Suryaa.co.in

Telangana

మా ఎమ్మెల్యేలకు ప్రొటోకాల్ పాటించరా?

-బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హక్కులను కాలరాస్తూ ప్రోటోకాల్ ఉల్లంఘనలు
-అహంకారపూరితంగా ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్న ప్రభుత్వం
-బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాదని కాంగ్రెస్ నేతలకు సంక్షేమ పథకాల పంపిణీ బాధ్యతలు
-శాసస సభ్యుల హక్కులను ఉద్దేశపూర్వకంగా కాలరాస్తున్న రేవంత్ సర్కార్
-ఎమ్మెల్యేల హక్కులు, ప్రోటాకాల్ ఉల్లంఘనలు జరగకుండా అడ్డుకోవాలన్న కేటీఆర్
-సీఎస్, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి
-అవసరమైతే ఈ అంశాన్ని అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తుతాం
-స్పీకర్ గడ్డం ప్రసాద్ కు కేటీఆర్ బహిరంగ లేఖ

హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హక్కులను కాలరాసే విధంగా కొత్త సంస్కృతిని తీసుకొచ్చింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు లేని చోట కావాలనే ప్రభుత్వం విపక్ష ఎమ్మెల్యే హక్కులకు భంగం కలిగిస్తోంది. ప్రతి సందర్భంలో ప్రోటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడుతూ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించటం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారింది.

ఇది ప్రజాస్వామ్యం.దేశంలో ఇలాంటి సంప్రదాయం ఎంత మాత్రం మంచిది కాదు. బీఆర్ఎస్ పార్టీ దాదాపు పదేళ్లు అధికారంలో ఉంది. కానీ ఎప్పుడూ ఇలాంటి దారుణాలకు పాల్పడ లేదు. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలను మా ప్రభుత్వం గౌరవించింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కావాలనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ ప్రోటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడుతోంది.

ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలకు స్థానిక నియోజకవర్గంలో జరిగే ఏ పనికి సంబంధించైనా ప్రోటోకాల్ ఉంటుందని మీకు తెలియంది కాదు. కానీ కాంగ్రెస్ నాయకులు కావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే లను అవమానించే విధంగా ప్రోటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. కల్యాణి లక్ష్మి చెక్కుల పంపిణీ నుంచి ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్దిదారులకు అందిచాల్సిన చెక్కులను స్థానిక ఎమ్మెల్యే ను కాదని కాంగ్రెస్ నాయకులే పంపిణీ చేస్తున్నారు.

అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభ కార్యక్రమాల్లో కూడా ఎమ్మెల్యే లేకుండానే కార్యక్రమాలను పూర్తి చేస్తున్నారు.కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేని చోట పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి లేదంటే అక్కడి కాంగ్రెస్ నాయకులే ఎమ్మెల్యేలుగా అన్నట్లుగా వ్యవహారం జరుగుతోంది.

హుజురాబాద్,మహేశ్వరం, ఆసిఫాబాద్ సహా ఇలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలపైనే ఎదురుదాడి చేస్తున్నారు.

ప్రభుత్వం లోని పెద్దల బెదిరింపుల కారణంగా అధికారులు కూడా వాళ్లు చెప్పిన విధంగా చేసే పరిస్థితి తీసుకొచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి అప్రజాస్వామిక సంఘటనలు ఎంత మాత్రం మంచివి కావు. గత ఏడు నెలలుగా వరుసగా ఇలాంటి ప్రోటోకాల్ ఉల్లంఘనల సంఘటనలు జరుగుతున్నాయి.

మా పార్టీ ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం కూడా చేశారు. కానీ మీరు వారికి అందుబాటులోకి రాలేదు. శాసన సభ్యుల హక్కులను, వారికి ఉండే ప్రోటోకాల్ ను పరిరక్షించే విషయంలో పూర్తి అధికారం మీదే. కనుక ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను.

పార్టీలతో సంబంధం లేకుండా ఎమ్మెల్యేల హక్కులు, ప్రోటోకాల్, వారి గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైనే ఉంది. గత కొంతకాలంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే విషయంలో ఏ విధంగా ప్రోటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారో వాటి సంబంధించి మీడియాలో చాలా వార్తలు వచ్చాయి.ఇవ్వన్నీ మీ దృష్టికి కూడా వచ్చి ఉంటాయని భావిస్తున్నాను.

దయచేసి ఎమ్మెల్యేల హక్కుల రక్షణ విషయంలో స్పీకర్ గా మీ అధికారాలను వినియోగించాలని కోరుతున్నాను. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రోటోకాల్ పరిరక్షణ కోసం వెంటనే సీఎస్ సహా అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

LEAVE A RESPONSE