-ఏపీలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ (ఎన్ఎఫ్ఎస్ యు ) క్యాంపస్ ఏర్పాటు చేయాలని విజ్ణప్తి
-బుడగ జంగాలకు సంక్షేమ పథకాలు, విద్య, ఉపాధి అవకాశాలతో సహా వారి సామాజిక, ఆర్థిక అవసరాలను తీర్చడానికి సమగ్ర విధానాన్ని రూపొందించాలని కోరిన లావు
-ఎంపీ లావు విజ్ణప్తికి సానుకూలంగా స్పందించిన అమిత్ షా
-విశాఖపట్నం లేదా అమరావతిలలో ఎక్కడైనా నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ క్యాంపస్ ఏర్పాటు చేయాలని అమిత్ షాను కోరిన టిడిపిపి నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు
భారత ప్రభుత్వం 2020 చట్టం 32 ద్వారా స్థాపించబడి జాతీయ ప్రాముఖ్యత కలిగిన నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్శిటీ క్యాంపస్ లు వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటయ్యాయయని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థకు నిలయంగా మారడం సముచితమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి టిడిపిపి నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు తీసుకొచ్చారు. దురదృష్టవశాత్తూ 2014లో అశాస్త్రీయ విభజనతో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఆంధ్రప్రదేశ్ అనేక కేంద్ర సంస్థలను కోల్పోయిందని కూడా తెలిపారు.
కాస్మోపాలిటన్ స్వభావం తో పాటు బాగా అభివృద్ధి చెందిన మౌలిక సదుపాయాలతో భారతదేశంలోని ప్రధాన నగరాలలో ఒకటైన విశాఖపట్నం కూడా ఎన్ఎఫ్ఎస్ యు క్యాంపస్ కి ఆతిథ్యం ఇవ్వడానికి అన్నివిధాలాఅనుకూలంగా ఉందని తెలిపారు. విశాఖపట్నం నగరం యొక్క వ్యూహాత్మక స్థానం, దాని పారిశ్రామిక అభివృద్ధి , దాని కనెక్టివిటీ ల నేపథ్యంలో ఈ ప్రసిద్ధ సంస్థను నెలకొల్పేందుకు అనువైన ప్రదేశమని కూడా తెలిపారు. అంతేకాకుండా అమరావతిని ప్రజా రాజధానిగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, అక్కడ పుష్కలమైన భూ లభ్యతతో పాటు, మరో ప్రధాన నగరమైన విజయవాడకు దగ్గరగా అమరావతి ఉందని, అందుకే ఎన్ఎఫ్ఎస్ యు క్యాంపస్ ఏర్పాటుకు అమరావతి కూడా అనువైన ప్రాంతమని తెలిపారు.
విశాఖపట్నం, అమరావతి రెండింటికీ ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ఈ రెండు నగరాల్లో ఎక్కడైనా ఒకచోట నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ క్యాంపస్ ను మంజూరు చేయాలని కోరారు. ఇది రాష్ట్ర ఫోరెన్సిక్ సామర్థ్యాలను బలోపేతం చేయడమే కాకుండా ఈ ప్రాంతంలో విద్యావకాశాలను, అభివృద్ధి అవకాశాలను మరింత పెంచుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
అదేవిధంగా ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న బేడా (బుడగ) జంగం సామాజిక వర్గానికి సంబంధించిన అత్యవసర, దీర్ఘకాలిక సమస్యను అమిత్ షా దృష్టికి తీసుకొచ్చారు. ఏపీ రాష్ట్ర సాంస్కృతిక, సామాజిక నిర్మాణంలో ప్రత్యేకమైన, సమగ్రమైన పాత్ర పోషిస్తున్న ఈ సమాజం వారి సామాజిక, ఆర్థిక, జీవనోపాధి పరిస్థితులకు సంబంధించి అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని అమిత్ షాకు ఎంపీ లావు వివరించారు.
బేడా (బుడగ) జంగం సామాజికవర్గం …వారి సాంప్రదాయ వృత్తులు , ఆచారాలకు గుర్తింపు పొందిందని, అయినప్పటికీ వారిని తగిన సంక్షేమ చర్యలు , ప్రభుత్వ పథకాలలో చేర్చకపోవడంతో సతమతమవుతున్నారని తెలిపారు. బుడగ జంగాల వారి గుర్తింపు, జీవనోపాధి మరియు సమగ్ర అభివృద్ధికి సంబంధించిన సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించలేదని, ఇది సమాజంలోని అనేక కుటుంబాలకు నిరంతర కష్టాలకు దారితీసిందని అన్నారు.
ప్రస్తుతం వారు తమ కుల ధృవీకరణ పత్రాల కోసం కూడా సరిగ్గా దరఖాస్తు చేసుకోలేకపోతున్నారని, వారికి సంక్షేమ పథకాలు, విద్య, ఉపాధి అవకాశాలతో సహా వారి సామాజిక, ఆర్థిక అవసరాలను తీర్చడానికి సమగ్ర విధానాన్ని రూపొందించడం చాలా ముఖ్యమని అమిత్ షా కి తెలిపారు. రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) కేటగిరీలో సరైన గుర్తింపు కోసం వారి డిమాండ్ లను ప్రాధాన్య ప్రాతిపదికన పరిశీలించాలని, ఇది వారి సామాజిక న్యాయం నిర్ధారించడానికి ఎంతగానో సహాయపడుతుందన్న విషయాన్ని కూడా అమిత్ షాకు ఎంపీ లావు తెలిపారు.