– కోడలు సహా తీగల కృష్ణారెడ్డి చేరిక?
– ఠాక్రే, రేవంత్‌తో తీగల చర్చలు
– ఎల్లుండి ఖర్గే సమక్షంలో చేరిక?
– అదేబాటలో మాజీ ఎమ్మెల్యేలు వీరేశం, శశిధర్‌రెడ్డి, రామారావుపటేల్
-గద్వాల జడ్పీ చైర్మన్ అనిత, ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్‌రెడ్డి కూడా
– మాజీ ఎమ్మెల్యే యెన్నం, మాజీ ఎమ్మెల్సీ దిలీప్ సహా మరికొందరితో కాంగ్రెస్ నేతల చర్చలు
– ప్రియాంక సమక్షంలో కాంగ్రెస్‌లో చేరే అవకాశం?
– చేరికలతో కాంగ్రెస్‌లో కదనోత్సాహం
– చకచకా పావులు కదుపుతున్న రేవంత్‌రెడ్డి
– బీఆర్‌ఎస్, బీజేపీ అసంతృప్తులపై రేవంత్ గాలం
– జిల్లా స్థాయి నుంచి అసంతృప్తుల జాబితాపై కలసి కసరత్తు
– అందరికీ అందుబాటులో మాణిక్‌రావ్ ఠాక్రే
-వేగంగా పావులు కదుపుతున్న రేవంత్‌రెడ్డి
( మార్తి సుబ్రహ్మణ్యం)
కర్నాటక ఫలితాల పుణ్యమా అని తెలంగాణ కాంగ్రెస్ మళ్లీ కళకళలాడుతోంది. బీజేపీలో చేరికలు పూర్తిస్థాయిలో చతికిపడిన నేపథ్యంలో, ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరికలు జోరందుకుంటున్నాయి. ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ జడ్పీ చైర్మన్లు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా బరిలోకి దిగిన టీపీసీసీ చీఫ్, ఎంపి రేవంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్, బీజేపీ అగ్రనేతలను కాంగ్రెస్‌లోకి తీసుకువచ్చే వ్యూహాలకు పదునుపెడుతున్నారు. అటు రాష్ట్ర పార్టీ ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే కూడా హైదరాబాద్‌లోనే మకాం వేసి, చేరికల కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు. పార్టీలో చేరేవారికి భరోసా ఇస్తున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్‌కు మంచిరోజులు వచ్చే సూచనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అందుకు ఇటీవలి కాలంలో పెరుగుతున్న చేరికలే నిదర్శనం. ఖమ్మం జిల్లాలో మాస్ ఇమేజ్ ఉన్న మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల కాంగ్రెస్‌లో చేరగా, హైదరాబాద్ మాజీ మేయర్‌గా ప్రజలందరికీ తెలిసిన, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కూడా కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ఆయనతోపాటు కోడలయిన జడ్పీ చైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి కూడా, కాంగ్రెస్ కండువా కప్పేసుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆ మేరకు మామా-కోడలిద్దరూ, హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్‌లో ఇన్చార్జి ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్‌తో భేటీ అయ్యారు.
మహేశ్వరం నియోజకవర్గంలో.. గత ఎన్నికల్లో ఓడిన తీగల కృష్ణారెడ్డిని పక్కనపెట్టి, ఆయనపై గెలిచిన సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు. అప్పటినుంచి నియోజకవర్గంలో, తీగల భాగస్వామ్యం పూర్తిగా కనుమరుగయింది. ఆయనను పార్టీ సమావేశాలకు సైతం పిలవడం మానేశారు. దానితో తీవ్ర మనస్తాపానికి గురైన తీగల, కొద్దిరోజుల నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారు.
ఆయన ఒక దశలో, తిరిగి టీడీపీలో చేరతారన్న ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే, తెలంగాణ టీడీపీ నాయకత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోవడంతో, కాంగ్రెస్ రంగంలోకి దిగింది. పీసీసీ చీఫ్ రేవంత్ స్వయంగా రంగంలోకి దిగి, తీగలతో మాట్లాడినట్లు సమాచారం. పార్టీలో తగిన గుర్తింపు, వచ్చే ఎన్నికల్లో సీటు ఇస్తామన్న హామీతో, తీగల కాంగ్రెస్ చేరిక దాదాపు ఖాయమయినట్లు తెలుస్తోంది. ఎల్లుండి వారిద్దరూ ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో, కాంగ్రెస్‌లో చేరే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
ఇక పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బీఆర్‌ఎస్-బీజేపీ నాయకత్వాల వైఖరితో విసుగుచెందిన వీరంతా కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకోవడంతో, ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బలపడనుంది.
మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, మందుల సామెల్, శశిధర్‌రెడ్డి, రామారావు పటేల్, గద్వాల జడ్పీ చైర్‌పర్సన్ సరిత, ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్‌రెడ్డి కూడా ఢిల్లీలోనే పార్టీలో చేరవచ్చంటున్నారు. ఇక బీజేపీ మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, ఏనుగు రవీంద్రరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ మరికొందరితో, కాంగ్రెస్ నేతలు ఇప్పటికే చర్చలు జరిపినట్లు సమాచారం. అన్నీ కలసివస్తే.. కొల్లాపూర్‌లో ప్రియాంకగాంధీ నిర్వహించే సభలో, వీరంతా కాంగ్రెస్ తీర్ధం తీసుకోవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్రంలో కాంగ్రెస్‌కు మళ్లీ జవజీవాలు తీసుకువచ్చి, బీఆర్‌ఎస్‌ను గద్దె దింపాలన్న ఏకైక లక్ష్యంతో అడుగులేస్తున్న పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, తన ముందున్న అన్ని అవకాశాలనూ సద్వినియోగం చేసుకుంటున్నారు. జిల్లాల్లో బీఆర్‌ఎస్-బీజేపీ అసంతృప్త నేతలు, వచ్చే ఎన్నికల్లో టికెట్లు వచ్చే అవకాశాలు లేని సిట్టింగు ఎమ్మెల్యేలు, ఆ స్థాయి నియోజకవర్గ అగ్రనేతలను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు.
అసంతృప్త నేతలను పసిగట్టి, వారితో నేరుగా మాట్లాడుతున్నారు. వారికి తగిన హామీ ఇచ్చి, పార్టీలో చేర్పించే పనిలో బిజీగా ఉన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే కూడా, పీసీసీ నాయకత్వాన్ని భుజం తట్టి ప్రోత్సహిస్తున్నారు. ఆయన ఎక్కువగా నగరంలోనే ఉంటూ, ఇతర పార్టీ నేతలతో జరిగే చర్చల్లో భాగస్వామి అవుతున్నారు. రేవంత్‌రెడ్డి కూడా ఆ భేటీలలో, ఇన్చార్జి ఠాక్రేతోనే హామీలిప్పిస్తుండటంతో, పార్టీలో చేరే నేతలలో నమ్మకం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.