE A RESPONSE