– మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ
అనంతపురం: అహుడా పరిధిలో ల్యాండ్ బ్యాంక్ ని గుర్తించాలని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్లోని ఎన్ఐసి భవనంలో నగర పాలక సంస్థ, అహుడా, పబ్లిక్ హెల్త్ శాఖల అధికారులతో కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, కల్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వెంకటశివుడు యాదవ్, అహుడా చైర్మన్ టి.సి.వరుణ్ లతో కలిసి మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ జిల్లాలోని మున్సిపాలిటీలను మరింత అభివృద్ధి చేయాలన్నారు. అహుడా పరిధిలో అవసరమైన ల్యాండ్ బ్యాంక్ ని ఎక్కువగా గుర్తించాలని ఆదేశించారు. ఎంఐజీ లేఔట్స్ ను అభివృద్ధి చేసి ప్రజలకు ప్లాట్లను కేటాయించాలన్నారు. మంచి భూములను నగరానికి దూరంగా కాకుండా దగ్గర్లో ఉండేవి చూడాలన్నారు. ఆయా లేఔట్స్ లో రోడ్లను, డ్రైనేజీలను నిర్మించాలని ఆదేశించారు.
చిన్న మున్సిపాలిటీలలో అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని, అవసరమైన సహాయ సహకారాలు అందించాలన్నారు. కల్యాణదుర్గం పరిధిలో ఎస్సీ కాలనీలలో అభివృద్ధి పనుల కోసం 25 లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి త్వరలో సచివాలయ ఉద్యోగులకు సంబంధించి గ్రేడ్-2 నుంచి గ్రేడ్-1కి ప్రమోషన్లను ఇస్తారని, వారిని డిప్యుటేషన్ ద్వారా నగరపాలక సంస్థలో నియమించుకోవచ్చని సూచించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వి.వినోద్ కుమార్ మాట్లాడుతూ అహుడా పరిధిలో అవసరమైన మరింత ల్యాండ్ బ్యాంక్ ను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నగరంలో కాపు, బీసీ భవన్ ల కోసం భూకేటాయింపు చేపడతామన్నారు. శనివారం అహుడ పరిధిలో సమీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, కాపు భవన్, బిసి భవన్, ఇండోర్ స్టేడియంలో మరమ్మత్తులు, మున్సిపల్ పార్కులలో నూతన జిమ్ పరికరాలు, ఉన్నవాటికి మరమ్మతులు, నగరంలో పెరుగుతున్న జనాభా కోసం సిటీ సర్వీస్ బస్సులు ఏర్పాటు, ప్రభుత్వ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో ఒక అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయాలని కోరారు. అర్బన్ నియోజకవర్గంలోని (133 ఎస్ఎల్ఎఫ్) మహిళా సంఘాల పక్కా భవనాలకు అవసరమైన స్థలము కేటాయించాలని కోరారు.
కల్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ తమ నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతమని, ఎస్సీ కాలనీలలో అభివృద్ధి పనుల కోసం 50 లక్షల రూపాయలను మంజూరు చేయాలని, వాల్మీకి భవానాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అహుడా చైర్మన్ టి.సి.వరుణ్ మాట్లాడుతూ అహుడా పరిధిలోని ఎంఐజీ లేఔట్స్ లలో అభివృద్ధి పనులు చేపట్టాలని, మడకశిర ఎంఐజీ లేఔట్ ని అభివృద్ధి చేయాలని కోరారు.
ఈ సమావేశంలో జిల్లా ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి జి.రామకృష్ణారెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ రామ్మోహన్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఈఈ ఆదినారాయణ, నగరపాలక సంస్థ ఈఈ షాకిర్, టిడ్కో ఈఈ సుధారాణి, తదితరులు పాల్గొన్నారు