– టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
జగన్ జమానాలో సాక్షి పాలేగాళ్లకు లక్షల్లో ప్రజా ధనం జీతాలుగా దోచిపెడుతున్నారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
జగన్ పాలనలో ఆర్థిక పరిస్థితి కంచే చేను మేసినట్లుగా తయారైంది. ప్రభుత్వం డబ్బులు ఇవ్వటంలేదని ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేసేవారు రోగులను వెనక్కి పంపుతున్నారు. జగన్ జమానాలో సాక్షి పాలేగాళ్లకు లక్షల్లో ప్రజా ధనం జీతాలుగా దోచిపెడుతున్నారనేది నగ్నసత్యం. ఒక ఆర్థిక నేరస్థుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఎలావుంటుందో రాష్ట్ర ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు. జగన్ హయాంలో రాష్ట్రంలో అవినీతి పెచ్చుమీరింది. అవినీతి నుంచి పుట్టిన పుత్రిక సాక్షి పత్రిక, ఛానల్. సాక్షి పత్రిక, ఛానల్ ఏర్పాటుకి రూ.1200 కోట్లు వివిధ మార్గాల్లో ఏ విధంగా క్విడ్ ప్రోకోగా వచ్చాయో అందరికీ తెలిసిన విషయమే.
ప్రభుత్వ ఆధీనంలో సాక్షి కేంద్ర కార్యాలయం, బ్రాంచ్ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. దేశంలోని ఏ రాష్ట్రంలోను ఇలాంటి పరిస్థితులు లేవు. ప్రజాధనమంతా సాక్షికి దోచిపెడుతున్నారు. ప్రభుత్వ ధనంతో సాక్షి సిబ్బందిని నడుపుతున్నారు. రైతు భరోసా కేంద్రాలు నిష్పచ్ఛపాతంగా ఎక్కడా పనిచేయడంలేదు. రాజకీయ లబ్ది కోసం ఆడుతున్న డ్రామాయే తప్ప మూడు రాజధానులు నిర్మించలేరు. రాయలసీమలో వైసీపీకి ఎక్కడా గౌరవంలేదు. అమరావతిని రాజధానిగా ప్రజలు ఎప్పుడో ఆమోదించారు. అమరావతే రాజధాని, ఇక్కడే ఇల్లు కడుతున్నానని జగన్ చెప్పి ఆతరువాత మాట మార్చారు. జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడెప్పుడు ఇంటికి పంపించాలా అని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు.
ఈ పాలనను భరించలేము అంటున్నారు. ప్రజలు ఈ ఆలోచనలో ప్రజలు ఉన్నారు. అబద్ధాలు చెప్పిన వారిలో జగన్ రెడ్డిని మించిన వారే లేరు. ఆరోగ్యశ్రీ బిల్లులు ఎక్కడ పెండింగ్ లేవు, ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నామని జగన్ చెబుతున్నారు. ఆరోగ్యశ్రీకి 600 కోట్ల రూపాయలు రాష్ట్రవ్యాప్తంగా బకాయిలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీకి ఐదు సంవత్సరాల కింద నిర్ణయించిన ధరలే ఇప్పటికీ ఉన్నాయి. ధరల్లో విపరీతమైన మార్పులు వచ్చాయి. ఆరోగ్యశ్రీకి చెల్లించే నిధులలలో కూడా సవరణ చేయాల్సిన అవసరం ఉంది. వాలంటీర్లు తప్పకుండా సాక్షి పేపర్ ని కొనాలని నిబంధన పెట్టి ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తున్నారు.
సచివాలయాలు, మున్సిపాలిటీలు, పంచాయతీ కార్యాలయాలు తప్పకుండా సాక్షి పత్రిక కొనాలని జీవో విడుదల చేశారు. తప్పకుండా ఆ పత్రికనే వేయించుకోవాలని నిబంధన పెట్టారు. ఎన్నికలకు ముందు టీడీపీ ప్రభుత్వం కమ్మ సామాజిక వర్గానికి చెందిన 35 మంది డీఎస్పీలను నియమించిందని వైసీపీ నాయకులు ఒక గ్లోబల్ ప్రచారం చేశారు. నేడు వైసీపీ ప్రభుత్వం ఎనిమిది వందల యాభై నాలుగు పోస్టులను ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టింది. సాక్షి లో పనిచేసిన వారిని కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ సిబ్బంది గా తీసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి క్విడ్ ప్రోకో లో సిద్ధహస్తుడు.
ప్రజాధనాన్ని సాక్షి నడపడానికి కట్టబెడుతున్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. జగన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పాలి. జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసిన వారందరూ జగన్ ను ఎప్పుడెప్పుడు ఇంటికి పంపించాలా అని ఎదురు చూస్తున్నారు. రెండున్నర సంవత్సరాలకే వైసీపీ పాలనను భరించలేము అనే స్థాయికి ప్రజలు వచ్చారు. మూడు రాజధానులు ఒక డ్రామా అని ప్రజలకు అర్థమైంది. ఆనాడు తాను ఇక్కడే ఇల్లు కడుతున్నాను, ఇక్కడే కార్యాలయం కడుతున్నానని ప్రజలకు నమ్మబలికారు. నమ్మబలకడంతోనే రాజధానిలో కూడా ఆయనకు ఓట్లు వేశారు.
చంద్రబాబు పరిపాలన చూశాం, ఒకసారి జగన్ పరిపాలన కూడా చూద్దామనే ఉద్దేశంతో ప్రజలు వైసీపీకి ఓట్లు వేశారు. నేడు అదే తాడికొండ, మంగళగిరిలో రాజీనామా చేసి వచ్చి పోటీ చేస్తే మాట తప్పిన జగన్ కు ప్రజలు ఏ విధంగా తీర్పు ఇస్తారో తెలుస్తుంది. ఒకే రాజధాని అని తెలుగుదేశం ఒకే మాట మీద ఉంది. రాజకీయ ప్రయోజనాలు తప్ప అభివృద్ధిలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయడంలేదు. కూల్చడాన్ని ప్రారంభించిన జగన్ రెడ్డి ఎక్కడా కట్టడాల్ని ప్రారంభించలేదు. రాయలసీమ ఆత్మగౌరవ సభ పెట్టినా, ఉత్తరాంధ్ర యాత్ర పెట్టినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. అమరావతే ఏకైక రాజధాని అనే స్టాండ్ తో టీడీపీ ఉంది.
ఎప్పుడు ఎన్నికలొచ్చినా దాంతోనే ముందుకు వెళ్తాం. మంత్రులు, ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చి వారిని ప్రజల్లోకి పంపుతున్నారు. ఒకసారి విభజన ను చూసి రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారు. కావున రాష్ట్ర ప్రజలు మళ్లీ విభజన కోరుకోరు. భవిష్యత్ కోరుకునేవారు, బాగుపడాలనుకునేవారు, రాష్ట్ర ఆదాయం పెరగాలని కోరుకునేవారు, పెరిగిన ఆదాయాన్ని పేదలకు పంచుతామని విశ్వసించేవారు తిరిగి ఎవరూ రాష్ట్ర విభజన కోరుకోరు. జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో ఎవరూ పడరు. జగన్మోహన్ రెడ్డి ప్రజాదరణ కోల్పోయారు. మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ఏదో ఒక విధంగా మళ్లీ రాజకీయ లబ్ది పొందాలనే దురాలోచనలో జగన్ ఉన్నారు.
మూడు రాజధానులు నిర్మిస్తాడని ప్రజల్లో నమ్మకం, విశ్వాసం లేదు. ఒకరాజధాని నిర్మించలేనివాడు, 90 శాతం పూర్తయిన భవనాలను పూర్తి చేయలేని జగన్ మూడు రాజధానులు నిర్మిస్తానంటే నమ్మరు. ఈ విషయంలో ప్రధాని జోక్యం చేసుకోవాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఎందుకు ప్రధాని జోక్యం చేసుకోవడంలేదని ఆలోచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుకుంటే అమరావతి నిర్మాణం ముందుకెళ్లే అవకాశం వుందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు.
సలహాదారులకు ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారు: టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ :
ముఖ్యమంత్రికి అనేకమంది సలహాదారులు ఉన్నా ఏమీ ఉపయోగంలేదు. సలహాదారులకు కొన్ని కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారు. ప్రభుత్వానికి ఉపయోగకరమైన సలహాలేమీ ఇవ్వడంలేదు. ముఖ్యమంత్రి మాటలకు ఎలాంటి నిబద్ధత లేదు. జగన్ ఏం మాట్లాడినా ఇది కరెక్టుకాదు అని జనం అనుకుంటున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డికి నెలకు రూ.15 లక్షలిస్తున్నారు, దేనికి? ఇంతవరకు రాష్ట్రాభివృద్ధికి ఏం సలహాలిచ్చారో తెలపాలి. రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోంది. మండలాల్లో, జిల్లాపరిషత్ లలో, మున్సిపాల్టీల్లో సాక్షి పత్రికే కొనాలడం మంచి పద్దతి కాదు. గ్రామ సచివాలయాలకు మూడు నాలుగు సాక్షి పేపర్లు పంపడం ప్రజా ధనాన్ని వృధా చేయడమే. ప్రతి వాలంటీర్ కి సాక్షి పేపర్ వేస్తున్నారు.
ఆ డబ్బులు వాలంటీర్ జీతంలో నుండి కట్ చేస్తున్నారు. అడ్వర్ టైజ్ మెంట్ రూపంలో సాక్షి పత్రికకు, సాక్షి టీవీకి కొన్ని కోట్ల రూపాయలు అప్పణంగా వెళ్తున్నాయి. ఎన్ని కోట్లు వెళ్తున్నాయో ప్రజలందరికీ తెలుసు. 5,6 వందల కోట్ల రూపాయలు యాడ్స్ కింద వెళ్తోంది. వైసీపీ నాయకులు ప్రజాస్వామ్యాన్ని మంటగలిపారు. రాష్ట్రంలో నియంతృత్వపు పాలన నడుస్తోంది. దేవులపల్లి అమర్ రాష్ట్ర విభజన సమయంలో విషపూరిత వ్యాఖ్యలు చేశారు. అటువంటి వ్యక్తిని సాక్షి పత్రికలో పనిచేశారనే ఒక్క నెపంతో జగన్ అతనికి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి నెలకు 3 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఇదంతా ప్రజాధనమేనని గ్రహించాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ తెలిపారు.