* ఏపీ ‘టెక్స్ టైల్స్’కు మంచిరోజులు
* నూతన పాలసీతో ఏపీ వైపు పెట్టుబడిదారుల చూపు
* విశాఖ సమ్మిట్ తో పెట్టుబడుల వెల్లువ
* అయిదేళ్ల పెట్టుబడుల టార్గెట్ లో 43 శాతం రాక
* సమర్థ నాయకత్వం వల్లే సాధ్యం
– రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత
అమరావతి : రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి కోసం సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఇందుకు ఉదాహరణ ఇటీవల విశాఖలో నిర్వహించిన సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ ఓ ఉదాహరణ. కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, భౌగోళిక పరిస్థితులు, సమర్త నాయకత్వంతో ఏపీకి పెట్టుబడులు వెల్లువెత్తాయని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత తెలిపారు.
ఈ సదస్సులో రూ.13.26 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. వాటిలో రూ.4,381.38 కోట్లు ఏపీ టెక్స్ టైల్స్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఎనిమిది మంది ఇన్వెస్టర్లు ఎంవోయూలు కుదుర్చకున్నారు. ఈ ఒప్పందాలతో టెక్స్ రంగంలో కొత్తగా 6,460 ఉద్యోగాలు ప్రత్యక్షంగా రానున్నాయి.
గత ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన టెక్స్ టైల్స్ రంగానికి ఈ పెట్టుబడులు పునరుత్తేజం కలిగించేవే. సీఎం చంద్రబాబునాయుడు, మంత్రులు నారా లోకేశ్, సవిత కృషితో టెక్స్ టైల్స్ రంగంలో పూర్వ వైభవం నెలకొందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. 2024-29 నూతన టెక్స్ టైల్స్ పాలసీ టార్గెట్ లో 43 శాతం పెట్టుబడులు విశాఖ సమ్మిట్ లోనే రావడం విశేషం.
ఆ 5 ఏళ్లలో ‘టైక్స్ టైల్స్’ కుదేల్
దేశ, రాష్ట్రాభివృద్ధిలో పరిశ్రమలు చాలా కీలకం. కాని, గత జగన్ ప్రభుత్వ హయాంలో సరిదిద్దుకోలేని తప్పిదాలు ఫలితంగా రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి కుంటుపడింది. 2019-24 మధ్య సరైన ప్రోత్సాహకాలు, అప్పటి ప్రభుత్వ విధానాల కారణంగా ఉన్న పరిశ్రమలు తరలిపోగా, కొత్త పరిశ్రమల ఏర్పాటు ఊసేలేదు. ముఖ్యంగా టెక్స్ టైల్స్ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఏపీ టెక్స్ టైల్స్, అపెరల్ అండ్ గార్మెంట్స్ పాలసీని 2018-23 ఆనాటి చంద్రబాబు తీసుకొచ్చింది. తరవాత వచ్చిన జగన్ ప్రభుత్వం ఈ పాలసీ కొనసాగింపుపై విధివిధానాలు, మార్గదర్శకాలు రూపొందించకపోవడంతో ఈ పాలసీ బుట్టదాఖలైంది. మరే నూతన పాలసీ కూడా తీసుకురాకపోవడంతో, టెక్స్ టైల్స్ రంగం సంక్షోభంలో కూరుకుపోయింది.
2024 తరవాత మరోసారి సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో పాటు టైక్స్ టైల్స్ రంగం ఊపందుకుంది. సీఎం చంద్రబాబునాయుడు నూతన టెక్స్ టైల్స్ పాలసీని తీసుకొచ్చారు. అయిదేళ్లలో రూ.10 వేల కోట్లు పెట్టుబడులు, రెండు లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఈ పాలసీని రూపొందించారు. దీనిలో భాగంగా ఇటీవల విశాఖలో జరిగిన సీఐఐ పార్టనర్ షిప్ సదస్సులో ఎనిమిది ఎంవోయూలతో రూ.4,381.38 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
5 జిల్లాల్లో పరిశ్రమలు…6,460 ఉద్యోగాలు
విశాఖ సీఐఐ సదస్సులో కుదిరిన ఎనిమిది ఎంవోయూలతో అయిదు జిల్లాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. టెక్నికల్ టెక్స్టైల్స్, రీసైక్లింగ్, గార్మెంట్స్, సిల్క్, అప్పెరెల్స్ రంగాల్లో ఈ పెట్టుబడులు పెట్టడానికి ఇన్విస్టర్స్ ఆసక్తి చూపారు. విశాఖపట్నం, చిత్తూరు, గుంటూరు, శ్రీ సత్యసాయి, అనకాపల్లి జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడిదారులు ముందుకొచ్చారు. విశాఖపట్నంలో రూ.4 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఫిన్లాండ్ కు చెందిన ఇన్ఫినిటెడ్ ఫైబర్ సంస్థ ముందుకొచ్చింది.
ఈ సంస్థ దుస్తుల రిసైక్లింగ్ లో పెట్టుబడులు పెట్టనుంది. ఈ పరిశ్రమ ఏర్పాటుతో 360 మందికి ఉపాధి లభించనుంది. చిత్తూరు జిల్లా గండ్రాజుపల్లిలో బెంగుళూరుకు చెందిన జీనియస్ ఫిల్టర్స్ సంస్థ రూ.120 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనుంది. ఈ సంస్థ వల్ల ప్రత్యక్షంగా 250 మందికి ఉపాధి లభించనుంది. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో అరవింద్ అపెరల్ పార్క్ రూ.20 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. ఈ సంస్థ ఏర్పాటుతో రెండు వేల ఉద్యోగాలు రానున్నాయి. గుంటూరులో వామిని ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.35 కోట్లు మే పెట్టుబడులు పెట్టనుంది. ఈ సంస్థతో గుంటూరులో రెండు వేల మందికి ఉపాధి లభించనుంది.
విశాఖపట్నంలో ఎంవీఆర్ టెక్స్ టైల్స్ రూ.105.38 కోట్ల మేర పెట్టుబడులు పెట్టడానికి ఆ సంస్థ యాజమాన్యం ముందుకొచ్చింది. ఈ సంస్థ ఏర్పాటుతో 900 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. అనకాపల్లిలో బీక్యూ టెక్స్ టైల్స్ యాజమాన్యం రూ.10 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపింది. ఈ సంస్థ వంద మందికి ఉపాధి కల్పించనుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కామధేను సటికా సంస్థ రూ.90 కోట్లతో పెట్టుబడులు పెట్టనుంది. ఈ సంస్థ ఏర్పాటుతో 650 మందికి ఉపాధి లభించనుంది. యూకేకు చెందిన ఐఎస్ఎస్ ఎయిర్ వ్యూ సంస్థ కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. ఏ జిల్లాలో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయాలో త్వరలో ప్రభుత్వం ప్రకటించనుంది.
టెక్స్ టైల్స్ రంగానికి ఊతం
విశాఖ పార్టనర్ షిప్ సమ్మిట్ లో చేసుకున్న ఒప్పందాలతో ఏపీ టెక్స్ టైల్స్ రంగానికి ఊతం లభించిందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏపీ అభివృద్ధి పథంలోకి దూసుకుపోతోందన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారవేత్తను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రోత్సాహకాలు అందజేస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు విజన్, మంత్రి నారా లోకేశ్ సమర్థతతో ఏపీకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయన్నారు.
సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన టెక్స్ టైల్స్ విధానంతో ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి పలువురు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారన్నారు. వారేకాక మరింత మంది రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. ఈ పరిశ్రమలను ఆరు నెలల్లో నెలకొల్పనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు