– రాష్ట్రంలో నేరాలు గతంతో పోలిస్తే భారీగా పెరిగాయి
– పోలీసు వ్యవస్థ అధికారపార్టీకి దాసోహమైంది
– విజయవాడలో శాంతిభద్రతలు దెబ్బతినేలా ఉన్నాయి
– కుప్పం ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలి
– పరిధిదాటి ప్రవర్తించిన అధికారుల చిట్టా సిద్ధం చేస్తున్నాం
– తప్పుచేసిన ప్రతి ఒక్కరినీ కోర్టు బోనులో నిలబెడతాం
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…
‘‘శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులకే రక్షణ లేకుండాపోయింది. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి పూర్తిగా దాసోహమైపోయింది. గతంలో సవాంగ్ డీజీపీగా ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థ ప్రాబల్యం, ప్రతిష్ట పూర్తిగా క్షీణించిపోయింది. ఆయన తరువాత వచ్చిన డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆచంట మల్లన్నలా అధికార పార్టీకి దాసోహం చేయడంలో సవాంగ్ ను మించిపోయాడు’’…..
‘‘కింగ్ ఈజ్ కరెక్ట్’’ అనేలా డీజీపీ తీరు:
వైసీపీ వాళ్లు ఏం చేసినా కరెక్టే అని డీజీపీ వంతపాడుతున్నాడు. 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, చంద్రబాబు తన సొంత నియోజకవర్గంలో పర్యటనకు వెళితే వైసీపీ మూకలు అక్కడ ఉద్దేశపూర్వకంగా అల్లర్లు సృష్టించారు. 35 సంవత్సరాలుగా కుప్పం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేస్తున్న వ్యక్తి, జడ్ ప్లస్ భద్రత కలిగిన వ్యక్తి, పర్యటనకు వస్తున్నానని పోలీసుల అనుమతి తీసుకున్నా..చంద్రబాబుకు భద్రత కల్పించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. కాన్వాయ్ పై దాడి చేశారు. కారు మీద రాళ్లు రువ్వారు, ఫ్లెక్సీలు చించారు. కార్యకర్తలపై కర్రలతో దాడి చేశారు. అన్న క్యాంటిన్లపై రెండు సార్లు దాడి చేస్తే డీజీపీ అక్కడ ఏమీ జరగలేదు. అంతా మామూలే అనడం సిగ్గుచేటు. దీంతో డీజీపీ బలహీనత ఏంటో తెలుస్తోంది.
గూండాలపై పిటీ కేసులు – టీడీపీ వారిపై హత్యాయత్నం కేసులా?
వైసీపీ గూండాలపై పనికిరాని దొమ్మి కేసు పెట్టారు. దాడిలో గాయపడిన టీడీపీకి చెందిన 60మందిపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. కుప్పంలో ఆరోజు జరిగిన విధ్వంసాన్ని భవిష్యత్తులో ఏరకంగా సమర్థించుకుంటారు? పోలీసు వ్యవస్థ చాలా నిర్లజ్జగా వ్యవహరించింది. ఏం పర్వాలేదు, టీడీపీ పై దాడి చేయండి, మిమ్మల్ని రక్షించడానికి నేనున్నాను అని డీజీపీ అభయహస్తమిచ్చినట్లు కాదా? చంద్రబాబునాయుడు రెండు సార్లు కాన్వాయ్ నుంచి దిగి రోడ్డు పై బైఠాయిస్తే సిగ్గు పడాల్సిన పోలీసు వ్యవస్థ ఏమీ లేకపోతే చంద్రబాబు ఎందుకు రోడ్డుపై బైఠాయిస్తారు? అన్న క్యాంటిన్ పై మూడు సార్లు దాడి జరిగింది.
డీజీపీ వ్యాఖ్యలను మరే పోలీసు అధికారి అయినా సమర్థిస్తారా?
రాష్ట్రంలో ఐదారుగురు అడిషనల్ పోలీసు జనరల్స్ ఉన్నారు. డీజీపీ కామెంట్స్ ను మీరు ఒప్పుకుంటారా? అని అడిషనల్ జనరల్ ఆఫ్ పోలీసు వారిని అడుగుతున్నాను. సమర్థిస్తారా? అని ప్రశ్నిస్తున్నాను. ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ వారు డీజీపీ మాట్లాడింది తప్పు అని డీజీపీకి నోటీసు ఇవ్వగలరా? మేం నోరు తెరిస్తే నోటీసులు ఇస్తారు, పోలీస్ ఆఫీసర్స్ సంఘం మరి డీజీపీ చేసిన వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని ఆయనకు నోటీసులు ఇవ్వగలదా? కుప్పంలో జరగాల్సిందంతా జరిగిపోతే ఏమీ జరగలేదంటారా? పోలీసు శాఖలో విచారణలు జరుగుతున్నాయా అనే అనుమానం కలుగుతోంది.
పోలీసు వ్యవస్థ సిగ్గుపడాలి:
తెలుగుదేశం పార్టీలోని ప్రశ్నించే గొంతులను నొక్కడానికే మీ చర్యలు పరిమితమా? శాంతిభద్రతలు ఈ విధంగా క్షీణిస్తుంటే, ఈ విధంగా భయానక వాతావరణం నెలకొందంటే పోలీసు వ్యవస్థ సిగ్గుపడాలి. నంద్యాలలో పోలీసు కానిస్టేబుల్ ను లాక్కెళ్లి ఆటోలో కూర్చోబెట్టి పొడిచి చంపితే స్పందించాల్సిన రీతిలో మీ పోలీసు శాఖ స్పందించలేదు. గుండెమీద చేయివేసుకొని చెప్పాలి. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ప్రజల్లో నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోయింది. మీ కానిస్టేబుల్ ని పొడిచి పొడిచి చంపితేనే దిక్కులేదు. ఇక మమ్మల్నేం కాపాడుతారని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. కావలిలో చేపల చెరువు అతను అయ్యా నా కుటుంబాన్ని కాపాడండని కాళ్లు పట్టుకుంటే నిర్దాక్షిణ్యంగా చంపేస్తే కనీసం ఒక సీనియర్ ఆఫీసరైనా సంఘటన స్థలానికి వెళ్లలేదు. డీజీపీ నోటి నుండి వచ్చేవన్నీ అబద్ధాలే.
హత్యాయత్నం జరిగితే విజయవాడ పోలీసులకు చీమకుట్టినట్లు కూడా లేదు:
విజయవాడలో పార్టీ స్టేట్ సెక్రటరి చెన్నుపాటి గాంధీ వినాయక మందిరం వద్దకు వెళ్తే వైసీపీవారే వినాయకుడిని ఏర్పాటు చేయాలా? టీడీపీ వారు చేయకూడదా? ఇనుపరాడుతో కంట్లో పొడిచారు. అతని చూపు పోయింది. హైదరాబాద్ లోని ఎల్ వీ ప్రసాద్ ఆసుపత్రిలో పెద్ద ఆపరేషన్ జరుగుతుంటే విజయవాడ పోలీసులకు చీమ కుట్టినట్లుగా కూడా లేదు. ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారో చెప్పడంలేదు. అధికార పార్టీ పోలీసు వ్యవస్థను తాకట్టు పెడతారా? అదెక్కడి న్యాయం? ఇదెక్కడి ధర్మం? ఎవరికి రక్షణ కల్పిస్తారో తెలియదు. పోలీసు వ్యవస్థ ఉన్నది వైసీపీవారిని రక్షించడానికేనా? వైసీపీవారు నేరం చేస్తుంటారు, మీరు రక్షిస్తుంటారు. శాంతిభద్రతలు ఏమయ్యాయి? విజయవాడలో మళ్లీ రౌడీ సంస్కృతిని తెస్తారా?
విజయవాడ కొన్ని దశాబ్దాలు బాధపడింది. మళ్లీ మీ అసమర్థత వల్ల మీ అధికార పార్టీకి దాసోహం చేయడంవల్ల పాత వ్యవహారశైలి తెస్తారా? ప్రజలు బిక్కు బిక్కుమని జీవించే పరిస్థితులు తెస్తారా? ఒకసారి అప్రమత్తం కావాలని పోలీసులకు సూచిస్తున్నాను. విజయవాడలో శాంతిభద్రతలు అదుపు తప్పితే ఏ విధంగా ఉంటుందో అనుభవించినవాడిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఆదిలోనే అడ్డుకోవాల్సి వుంటుంది. లేకుంటే ఎటు దారితీస్తుందో తెలియని పరిస్థితి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగారికి తెలిసివుండకపోవచ్చు. పాత చరిత్రను ఒకసారి తిరగేయాలి.
వైసీపీ నాయకులే నిందితులు:
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ పై కేసులున్నాయి. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ పై భార్యని వేధించిన కేసు ఉంది. విజయవాడ ఎంపీ చంద్రశేఖర్ పై ఐపీసీ 354 కేసు ఉంది. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పై ఐపీసీ 354 కేసు ఉంది. తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డిపై కేసుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, కరణం బలరాం లపైనా కేసు వుంది. ఉంటే మాకేంటని వాళ్లు అనుకుంటున్నారు. నేరస్థులందరూ మన పోలీసులున్నారుగా మనకేం పర్వాలేదు అంటున్నారని డీజీపీ గ్రహించాలి.
శాంతిభద్రతలను కాపాడతారా, గాలికొదిలేస్తారా డీజీపీ?
శాంతిభద్రతలు కాపాడతారా? గాలికొదిలేస్తారా? శాంతిభద్రతలు సజావుగా ఉన్నాయని ధైర్యంగా చెప్పగలరా? మహిళలపై నేరాలు 2018తో పోలిస్తే ఏపీలో క్రైమ్ రేటు భారీగా పెరిగింది. మహిళలపై నేరాలు 34.10 శాతం, భౌతిక దాడులు 46.45 శాతం, ఎస్సీ ఎస్టీలపై నేరాలు 13.05 శాతం, మోసాలు 28.03 శాతం, వేధింపులు 41 శాతం పాక్సో కేసులు 79.38 శాతం పెరిగాయి. చెన్నుపాటి గాంధీపై దాడిచేసిన కేసు ఇంకా నమోదు చేయకపోవడం పోలీసు వ్యవస్థ దిగజారుడుతనానికి నిదర్శనం. చెన్నుపాటి గాంధీపై దాడిచేసిన రౌడీలపై వెంటనే హత్యాయత్నం కేసు పెట్టి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అయినా రాష్ట్రంలో శాంతిభద్రతలు భేష్ అంటూ డీజీపీ చంకలు గుద్దుకోవడం చాలా బాధాకరం. కుప్పంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై దాడి జరిగితే అక్కడేం జరగలేదని డీజీపీ చెప్పడం ఆత్మవంచన చేసుకోవడమే.
డీజీపీ వ్యాఖ్యలు వైసీపీ గూండాలకు ఊతమిచ్చేలా ఉన్నాయి:
కుప్పంలో ఏం జరగలేదని డీజీపీ వ్యాఖ్యానించడం వైసీపీ గూండాలకు ఊతమివ్వడమే. డీజీపీ వ్యాఖ్యలను అదనపు డీజీలు ఎవరైనా సమర్థించేలా ఉన్నాయా? ఐపీఎస్ అధికారుల సంఘం డీజీపీ వ్యాఖ్యను సమర్థిస్తుందా? కొంత మంది పోలీసు అధికారులు సొంత ప్రయోజనాల కోసం పోలీసు వ్యవస్థను వైసీపీకి తాకట్టుపెట్టారు. పోలీసులపై రాష్ట్ర ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయింది. వైసీపీ గూండాలకు మాత్రమే పోలీసులు రక్షణ కల్పిస్తున్నారంటూ ప్రజలు బెంబేలెత్తుతున్నారు.
కుప్పం ఘటనపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి:
కుప్పం ఘటనపై కేంద్రం సీబీఐ విచారణ లేదా సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపిస్తే ఏపీ పోలీసుల అసమర్థత, వైకాపా గూండాల దౌర్జన్యం బట్టబయలవుతుంది. కేంద్ర హోం మంత్రి ఏపీలో శాంతిభద్రతలపై సమీక్ష నిర్వహించాలి..తగు చర్యలు తీసుకోవాలి. అన్యాయంగా వ్యవహరించిన అధికారుల చిట్టా రెడీ చేస్తున్నాం…పరిధిదాటి వ్యవహరించిన పోలీసులు తప్పించుకోలేరు. ఇప్పటికే 10మంది పోలీసు అధికారులపై ప్రైవేటు కేసులు వేశాం..మరికొన్ని సిద్ధంగా ఉంచాం. తప్పు చేసిన ప్రతి ఒక్కరినీ న్యాయస్థానం బోనులో నిలబెడతాం’’ అని వర్ల రామయ్య స్పష్టం చేశారు.