– ఎంపీ భరత్ పై ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టాలి
– నిబంధనలకు విరుద్దంగా జీవీఎంసీ కౌన్సిల్ ఆమోదం
– సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యుల అడ్డగోలు భూదోపిడీ
– రూ.5వేల కోట్ల విలువైన 54.79 ఎకరాలు ఆక్రమణ
– నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందే
-ఎమ్మెల్సీలు కుంభా రవిబాబు, వరుదు కళ్యాణి డిమాండ్
– మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసిన వైయస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, ఎమ్మెల్సీ రవిబాబు, మాజీ మేయర్ జి హరికుమారి, కార్పొరేటర్లు ఇమ్రాన్, ఉరికూటి రామచంద్రరావు
తాడేపల్లి:విశాఖపట్నంలో గీతం విద్యాసంస్థల కబ్డాలో ఉన్న ప్రభుత్వ భూమిని రెగ్యులరైజ్ చేయాలన్న ప్రతిపాదను జీవీఎంసీ కౌన్సిల్ లో అడ్డగోలుగా ఆమోదించడంపై వైయస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు,చట్టాలకు విరుద్ధంగా రెగ్యులరైజ్ చేయాలన్న ప్రతిపాదనను జీవీఎంసీ కౌన్సిల్లో ఆమోదించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ.. వైయస్సార్సీపీ నేతలు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి వినతి పత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, కుంబా రవిబాబుతో పాటు విశాఖ మాజీ మేయర్ జి హరికుమారి, వైయస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నం కూటమి నేతల భూదోపిడీకి అడ్డాగా మారిందని మండిపడ్డారు. గీతం విద్యాసంస్థల కబ్జాలో ఉన్న రూ.5వేల కోట్ల విలువైన భూమిని రెగ్యులరైజ్ చేయాలన్న ప్రతిపాదనను వెనక్కి తీసుకునేంతవరకు వైయస్సార్సీపీ పోరాటం తప్పదని హెచ్చరించారు.
కౌన్సిల్ లో 15 అంశాలను పొందుపరిచి.. 15వ అంశంగా విశాఖలో గీతం విద్యాసంస్థల ఆక్రమణలో ఉన్న 54.79 ఎకరాల భూమిని క్రమబద్దీకరణ చేయడానికి పూనుకున్నారు. ఇది చట్ట విరుద్ధం. అసైన్డ్ ల్యాండ్ తో పాటు, 22 ఏలో వాగులు, గెడ్డలతో ఉన్న ఆ భూమిని క్రమబద్దీకరణ చేయడానికి కార్పొరేషన్ కి ఎలాంటి అధికారం లేదు.
కార్పొరేషన్ కు ఆ అధికారం లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు మేయర్ ను గట్టిగా ప్రశ్నించారు. ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరించాల్సిన మేయర్ కూటమి కార్పొరేటర్లతో కలిసి చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. వైయస్సార్సీపీ కార్పొరేటర్లపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. కౌన్సిల్ సమావేశం జరగకపోయినా.. కౌన్సిల్ లో ఆ తీర్మానాలను ఆమోదించినట్లు మేయర్ ప్రకటించడం అప్రజాస్వామికం.
గతంలో వైయస్.జగన్ ప్రభుత్వ హయాంలో గీతం కాలేజీ భూములలో దాదాపు 54.79 సెంట్లు ప్రభుత్వ, గెడ్డల భూమితో పాటు అసైన్డ్, 22 ఏ భూములున్నాయని వారికి చెప్పి కంచె వేశారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత గీతం సంస్థలు దాన్ని ఉల్లంఘించి, ఆక్రమించిన భూములను క్రమబద్దీకరణ చేసే కార్యక్రమం చేస్తున్నారు.వాస్తవానికి ప్రభుత్వం కంచె వేసిన తర్వాత గీతం సంస్థలు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు. కోర్టులో ఉన్న అంశాన్ని కార్పొరేషన్ పరిధిలో ఉన్న కౌన్సిల్ సమావేశంలో పెట్టి క్రమబద్దీకరణకు ఆమోదించడం సరికాదు.
గీతం ఆక్రమణలో ఉన్న 54.79 ఎకరాల భూమి దాదాపు రూ.5వేల కోట్ల విలువ చేస్తుంది. దాన్ని గీతం యాజమాన్యం ఆక్రమించే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అసైన్డ్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత ఎవరికైనా కేటాయించాలి. కానీ చంద్రబాబు బంధువు, విశాఖ ఎంపీ భరత్ మాత్రం వారి ఆధీనంలో ఉన్న 54.79 ఎకరాల భూమిని క్రమబద్దీకరణ చేయడంలో తప్పేముందని మాట్లాడుతున్నారు.
అసలు అసైన్డ్, ప్రభుత్వ భూములు మీ ఆధీనంలోకి వచ్చాయని చెప్పడమే చట్టవిరుద్ధం. ఆ నేరాన్ని అంగీకరించిన విశాఖ ఎంపీ మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైయస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది. ఒక బాధ్యతగల ఎంపీ తన విద్యాసంస్థల పేరిట ఏకంగా రూ.5వేల కోట్ల ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే.. దాన్ని క్రమబద్దీకరణకు సిద్దమైన ప్రభుత్వం, ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములను పర్యవేక్షించడానికి వెళ్లిన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణతో సహా పలువులు ఎమ్మెల్సీలను పోలీసులతో అడ్డుకునే ప్రయత్నం చేయడం దుర్మార్గం.
రహేజా, టీసీఎస్ వంటి సంస్థలకు 99 పైసలకే ఎకరా చొప్పున కట్టబెడుతున్నారు. ఎకరా రూ.100 కోట్ల పై చిలుకు విలువ చేసే భూములను రియల్ ఎస్టేట్ కంపెనీలకు అడ్డగోలుగా కట్టబెడుతున్నారు హెచ్ ఎం టీవీ యాజమాన్యానికి ఎండాడ సమీపంలో అతి విలువైన 30 ఎకరాలు అంటే దాదాపు రూ.3వేల కోట్ల ఖరీదు చేసే భూమిని కారుచౌకగా అప్పజెప్పే ప్రయత్నం చేస్తోంది. ఈ రకంగా కట్టబెట్టడాన్ని వైయస్సార్సీపీతో పాటు కమ్యూనిస్టులు, ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారమిచ్చింది భూములు కబ్జా చేయడానికా అని ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న గీతం విద్యాసంస్థల అధిపతి, కూటమి పార్టీల తరపున విశాఖపట్నం ఎంపీ మాత్రమే కాకుండా, చంద్రబాబు కుమారుడు లోకేష్ కి తోడల్లుడు కూడా. అంటే సాక్షాత్తూ సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యుడైన అధికార పార్టీ ఎంపీ ఏకంగా రూ.5వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేయడమే కాకుండా..దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవడానికి ప్రయత్నించడం సిగ్గుచేటు.
ఎంపీ భరత్ కు విశాఖ ప్రజలు 5 లక్షలకు పైగా మెజారిటీ గెలిపిస్తే.. అదే ప్రజలకు ఆయన రిటర్న్ గిఫ్ట్ గా రూ.5వేల కోట్ల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి దాన్ని రెగ్యులరైజ్ చేసుకుంటున్నారు. ఇదే భరత్, కూటిమి నేతలు విశాఖలో ఏళ్లతరబడి చిన్న చిన్న దుకాణాలతో జీవనం సాగిస్తున్న పేదవాళ్ల బడ్డీలు, దుకాణాలను పోలీసు బలగం సహకారంతో బుల్డోజర్లు పెట్టి మరీ కూలదోశారు.
విశాఖపట్నానికి బ్రతుకు తెరువుకు వచ్చిన చిన్న చిన్న పేదల ఇళ్లను కూలదోశారు. కానీ ఏకంగా 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని చంద్రబాబు కుటుంబ సభ్యులు కబ్జా చేస్తుంటే అధికారులు వారికి సహకారం అందించడం అత్యంత దుర్మార్గం. కూటమి పాలనలో పేదలు, పెద్దలకు వేర్వేరు రకాలుగా న్యాయం ఉంటుందా ?
గీతం విద్యాసంస్థలకు ఎదురుగా ప్రభుత్వ భూముల్లో ప్రభుత్వానికి అత్యంత విలువైన భవనాలు నిర్మిస్తే… ఆ రోజు వీరంగం చేసిన కూటమి నేతలు, ఇవాళ తమ ప్రైవేటు సంస్థల కోసం వేలాది ఎకరాల భూమని ప్రభుత్వంలోని వారే కబ్జా చేస్తుంటే పవన్ కళ్యాణ్ కి ఎందుకు కనబడ్డం లేదు? ప్రజలు మీకు అధికారమిచ్చింది మీ కబ్జాలు క్రమబద్దీకరించుకోవడానికా?