-3 యేళ్లల్లో ప్రతి లబ్దిదారుడికి రూ.26వేలు పెన్షన్ ఎగ్గొట్టడం వాస్తవమా? కాదా?
-కమీషన్లకు కక్కూర్తి పడే ప్రభుత్వమిది
-మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్
జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలతో వెటకారంగా మాట్లాడుతున్నారు. జగన్ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందాలనడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. ప్రభుత్వం టీడీపీ హయాంలోని లబ్ధిదారుల సంఖ్య, నేటి లబ్దిదారుల సంఖ్య బహిర్గతం చేయాలి. 2లక్షల 99వేల 85 మందికి పెన్షన్లు ఇచ్చామని గొప్పగా చెప్పుకుంటున్నారు. ప్రజా ధనాన్ని సాక్షి పత్రికకు దోచి పెట్టడమే పరమావధా? జగన్ బటన్ నొక్కడంతో సాక్షి పత్రికకు లాభం చేకూరుతూ ప్రజలకు లబ్ది మాత్రం శూన్యమనేది జగమెరిగిన సత్యం. సాక్షి పత్రికకు ఎన్నిసార్లు ఎన్ని అడ్వర్ టైజ్ మెంట్లు ఇస్తే అన్ని సార్లు భారతి రెడ్డికి లాభం చేకూరుతుంది?
తన కుటుంబానికి దోచిపెట్టడమే జగన్ ఉద్దేశం. జగన్ అధికారంలోకి రాకముందు పెన్షన్ 3వేలిస్తానని చెప్పి ఇప్పటికీ ఇవ్వలేదు. రూ.2వందలు ఉన్న పెన్షన్ రూ.2వేలు చేసిన ఘనత టీడీపీది. రాజశేఖర్ రెడ్డి, జగన్ లు కలిసి రూ.625 పెన్షన్ పెంచితే.. ఎన్టీఆర్, చంద్రబాబు లు కలిసి రూ. 1875 పెంచారు. జగన్ మాటల్లో ‘మమకార’మేతప్ప పథకాలను మమ అనిపించి కారాన్ని నవరత్నాల పేరుతో పేద ప్రజల నవరంధ్రాల్లోకి నెడుతున్నారు. రూ.3వేలు పెన్షన్ ఇస్తానని చెప్పి ఇంతవరకు 61 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్ ఎగ్గొట్టిన ఘనత వైసీపీది. వారి ఆశలను అడియాశలు చేశారు.
3 యేళ్లల్లో ప్రతి లబ్దిదారుడికి రూ.26వేలు పెన్షన్ ఎగ్గొట్టడం వాస్తవమా? కాదా? 65 సంవత్సరాలకిచ్చే వృద్ధాప్య పెన్షన్ ని 60 సంవత్సరాలకి తగ్గిస్తానని చెప్పారు. రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 60 నుంచి 65 సంవత్సరాల వయసు గల 16 లక్షల మంది ఉన్నారు. టీడీపీ ప్రభుత్వం 2019 మార్చి 31 నాటికి 56 లక్షల 24వేల మందికి పెన్షన్ ఇచ్చింది. 65 సంవత్సరాలు ఉన్న వృద్ధాప్య పెన్షన్ ని 12 లక్షల మంది అర్హులు ఉంటే కొత్తగా కేవలం 5 లక్షల మందికి మాత్రమే ఇచ్చి.. టీడీపీ, జనసేన అని ముద్ర వేసి 7 లక్షల మందికి అన్యాయం చేశారు.
అర్హత ఉన్న 60 నుంచి 65 సంవత్సరాల మధ్య వయసు కలిగిన 7 లక్షల మందికి ఎగ్గొట్టారు. ఈ క్రమంలో పెన్షన్ ఎగ్గొట్టి రాజకీయ కక్ష తీర్చుకున్నారు. పైగా అందరికీ ఇస్తున్నామని చెప్పుకుంటున్నారు. రాష్ట్రంలో పెన్షన్ పొందుతున్నవారు ప్రతినెల యావరేజ్ గా 15 వేల మంది చనిపోతారు. ఒక సంవత్సరంలో దాదాపు లక్షా 80 వేల మంది చనిపోయే అవకాశాలున్నాయి. ఈ మూడు సంవత్సరాల్లో దాదాపు 6 లక్షల మంది చనిపోయే అవకాశం ఉంది. చనిపోయిన వ్యక్తి స్థానంలో వేరే వ్యక్తికి పెన్షన్ ఇచ్చినప్పుడు అది కొత్తగా అదనంగా ఇచ్చే జాబితాలోకి రాదు. దమ్ము, నిజాయితీ, పేద ప్రజలపై మమకారం ఉంటే పేద ప్రజల కంట్లో కారం చల్లాలనే దురాలోచన లేకుంటే క్షేత్రస్థాయికి వచ్చి నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలి.
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు సాంకేతిక కారణాలు చూపి అర్హత ఉన్నవారిని అనర్హుల్ని చేశారు. పెన్షన్ల కోసం 2 లక్షల మంది కోర్టుల్లో కేసులు వేశారు. ప్రజల ధనాన్ని తీసుకుంటూ వాలంటీర్లుగా ఉన్న కార్యకర్తలు సక్రమంగా లబ్ధిదారులను గుర్తిస్తే ఈ 2 లక్షల మంది కోర్టుకు ఎందుకు వెళ్తారు? పేద ప్రజలపై మమకారం పేరుతో పగ, ప్రతీకారం తీర్చుకుంటున్నారు. సర్వోన్నత న్యాయస్థానం మొట్టిక్కాయలు వేసినా ఈ ప్రభుత్వంలో చలనం లేదు. కమీషన్లకు కక్కూర్తి పడే ప్రభుత్వమిది.
కార్యకర్తలకు నెలవారీ డబ్బులివ్వడానికి మాత్రమే రేషన్ సరఫరా వాహనాలు కొన్నారే తప్ప పేద ప్రజలకు లబ్ది చేకూర్చడానికి కాదు. పేద ప్రజల పెళ్లిళ్లకు చంద్రబాబు ముష్టి 30వేలు ఇస్తున్నాడు, నేను లక్ష ఇస్తానన్న ఉత్తర ప్రగల్భాలు పలికిన జగన్ నేడు ఏంచేశాడు? ‘గడప గడప’కు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి 2 లక్షలు విలువ చేసే ఇంటి పట్టా, ఇంటి నిర్మాణానికి లక్షా80వేలు ఇచ్చామంటున్నారు.. ప్రభుత్వం ఇచ్చింది శూన్యం. ఏ ఒక్క గ్రామంలోనూ కొత్తగా ఒక్క స్కూలు తెరచిన దాఖలాలు లేవు. పాత పథకాలకు పేర్లు మార్చి సంక్షేమం అంటే అది సంక్షేమం ఎలా అవుతుంది? పీజీ విద్యార్థులకు ఫీజురీయంబర్స్ మెంట్ రద్దు చేశారు.
సొంత మద్యం తయారీ, ట్రాన్స్ పోర్టు, అమ్మకంతో సంవత్సరానికి రూ.15 కోట్లు ఆర్జిస్తున్నారు. కొత్తగా 7 వేల కార్డులు ఇచ్చామనడం హాస్యాస్పదం. కార్డు పొందడమనేది ప్రతి ఒక్కడి న్యాయమైన హక్కు. బిక్షమివ్వటంలేదు. నిత్య ప్రక్రియగా సాగాల్సిన ఈ కార్యక్రమం ఆరు నెలలకో, సంవత్సరానికో ఇవ్వటం సిగ్గుచేటు. పాత కార్డుల స్థానంలో కొత్త కార్డులు ఇచ్చి ఏదో గొప్పగా సాధించినట్లుగా చెప్పుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన 30 వేలు కూడా ఇవ్వలేని పరిస్థితులలో వైసీపీ ప్రభుత్వం ఉంది. 5లక్షల కోట్ల అప్పులు చేశారు. రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు, బస్సు చార్జీలు, మద్యం రేట్లు, ఇసుక, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచారు. వాటి మీద వస్తున్న లక్షల కోట్లు ఏమవుతున్నాయో ప్రభుత్వం ప్రజలకు తెలపాలి.
తెచ్చిన 5లక్షల కోట్ల రూపాయల అప్పు ఏమైంది? మద్యం ద్వారా ప్రతి సంవత్సరం 15వేల కోట్లు ఆదాయం వస్తోంది. మూడు సంవత్సరాలలో 45వేల కోట్లు వస్తుంది. ఇసుక ద్వారా సంవత్సరానికి 10వేల కోట్లు చొప్పున మూడు సంవత్సరాలలో 30వేల కోట్లు వస్తుంది. ఇతర మైనింగ్, ప్రభుత్వ భూమి కొనుగోలు ద్వారా కూడా ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. ప్రతి పథకంలో అవినీతి చేయడం ద్వారా రెండు లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఇది వాస్తవం కాదా? జగన్ రెడ్డి కి అసలు ప్రజల పై మమకారం ఉంటే, జగన్ రెడ్డి రాష్ట్రంలో 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చానని చెప్పాడు.
గడప గడపకి వైఎస్సార్ పేరుతో మీకు కీళ్ల పట్టాలు ఇచ్చాం దాని ఖరీదు 2 లక్షలు, 3 లక్షలు అంటూ వాళ్ళ సొంత డబ్బులు ఎదో ఇచ్చినట్టు మాట్లాడటం అన్యాయం. పేదవాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లకి ఇచ్చిన 10వేల ఎకరాల భూముల్ని బలవంతంగా లాక్కొని నేడు సెంటు పట్టా ఇచ్చాను దాని ఖరీదు 2 లక్షలు అని మాట్లాడడం సబబేనా? లక్ష 80వేలు ఇస్తానని చెప్పారు. అందులో కేంద్ర ప్రభుత్వం లక్ష 50వేలు ఐతే 30వేలు ఉపాధి హామీలో ఇచ్చేది. ఇంటి నిర్మాణాలలో ఇచ్చిన డబ్బులో జగన్ రెడ్డి ప్రభుత్వంది ఒక్క రూపాయి కూడా లేదు. జూన్ 22 నాటికీ 15లక్షల 16వేలు ఇల్లు పూర్తీ చేస్తామని మీరు చెప్పిన మాటే. దాని కోసం 28వేల కోట్లు ఖర్చు పెడుతున్నానన్నారు.
నేటికి పూర్తి అయిన ఇళ్లెన్నో తెలపాలి. వైసీపీ ప్రభుత్వమే అధికారికంగా ఇచ్చిన లెక్కలు ప్రకారం పూర్తి అయినవి 50వేల ఇళ్లు. 2019 -20లో మంజూరు అయిన ఎన్టీఆర్ పి.ఎం.ఏ.వై ఇల్లు, ఎన్టీఆర్ హౌసింగ్ ఇల్లు ఏవైతే ఉన్నాయో అందులో 50వేల ఇళ్లు పాత ప్రభుత్వం హాయాంలో మంజూరైనవే. ఇల్లు కడితే జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక మంజూరు చేసిన ఇళ్లలో నిర్మాణం పూర్తీ ఐన ఇళ్లు కేవలం 10వేల ఇల్లు. ఈ 10వేల ఇళ్ల కోసం సాక్షి పత్రికలో గొప్పగా ప్రకటనలు ఇచ్చుకుంటున్నారు.
గడిచిన మూడేళ్ళలో 15లక్షల 16వేల ఇళ్లు కడతానని చెప్పి 30 సార్లు ప్రకటనలు ఇచ్చి 3 వందల కోట్ల రూపాయలు సాక్షి పేపర్ కి దోచి పెట్టారు. ఇళ్ల నిర్మాణానికి కనీసం 3 కోట్లు అయినా ఖర్చు పెట్టారా. పేద వాడికి అన్ని రకాలుగా సంక్షేమం చేస్తుండేది మా ప్రభుత్వమే అని గొప్పలు చెబుతున్నారు. ప్రజల నెత్తిన లక్షలాది రూపాయలు అప్పు పెట్టారు. మోసకారి మాటలు అబద్ధపు ప్రచారాలు ఎక్కువ కాలం సాగవని మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ పేర్కొన్నారు.