September 22, 2026

నాయకులు పుట్టరు.. తయారవుతారు: లోకేష్ ప్రస్థానం!

(ఇంద్రాణి)

“నాయకులు పుట్టరు; తయారవుతారు” అనే మాట ఎప్పుడూ వింటూనే ఉంటాం. అదే మాటను లోకేష్ అమరావతి లీడర్‌షిప్ ట్రైనింగ్ కాంక్లేవ్‌లో చెప్పారు. కానీ, ఒక సాధారణ వ్యక్తిగానే ఎదిగిన లోకేష్ లీడర్ ఎలా అయ్యాడో గమనిస్తే మాత్రం ఆశ్చర్యం కలుగుతుంది. ఇక్కడ లోకేష్ లీడర్‌గా ఎదగడానికి, చంద్రబాబు నాయుడు నాయకుడిగా ఎదగడానికి ఒక వ్యత్యాసం ఉన్నది. చంద్రబాబు నాయుడు నాయకుడిగా ఎదగడానికి పడిన కష్టం కంటే లోకేష్ నాయకుడు కావడమే కష్టం.

కారణం, చంద్రబాబు నాయుడు అనే ఒక నాయకుడు పుట్టాడని వాళ్ల అమ్మానాన్నలకు తప్ప ఎవరికీ తెలిసే అవకాశమే లేదు; మహా అయితే వాళ్ల బంధువులకు తెలిసి ఉంటుంది. ఎటువంటి నేపథ్యమూ లేని ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఆయన మీద ఎవరి చూపూ ఉండే అవకాశం లేదు.

ఈరోజు నారావారిపల్లెకు ఒక గుర్తింపు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు. కానీ ఆయన పుట్టినప్పుడు ఆ పల్లె ఎవరికీ తెలియదు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఒక విద్యార్థి నాయకుడిగా ఆయన ఎదిగే వరకు ఆయనకు గుర్తింపు ఉండే అవకాశమే లేదు. విద్యార్థి రాజకీయాలలో ఆయన ఓడినా గెలిచినా అది ఆ విద్యాసంస్థ వరకే పరిమితం.

కానీ లోకేష్ పుట్టే సమయానికి వాళ్ల నాన్న మాజీ మంత్రి; తాతగారు నందమూరి తారక రామారావు సినీ దిగ్గజమే కాక, పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అపూర్వమైన విజయం సాధించిన ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు టీడీపీలో అంచలంచెలుగా ఎదిగేకొద్దీ సహజంగా లోకేష్ మీద పదిమంది దృష్టి ఉంటుంది. చంద్రబాబు నాయుడు మాదిరిగా తన స్వంత నిర్ణయాలతో నాయకుడిగా ఎదిగే అవకాశం లోకేష్‌కు లేదు.

నిఘా నీడలోనే పెరగక తప్పదు. విద్యార్థిగా ఆయనకు రాజకీయాలు నడిపే అవకాశం లేదు. విద్యార్థి రాజకీయాల నుండి నాయకుడిగా ఎదిగిన చంద్రబాబు నాయుడు కళాశాలల్లో విద్యార్థి సంఘ ఎన్నికలను రద్దు చేయడం అనే టీడీపీ నిర్ణయానికి కట్టుబడిపోవడం, లోకేష్ విద్యార్థి నాయకుడిగా తనను తాను మలచుకునే అవకాశాన్ని దెబ్బతీసింది.

ఎవరు ఎన్ని చెప్పినా భారతదేశ రాజకీయాలలో వారసత్వం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది అని ఒప్పుకోక తప్పదు. అందుకు చంద్రబాబు నాయుడు మినహాయింపు కాదు. లోకేష్ రాజకీయ అరంగేట్రం జరుగుతుందని చంద్రబాబుకూ తెలుసు; కానీ తన కొడుకు చదువుల్లో కూడా రాణించాలని ఆయన కోరుకున్నారు.

చంద్రబాబు నాయుడికి ఉన్న ప్రాణహాని (లైఫ్ థ్రెట్) వలన నిఘా నీడలోనే పెరగక తప్పదు. ఇన్ని నిర్బంధాల మధ్య లోకేష్ చదువుల్లో వాళ్ల నాన్న కోరిక నెరవేర్చాలి; పరిమితులకు లోబడే స్నేహాలు చేయాలి. అంటే పాతిక సంవత్సరాలు వచ్చేవరకు వాళ్ల నాన్నను చూస్తూ నేర్చుకోవలసిందే కానీ, తాను స్వయంగా రాటుదేలే అవకాశమే లేదు.

ఎలాగో ఒకలా రాజకీయ రంగప్రవేశం జరిగింది. చూసి నేర్చుకోగలిగేది క్రమశిక్షణే కానీ నాయకత్వ లక్షణాలు కాదు. మనదేశంలో రాజకీయాలు నడిచేది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలతోనే. చంద్రబాబు నాయుడికి తెలిసిన మధ్యతరగతి జీవితం లోకేష్‌కు తెలియదు; ఆ ఛాయలకు వెళ్లే అవకాశమే లేదు. చంద్రబాబుకు తన తరఫున తానే చక్రం తిప్పుకునే అవకాశం చిన్న వయసులోనే వచ్చింది. ఒక పార్టీ చక్రాన్ని తిప్పే అవకాశం కూడా చిన్న వయసులోనే వచ్చింది.
ఎన్టీఆర్ తరఫున చంద్రబాబు చక్రం తిప్పారు; కానీ లోకేష్‌ మాత్రం ఇప్పటికీ వాళ్ల నాన్న తిప్పే చక్రంలో ఒక ఇరుసు మాత్రమే. కాదూ కూడదంటే ఆ చక్రంతో పాటు తిరిగే చిన్న చట్రం; చక్రం అయితే చంద్రబాబే. ఆయన తన గెలుపోటముల గురించి ఇంట్లో ఎంతవరకు చర్చిస్తారో తెలియదు కానీ, మనకు తెలిసిన చంద్రబాబు నాయుడు అంతగా చర్చిస్తారని మనం అనుకోము.

ఒక శుభ ముహూర్తాన లోకేష్‌ను ఎమ్మెల్సీని చేశారు. అప్పటికి లోకేష్ ఎలా ఉంటాడో తెలుసు కానీ, ఏం చేస్తాడో తెలియదు. లోకేష్ తెలుగులో మాట్లాడే విధానం చూసినప్పుడు, రాజకీయాల్లోకి వస్తాడని తెలిసి కూడా చంద్రబాబు ఆయనకు తెలుగు నేర్పే ప్రయత్నం చేయలేదేమో అనిపించింది. లోకేష్ మాదిరిగా తెలుగులో తప్పులు మాట్లాడటం, ప్రసంగాలలో తడబడటం చాలామంది చేస్తుంటారు; కానీ లోకేష్‌ను గురించి పట్టించుకున్నంతగా వారిని ఎవరూ పట్టించుకోరు.
మరో పెద్ద కష్టం ఏమిటంటే, లోకేష్ తన ప్రవర్తనతో, మన్ననలతో పార్టీ కార్యకర్త నుండి పెద్ద నాయకుల వరకు అందరినీ మెప్పించాలి; జనాన్ని మెప్పించాలి. అప్పటివరకు తండ్రి చాటు కొడుకుగా మేనిఫెస్టోల రూపకల్పనలో వేలు పెట్టినా ఎవరూ బేరీజు వేయరు . కానీ తానే స్వయంగా బరిలోకి దిగాక ప్రజలు లోకేష్‌నే ముందుగా గమనిస్తారు. వీటన్నింటి మధ్యా ఆయన ప్రపంచమే గుర్తించిన చంద్రబాబు నాయుడి కొడుకు.

ఇన్ని ప్రతికూలతల మధ్య లోకేష్ తనను తాను మలచుకుని ఒక నాయకుడిగా ఎదిగారు. ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉంటాయో తెలియని లోకేష్, ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు తమ ప్రతిభను చాటే దశకు తీసుకెళ్తున్నారు.
ఓడిపోయిన దగ్గరే గెలుపు సాధించాలనే పట్టుదల ఉండటం వేరు; అందుకోసం తనదైన శైలిలో మంగళగిరి ప్రజలకు ఆయన చేరువయ్యారు. ఒకనాడు లోకేష్ ప్రసంగిస్తారంటే ఏమైనా తప్పులు దొర్లుతాయేమోనని టీడీపీ కార్యకర్తలు భయాందోళనలకు గురయ్యేవారు. కానీ ఈరోజు లోకేష్ వేదికపైన ఉంటే ఆయన ప్రసంగం ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్నారు.

మొన్న జరిగిన లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో మాట్లాడుతూ చెప్పిన కొన్ని విషయాలను కార్యకర్తలు అనుసరిస్తే ఖచ్చితంగా నాయకులు అవుతారు. ఇప్పుడు లోకేష్ తెలుగులో అనర్గళంగా మాట్లాడగలరు. కేవలం ఉపన్యాసం దంచడం కాకుండా, కార్యకర్తలతో సంభాషిస్తారు. కార్యకర్తల కాల్‌కు స్పందిస్తారు; సామాన్య ప్రజల ఫోన్ కాల్స్‌కు వెంటనే సమాధానం చెప్తారు; నియోజకవర్గ ప్రజలతో వారిలో ఒకరిగా మమేకమైపోతారు.

నాయకుడిగానే ప్రొజెక్ట్ అయినవారికి నేర్చుకునే అవకాశం తక్కువ. వీరిలో నాయకత్వ లక్షణాలు కొద్దో గొప్పో ఉన్నా, నేరుగా నాయకుడిగానే ప్రజల్లోకి వెళ్లిన తరువాత అదే చట్రంలో ఇరుక్కుపోతారు. అటువంటి ఒరవడిలో కొట్టుకుపోకుండా లోకేష్‌ను కాపాడింది తన ఓటమి. అప్పటివరకు చంద్రబాబు నాయుడి కుమారుడిగా మాత్రమే జనం తనను చూశారని లోకేష్‌కు అర్థమయ్యింది. చంద్రబాబు నాయుడికి ఒక నియోజకవర్గం ఉన్నది; అది తాను పుట్టిన గడ్డ. లోకేష్‌కు అలా లేదు; ఎన్టీఆర్ మాదిరిగానే తానే స్వయంగా వెతుక్కున్నారు. పోగొట్టుకున్న చోటే నిలబెట్టుకున్నారు.

పార్టీలో కూడా గౌరవాన్ని కష్టపడి మాత్రమే సాధించగలిగారు. తప్పటడుగుల నుండి తాను వేసిన చిన్న చిన్న అడుగులను పార్టీ కార్యకర్తలకు తెలియజెప్పడంలో ఆయన పరిపూర్ణత సాధించారు. ప్రజలు, పార్టీ, ప్రభుత్వం అనే మూడు చక్రాలకు పార్టీ కార్యకర్త ఎలా ఇంధనం కావాలో తనకు అనుభవంలోకి వచ్చిన విధానాన్ని నేర్పే విషయంలో చంద్రబాబు కంటే ఒక మెట్టు పైనే నిలిచారు.

పార్టీ కార్యకర్తకు “ఈ పని చేయండి” అని మాత్రమే చెబుతారు చంద్రబాబు; కానీ ఆ పనిని “ఎలా చేయవచ్చో” మార్గదర్శనం చేస్తున్నారు లోకేష్. పార్టీలో ఉన్న నాలుగు తరాల వారితో సత్సంబంధాలు నెరపడంలో కృతకృత్యుడైనందువల్లే ఆయన ఒక స్పష్టమైన దిశను సూచించగలుగుతున్నారు.

ఇలాగే నిత్య విద్యార్థిగా ఉన్నంత కాలం లోకేష్ టీడీపీలో తన ప్రాధాన్యతను పెంచుకోగలుగుతారు; కానీ నేర్చుకోవడానికి ఏమీ లేదు అనుకునే అవకాశం మాత్రం ఆయనకు లేదు. పార్టీని నడపడంలో లోకేష్ విధానం వేరు, చంద్రబాబు విధానం వేరు.
కార్యకర్త ముఖంలోకి చూస్తూ ఆత్మీయంగా మాట్లాడతారు లోకేష్. అంత ఆత్మీయత చూపిస్తే దాన్ని బలహీనతగా లేదా అవకాశంగా వాడుకుంటారని బాబుగారు ఆచితూచి వ్యవహరిస్తారని అంటారు. కానీ లోకేష్ అందుకు పూర్తి భిన్నం. కార్యకర్తకు అత్యంత దగ్గరగా వెళతారు; ఫోన్లోనైనా, వ్యక్తిగతంగానైనా వారికి నిరంతరం అందుబాటులో ఉంటారు.
కాలానుగుణంగా మారిన రాజకీయ స్వరూపానికి నిలువెత్తు నిదర్శనం టీడీపీ మూడు తరాల నాయకత్వం. ఎమ్మెల్యే అంటే ఆకాశం నుండి ఊడిపడినట్లుగా భావించే రోజుల్లో నందమూరి తారక రామారావు వారిని ప్రజల్లో ఒకరిగా చేసి, ప్రజలు వారి వద్దకు కాకుండా ఎమ్మెల్యేలే ప్రజల వద్దకు వెళ్లేలా చేశారు.

తరువాత వచ్చిన చంద్రబాబు నాయుడు పాలనను ప్రజల వద్దకు తీసుకెళ్లారు. ఇప్పుడు కొత్త తరం వచ్చింది. పాలనను, ప్రజలను సమన్వయం చేసుకుంటూ పార్టీ క్యాడర్‌ను కార్యోన్ముఖులను చేసే దిశగా అడుగులు వేస్తోంది. నాయకత్వం అంటే సరికొత్త అర్థం చెబుతూ, మల్టీ టాస్కింగ్‌కు సిద్ధపడేవారే భవిష్యత్ నాయకులు అవుతారని నిరూపిస్తోంది. ఆ తరానికి అసలైన ప్రతినిధి లోకేష్.

Total Visitors: 2,736,277