Suryaa.co.in

Andhra Pradesh

టిడిపిని కబ్జా చేసిన బాబే కబ్జాలకు ఆద్యుడు

– అయ్యన్నపాత్రుడు కబ్జాలకు అడ్డూ అదుపు లేదు
– కబ్జాలు చేయడం, చేయించడం చంద్రబాబు నైజం
– ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?
– అయ్యన్న కబ్జాలపై టిడిపి వాళ్లే విమర్శలు చేశారు
– బీసీ అయినంత మాత్రాన తప్పు చేస్తే వదిలేయాలా?
– చట్టం దృష్టిలో అందరూ సమానులే
– చంద్రబాబు నాయుడు బీసీలకు ఏం చేశారు?
:- మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
చట్టానికి ఎవరూ అతీతులు కాదు
నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు కబ్జా చేసిన స్థలంలో నిర్మించిన ప్రహరీ గోడను తొలగించడంలో చట్టం తన పని తాను చేసుకుపోతోంది. నిబంధనలు అతిక్రమిస్తే ఎవరైనా చట్టానికి అతీతులు కారు. చట్టం దృష్టలో అందరూ సమానులే.

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముందు ఏ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో ఉండి తాను ఎన్టీఆర్‌పై పోటీ చేసి గెలుస్తానని ప్రగల్బాలు పలికి, ఓడిపోయి మళ్లీ ఎన్టీఆర్‌ను బతిమిలాడుకుని తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీలో ఉండి పార్టీలోని వాళ్లందర్ని మెల్లగా దగ్గరకు చేర్చుకుని, ఆ పార్టీనే కబ్జా చేసిన మనిషి చంద్రబాబు నాయుడు. కబ్జాలు చేయడం, చేయించడం చంద్రబాబు నైజం. ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీని, సింబల్‌తో పాటు, ట్రస్టును, ఎన్టీఆర్‌ బ్యాంక్‌ బ్యాలెన్స్‌ను లాక్కున్న చరిత్ర బాబుది. అలాంటి కబ్జాల చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆ పార్టీ నాయకులు కబ్జాకోర్లు కాకుండా ఎవరు అవుతారు…? ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?

అయ్యన్నపాత్రుడు కబ్జాకోరు
అయ్యన్నపాత్రుడు కూడా పెద్ద కబ్జాకోరు. ఆయన కబ్జాకోరు అని ఉత్తరాంధ్రా అంతా కోడై కూస్తోంది. సొంతపార్టీ వాళ్లే అయ్యన్న కబ్జాలపై విమర్శలు చేశారు. ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతుంటే దాన్ని టీడీపీ వాళ్లు బీసీ రంగు పులిమే కార్యక్రమం చేస్తున్నారు. బీసీ అయినంత మాత్రాన తప్పు చేస్తే వదిలేయాలా? చట్టవ్యతిరేక కార్యక్రమాలు, హత్యలు చేస్తే బీసీలు అని చూస్తూ చర్యలు తీసుకోకుండా వదిలేయాలా?

బీసీలను టీడీపీ ఏనాడైనా గౌరవించిందా?
చంద్రబాబు నాయుడు బీసీలను కేవలం ఓటుబ్యాంక్‌గా మాత్రమే వాడుకున్నారు. ఏనాడైనా బీసీలకు బాబు గౌరవం ఇచ్చారా? నాయిబ్రాహ్మణులు తమ సమస్యలు చెప్పుకోవడానికి చంద్రబాబును కలిసేందుకు సచివాలయానికి వస్తే తమాషాలు చేస్తున్నారా? తోకలు కత్తిరిస్తా, మీ అంతు చూస్తా అంటూ బహిరంగంగానే మాట్లాడలేదా? అలాంటిది మీరు, మీ నాయకుడు బీసీల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. అలాగే మత్స్యకారులపై ఇష్టానుసారంగా నోరుపారేసుకుంది చంద్రబాబు కాదా అని ప్రశ్నిస్తున్నాం? ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని చంద్రబాబు మాట్లాడితే… ఇక ఆ పార్టీ నాయకులకు ఏం చిత్తశుద్ధి ఉంటుంది.

మహిళల పట్ల మీకేమైనా గౌరవం ఉందా? వాళ్ల గురించి మీరు మాట్లాడటమా? మీరు చేసే అవమానాలు తట్టుకోలేక గతంలో యామిని, నిన్నటికి నిన్న దివ్యవాణి టీడీపీని వీడారు. ఇక సాక్షాత్తూ చంద్రబాబు నాయుడు బామ్మర్ది బాలకృష్ణ ఏకంగా వేదిక మీదే ఆడది కనిపిస్తే ముద్దు అయినా పెట్టాలి… అంటూ నోటితో చెప్పలేని వ్యాఖ్యలు చేయడం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇదీ మీ సంస్కృతి. అయ్యన్నపాత్రుడు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మేము ఒక ఇల్లు కూలిస్తే పదిళ్లు కూలుస్తామని బుద్ధి లేని బుద్ధా వెంకన్న లాంటి టీడీపీ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు పద్ధతేనా? కాల్‌ మనీ వ్యవహారంలో విజయవాడలో ఎన్ని కుటుంబాలలో చిచ్చు పెట్టి, మహిళలను వేధించడం ప్రజలు మర్చిపోయారనుకుంటున్నారా? మీ ప్రభుత్వ హయాంలో అరాచకాలు, అకృత్యాలు, విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనలో ఎంత అన్యాయంగా వ్యవహరించారో అందరికీ తెలిసిన విషయమే. ఎంత దుర్మార్గంగా మీరు పాలన చేశారో ప్రజలు మర్చిపోరు. అంగన్‌వాడీ టీచర్లు నల్ల చీరలు ధరించి తమ నిరసన తెలిపితే చింతమనేని ప్రభాకర్‌ వాళ్లను దుర్భాషలాడుతూ దాడి చేయలేదా? ఇలాంటి అరాచకాలకు పాల్పడిన మీరా ఆడవాళ్లకు గౌరవం ఇచ్చేది? సాక్షాత్తూ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడే తాహసీల్దార్‌ వనజాక్షి విషయంలోనూ వ్యవహరించిన తీరు గుర్తులేదా? తప్పు చేసిన చింతమనేనిని వదిలేసి, మహిళా అధికారిణి వనజాక్షిదే తప్పు అంటూ దూషించలేదా?

వైయస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతోంది. భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు సమ న్యాయం పాటిస్తూ బీసీలకు పెద్దపీట వేశారు. అధికారంలోకి రాగానే 139 బీసీ కులాలను వెలికితీసి, అందులో 56 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారికి ఒక గౌరవాన్ని కల్పించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 70శాతం మంత్రివర్గంలో స్థానం కల్పించారు. అదే చంద్రబాబు నాయుడు బీసీలకు ఏం చేశారని సూటిగా ప్రశ్నిస్తున్నాం. బీసీలను అణగదొక్కడమే కాకుండా వారిని ఓట్లు వేసే యంత్రాలుగా చూశారు. నేను అధికారంలో ఉంటే కరోనా రాదని అంటున్న బాబుకు పిచ్చెక్కింది. చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటనలో పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. చంద్రబాబు అధికారంలో ఉంటే కరోనా వచ్చేది కాదట. సముద్రానికి అరచేయి అడ్డుపెట్టి తుఫాన్‌లను ఆపేస్తారు. 46, 50 డిగ్రీల ఉష్ణోగ్రతను కూడా 10 డిగ్రీలకు తెచ్చేసే సామర్థ్యం బాబుకు ఉందట.

నారా లోకేష్‌ పప్పు అని టీడీపీ నాయకులకు అర్థం అయిపోయింది. కొడుకుతో పార్టీ లేవదని అర్థమై… ఇప్పుడు ఈ వయసులోనూ తాను, తన మైండ్‌ స్ట్రాంగ్‌ అంటూ బాబు చెప్పుకోవడం సిగ్గుచేటు. ఇదంతా చూస్తుంటే చంద్రబాబుకు మతిస్థిమితం తప్పిందేమో అనే అనుమానం కలుగుతోంది. ఇవన్నీ చూస్తుంటే బాబు మైండ్‌ పోయింది అని ప్రజలకు అర్థం అయింది. అయినా సరే ఎల్లో మీడియా బాబును జాకీలతో పైకి లేపేందుకు విశ్వ ప్రయత్నం చేస్తోంది.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు పార్టీలకు, కులాలు, మతాలలకు అతీతంగా ప్రభుత్వ ఫలాలు అందరికీ అందాలని అధికారంలోకి వచ్చిన తొలిరోజే చెప్పారు. అదే చంద్రబాబు తమ వాళ్లకు మాత్రమే అనేలా వ్యవహరించారు. మా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌గారు రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో ఒక కొడుకులా, కుటుంబసభ్యుడిగా, మామయ్యలా, బిడ్డలా, ప్రజలతో పెనవేసుకుపోవడం చూసి తట్టుకోలేని చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు.2019 ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు151 సీట్లుతో అధికారంలోకి వస్తే 2024 ఎ‍న్నికల్లో 175కి 175 సీట్లు గెలుచుకునేలా ప్రజల్లోకి వెళుతున్నారు. ఇది తట్టుకోలేక చంద్రబాబు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు.

అయ్యన్నపాత్రుడైనా, కారుమూరి నాగేశ్వరరావు అయినా ఎవరైనా తప్పు చేస్తే ప్రభుత్వం క్షమించదు. చట్టం తనపని తాను చేసుకువెళుతుందనేది వాస్తవం. ప్రభుత్వం చేసే మంచి పనులను మెచ్చుకోకపోయినా ఫర్వాలేదు కానీ, బురద చల్లే కార్యక్రమంలో మాత్రం ముందు ఉంటున్నారు. బంతిని నేలమీదకేసి కొడితే ఎంత పైకి లేస్తుందో… అలాగే మీరు ఎంత బురద చిమ్మితే … జగన్‌గారు అంత పైకి లేస్తున్నారనేది గుర్తుపెట్టుకుంటే మంచిది. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు వైయస్సార్‌ సీపీ గెలుచుకోవడం ఖాయం.

విలేకరుల ప్రశ్నలకు సమాధానమిస్తూ ..
పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. అయ్యన్నపాత్రుడు ఒక తాగుబోతు. తాగుబోతు మాటలు మాట్లాడే నక్క అతడు. అలాంటి నక్క పులి అనుకుంటే హాస్యాస్పదంగా ఉంటుంది.
వైఎస్‌ జగన్‌ ఎప్పటికీ పులివెందుల పులే. ఆయన సింగిల్‌గానే వస్తారు. సింగిల్‌గానే ఎన్నికలకు వెళతారు. చంద్రబాబుకు ధైర్యం, దమ్ము ఉంటే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని సవాల్‌ విసురుతున్నా. పొత్తులు పెట్టుకుని అన్ని పార్టీలను కలుపుకుని పోటీ చేయడం కాదు.
ప్రజలు ఎవరి వెంట ఉన్నారో అందరికీ తెలుసు. టీడీపీ వాపు చూసి బలుపు అనుకుంటోంది. చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనకు వెళితే.. వచ్చిన వాళ్లు జై జగన్‌ అంటూ నినాదాలు చేస్తున్నారనేది గమనిస్తే మంచిది. ప్రభుత్వంపై బురద చల్లేందుకు, ఏదోవిధంగా అలజడి సృష్టించాలనే తపనతో చంద్రబాబు ఊగిపోతున్నారు.
ప్రభుత్వం మీద ఏమని పోరాటం చేస్తారు. కుల, మత, పార్టీలు చూడకుండా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నందుకు పోరాటం చేస్తారా? పథకాలు ఆపేయాలని ప్రభుత్వంపై పోరాటం చేస్తారా?

LEAVE A RESPONSE