Suryaa.co.in

Andhra Pradesh

జగన్‌ అధికారంలోకొచ్చాక లక్షల్లో ఉద్యోగాలు

-ఈరోజూ రేపు జాబ్‌మేళాలో 100 కంపెనీలు హాజరు
– 10వేల మందికి పైగా యువతకు ఉద్యోగవకాశాలు
– వచ్చే ఏడెనిమిది నెలల్లో మరో 9 చోట్ల జాబ్‌మేళాలు
– తద్వారా 50వేల నుంచి 60వేల వరకు ఉద్యోగవకాశాలు
– రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పూర్తిగా తుడిచేయాలన్నదే జగన్‌ తపన
– ఏఎన్‌యూలో మెగా జాబ్‌మేళాను ప్రారంభించిన ఎంపీ వి. విజయసాయిరెడ్డి

ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో మెగా జాబ్‌మేళాను ప్రారంభించిన అనంతరం ప్రసంగించిన వైఎస్‌ఆర్‌సీపీ అనుబంధ విభాగాల ఇంచార్జి, పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి ప్రసంగిస్తూ.. ఏమన్నారంటే..

వైఎస్‌ఆర్‌సీపీ నాందిపలికిన జాబ్‌మేళా ఇది
మేం గత సంవత్సరంలో ఇక్కడకు వచ్చి వైఎస్‌ఆర్‌సీపీ తరఫున జాబ్‌ మేళా నిర్వహించాము. మనం నాంది పలికిన ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ యూనివర్శిటీ వైస్‌ఛాన్స్‌లర్‌ నిర్ణయం తీసుకుని అమలు చేయడమనేది చాలా సంతోషకరం. ఈ విషయంలో యూనివర్శిటీ అధికారులతో పాటు వీసీ పట్టుదలను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.

యువతకు కమ్యూనికేషన్స్‌ స్కిల్స్‌ ప్రధానం
ఈ మెగా జాబ్‌ మేళాకు హాజరైన ఆశావహులకు నేనొకటి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంటర్వ్యూల్లో ప్రశ్నలకు ఎటువంటి బెరుకు లేకుండా ధైర్యంగా సమాధానాలివ్వాల్సి ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూ చేసే వారిని మెప్పించేందుకు అవసరమైన కమ్యూనికేషన్స్‌ స్కిల్స్‌ పట్ల విద్యార్థులు శ్రద్ధతీసుకోవాల్సి ఉంటుంది. లాంగ్వేజెస్‌లో కమ్యూనికేషన్స్‌ స్కిల్స్‌ను ఎంతగా ఇంప్రూవ్‌ చేసుకుంటారో.. మీ భవిష్యత్‌ అంత బాగుంటుంది. మీరు అనుకున్నది ఎఫెక్టివ్‌గా చెప్పడం.. ఎదుటివారికి అర్ధమయ్యేలా మీ అభిప్రాయాన్ని వివరించడమనేది కమ్యూనికేషన్స్‌ స్కిల్స్‌లో ముఖ్యమైనదిగా మనం గుర్తించాలి.

100 కంపెనీల హాజరుతో 10 వేల ఉద్యోగవకాశాలు
ప్రస్తుతం ఈ యూనివర్శిటీలో రెండురోజులపాటు నిర్వహిస్తున్న జాబ్‌మేళాలో 100కి పైగా కంపెనీలు పాల్గొన్నందున సుమారు 10వేల మందికి పైగా యువతకు ఉద్యోగాలు వస్తాయని ఆశిస్తున్నాను. ఆటోమొబైల్‌ మాన్యుఫాక్చరింగ్, మొబైల్‌ మాన్యుఫాక్చరింగ్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్‌ రిటైల్‌ ఇండస్ట్రీస్, బ్యాంకింగ్, టెలికాం, ఇన్య్సూరెన్స్, మెడికల్, ఫార్మారంగాల నుంచి ఈ 100 కంపెనీలు రావడం జరిగింది. ఈ జాబ్‌మేళా అనేది యూజీ, పీజీ, ఎంబీఏ, బీటెక్‌ విద్యార్థులకు సువర్ణఅవకాశంగా చెబుతున్నాను. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వివిధ కంపెనీలు సుమారు రూ.8.5 లక్షల వార్షిక వేతనం వరకు అర్హులైన అభ్యర్థులను ఈరోజూరేపు జాబ్‌మేళాలో రిక్రూట్‌మెంట్‌ చేసుకుంటారని తెలియజేసేందుకు సంతోషిస్తున్నాను.

మరో 9 చోట్ల మెగా జాబ్‌మేళాలు చేపడతాం
విద్యాభ్యాసం పూర్తయ్యాక యువతకు ఉద్యోగం అనేది ప్రధాన అవసరం. చదువు పూర్తికాగానే ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉండకుండా.. ఉద్యోగం, వ్యాపార రంగంలోనైనా లేదంటే ఏదైనా స్వయం ఉపాధిరంగంలోనైనా మనం రాణించాల్సి ఉంటుంది. అప్పుడే మన జీవితానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ జరిగే ఇంటర్వ్యూల్లో ఎవరైనా ఎంపిక కాకపోయినంత మాత్రానా ఏమాత్రం బాధ పడాల్సిన అవసరంలేదు.

ఎందుకంటే, గతేడాది వైఎస్‌ఆర్‌సీపీ తరఫున మనం నిర్వహించిన మెగా జాబ్‌మేళాను కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా యూనివర్శిటీ వీసీ గారు కొనసాగిస్తున్నారు. అదేవిధంగా వైఎస్‌ఆర్‌సీపీ తరఫున నాలుగు ప్రదేశాల్లోనూ మెగా జాబ్‌మేళా నిర్వహించాం. ఈ సంవత్సరంలో మరొక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజనకు ముందు 13 జిల్లాలుండేవి.

ఆయా జిల్లాల్లో నాలుగుచోట్ల మనం మెగా జాబ్‌మేళా నిర్వహించాం. మిగతా 9 చోట్ల ఏపీ స్కిల్‌డెవలప్‌మెంట్‌ తరఫున మరియు సీడాక్‌ తరఫున మెగా జాబ్‌మేళాలను నిర్వహించాలనేది గౌరవ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయంగా తెలియజేస్తున్నాను. ఈ జాబ్‌మేళాల్లో ఆయా జిల్లాల విద్యార్థులు గానీ.. ప్రస్తుతం ఇక్కడకొచ్చి అవకాశాలు రాని విద్యార్థులు కూడా పాల్గొనవచ్చు.

జగన్‌ అధికారం చేపట్టాక లక్షల్లో ఉద్యోగాలు అందజేత
యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ముఖ్యమంత్రి పట్టుదలను గుర్తుచేసుకుంటే.. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.50 లక్షల వాలంటీర్‌ల నియామకం చేయడం జరిగింది. ఇంతకుముందు ఏ పని కావాలన్నా మారుమూల ప్రాంతాల నుంచి కూడా రాజధానికి రావాల్సిన పరిస్థితి ఉండేది. అయితే, జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి రావడంతో ఎక్కడి సమస్యలు అక్కడ్నే పరిష్కారమమ్యే పరిస్థితికి వచ్చింది.

రాష్ట్ర వ్యాప్తంగా 15 వేల గ్రామ సచివాలయాల్లో 1.75 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించి ప్రజలకు అవసరమైన అన్నిరకాల సేవల్ని అందిస్తున్న ప్రభుత్వమిది. ఇదికాకుండా గతంలో మనం వైఎస్‌ఆర్‌సీపీ తరఫున నిర్వహించిన 4 మెగా జాబ్‌మేళాల్లో సుమారు 40 వేలకు పైగా ఉద్యోగాల్ని యువతకు కల్పించడం జరిగింది.

రాబోయే ఏడెనిమిది నెలల కాలంలో మరో 9 చోట్ల మెగా జాబ్‌మేళాలను నిర్వహించి కనీసం 50 వేల నుంచి 60 వేల ఉద్యోగాలను యువతకు అందించే అవకాశం ఉందనే నమ్మకంతో నేను చెబుతున్నాను. మీరందరూ కూడా ఈ అవకాశాల్ని జారవిడుచుకోకుండా సద్వినియోగం చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.

ఇంక్యుబేషన్‌ సెంటర్లకు రూ.50 లక్షల ఎంపీ నిధులు
యూనివర్శిటీల్లో ఏర్పాటు చేసే ఇంక్యుబేసన్‌ సెంటర్లలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలీజెన్స్, మిషన్‌ లెర్నింగ్స్, రోబోటిక్స్, సైబర్‌ సెక్యూరిటీ వంటి రంగాల్లో చాలా ఉద్యోగ అవకాశాలుంటాయి. యూనివర్శిటీలో దాదాపు 300 ఎకరాల్లో ఈ ఇంక్యుబేషన్‌ సెంటర్‌ అభివృద్ధికి నేను ఎంపీ నిధుల నుంచి రూ.50లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటిస్తున్నాను.

నిరుద్యోగ సమస్యను పూర్తిగా తుడిచేయాలనేది జగన్‌ తపన
రాష్ట్రంలో ఎక్కడా నిరుద్యోగ సమస్య అనేది ఉండకూడదని.. చదువుకున్న ప్రతీ యువకుడికి ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉండాలనేది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తపన. అలాంటి ధృఢనిశ్చయంతో పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రిగారి ఆలోచనకు తగ్గట్టు మనవంతు భాగస్వామ్యంతో ఉద్యోగవకాశాల్ని సద్వినియోగం చేసుకుందాం. ఉద్యోగ, ఉపాధిరంగాల్లో మరింత మెరుగైన రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకుందాం అని పిలుపునిస్తున్నాను.

LEAVE A RESPONSE