– వైసీపీ కూతలకు… సాక్షి రాతలకు గట్టిగా కౌంటర్ ఇచ్చిన కూటమి ప్రభుత్వం
– 108 వ్యవస్థను వైసీపీ నిర్వీర్యం చేసిన విధానాన్ని గుర్తు చేసిన మంత్రి సత్యకుమార్
– 108 అంబులెన్సుల విషయంలో తప్పుడు రాతలకు తిరుగులేని సమాధానం ఇచ్చిన ఎమ్మెల్యే మాధవి రెడ్డి
– కడప రిమ్స్ ప్రాంగణంలో వైసీపీ నిర్వాకం వల్ల మూలనపడి ఉన్న 108 అంబులెన్సులను మీడియాకు చూపించిన మాధవి రెడ్డి
– 108 అంబులెన్సుల వ్యవస్థలోనూ వైసీపీ అవినీతికి పాల్పడిందని మండిపడ్డ ఏలూరు ఎమ్మెల్యే
వాళ్లు చేసిన తప్పిదాలను ఫొటోలు తీసి కూటమి ప్రభుత్వంపై బురద జల్లుతున్నారంటూ ఏలూరు ఎమ్మెల్యే కౌంటర్
– చెంప చెళ్లుమనిపించేలా వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టిన కూటమి ప్రభుత్వం
గత రెండు రోజుల నుంచి వైసీపీ, ఆ పార్టీ అనుబంధ పత్రిక సాక్షి 108 అంబులెన్సుల విషయంలో తప్పుడు ప్రచారంతో ఊదరగొడుతోంది. వాస్తవాలను పక్కన పెట్టేసి… అవాస్తవాలు, వక్రీకరణకు అలవాటు పడి ఫేక్ రాజకీయాలకు, ఫేక్ ప్రచారానికి కేరాఫ్ అడ్రస్సుగా నిలిచిన వైసీపీ, సాక్షి మీడియాకు దిమ్మతిరిగేలా జవాబు ఇచ్చింది కూటమి ప్రభుత్వం.
శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరిగిన ఓ మరణాన్ని 108 అంబులెన్స్ ఆలస్యంగా రావడం వల్లే జరిగిందని తప్పుగా చిత్రీకరించిన వైసీపీ, సాక్షి… ఆ తర్వాత 108 వ్యవస్థను సరిగా నిర్వహించడం లేదంటూ కూటమి ప్రభుత్వం ఆరోపణలు గుప్పించింది. అబద్దాల పునాదులతో పుట్టిన వైసీపీకి… ఫేక్ ప్రచారం చేయాలని అజెండాగా పెట్టుకుని సాక్షి పత్రికకు కూటమి ప్రభుత్వం గట్టిగా కౌంటర్ ఇచ్చింది. రణస్థలంలో అంబులెన్సుకు సంబంధించి… అలాగే 108 వ్యవస్థకు సంబంధించి వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తన ట్వీటులో అసలు విషయాలు వెల్లడించారు.
రణస్థలం ఘటనలో 108కు ఎప్పుడు కాల్ వచ్చింది… అంబులెన్స్ ఎప్పుడు వెళ్లిందనే విషయాన్ని ఆధారాలతో సహా కూలం కుషంగా మంత్రి వివరించారు. ఉదయం 08:05 గంటలకు కాల్ వస్తే.. 08:07 నిమిషాలకు అంబులెన్సుకు విషయం తెలియచేశారని… వెంటనే బయలుదేరిన అంబులెన్స్ ఘటనా స్థలానికి 08:14 చేరుకుందని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం అంబులెన్సు పట్టణ ప్రాంతాల్లో 18 ని. లోపు, గ్రామీణ ప్రాంతాల్లో 23 ని. లోపు సంఘటనా స్థలానికి చేరాల్సి ఉండగా, ఇక్కడ కేవలం 7 నిమిషాల్లో చేరిందని విషయాన్ని వెల్లడించారు. వాస్తవం ఈ విధంగా ఉంటే… అంబులెన్స్ ఆలస్యంగా వచ్చిందని అభూత కల్పనలు వైసీపీ, సాక్షి పత్రిక ఆరోపణలు గుప్పించిందని మంత్రి వెల్లడించారు.
ఇక 108 వ్యవస్థపై వైసీపీ, సాక్షి చేసిన అడ్డగోలు ఆరోపణలకు మంత్రి గట్టిగా సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వం 108 అంబులెన్స్ వ్యవస్థను ఏ విధంగా నిర్వీర్యం చేసిందోననే అంశాన్ని ఆధారాలతో సహా మంత్రి వివరించారు. శిథిలమైన అంబులెన్సులను చూపిస్తూ పప్పులో కాలేశారని… గత వైసీపీ ప్రభుత్వం, జగన్ మోహన్ రెడ్డి నిర్వాకం వల్ల వివిధ ఆసుపత్రులలో, రోడ్ల పైన సుమారు 300 అంబులెన్సులు శిథిలమయ్యాయని మంత్రి గుర్తు చేశారు. జగన్ మోహన్ రెడ్డికి చెందిన అస్మదీయ కంపెనీ “అరబిందో” కు ఏడేళ్ల పాటు 104, 108 టెండర్లు అప్పనంగా కట్టబెట్టి 108 వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి బీజం వేశారని చెప్పారు.
ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్ ఒప్పందం ప్రకారం, తయారీ సంస్థ “ఫోర్స్” తో నిర్వహణ చేయాల్సి ఉండగా, ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుని మెయింటెనెన్స్ పేరుతో ప్రజాధనాన్ని ప్యాలెస్ ఖజానాకు తరలించింది వాస్తవం కాదా? అని మంత్రి ప్రశ్నించారు. దీనికి వైసీపీ నుంచి, సాక్షి పత్రిక నుంచి మౌనమే సమాధానంగా ఉంది. తేలు కుట్టిన దొంగల్లా… కుక్కిన పేనులా ఉండిపోయాయి.
వైసీపీ దుర్నీతిని ఎండగట్టిన కూటమి ఎమ్మెల్యేలు
మంత్రి సత్యకుమార్ సమాధానంతో కంగుతిన్న వైసీపీ, సాక్షికి చెంప ఛెళ్లుమనిపించేలా వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టారు కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి రెడ్డి. కడపలోని రిమ్స్ ఆస్పత్రికి నేరుగా మీడియాను తీసుకెళ్లారు. ఆస్పత్రి ప్రాంగణంలో గత ప్రభుత్వ వైఖరి కారణంగా మూలనపడి.. ఎందుకూ పనికి రాకుండా ఉండిపోయిన 108 అంబులెన్సులను మీడియాకు చూపించారు.
వైసీపీ హయాంలో మూలనపడి ఉన్న అంబులెన్సులను చూపిస్తూ… కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారంటూ వైసీపీని, సాక్షిని కడిగిపారేశారు. రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను సరిచేస్తూ… 108 అంబులెన్స్ వ్యవస్థను సరి చేస్తుంటే… తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదంటూ హితవు పలికారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కడపకే ఆరు కొత్త అంబులెన్సులను కేటాయించిన విషయాన్ని మాధవి రెడ్డి గుర్తుచేశారు.
ఇక ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ ఏలూరు జిల్లా ఆస్పత్రికి మీడియాను ఆహ్వానించి.. వాస్తవాలు వివరించారు. జిల్లాలో కొత్తగా ఆరు అంబులెన్సులు అందుబాటులోకి వచ్చాయని… అత్యాధునిక సదుపాయాలతో వెంటిలేటర్ సౌకర్యంతో సేవలు అందిస్తున్నాయని వివరించారు. కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేయడానికి వేరే దారి దొరకక… సాక్షి పత్రిక ఈ తరహా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
మొత్తంగా తప్పుడు ఆరోపణలతో ప్రజలను మభ్యపుచ్చే ప్రయత్నం చేస్తున్న వైసీపీ, సాక్షి తప్పుడు విధానాలను కూటమి ప్రభుత్వం, కూటమి ఎమ్మెల్యేలు ఎండగట్టారు. క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితిని వివరిస్తూ… వాస్తవాలను ప్రజలకు నేరుగా చూపిస్తూ… వైసీపీ తాట తీస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.