– కంపెనీ పెట్టాలన్న ఆలోచన మానుకుంటున్నా
– ఎవరైనా ముందుకు వస్తే తప్పకుండా సహకరిస్తా
– ఇండోసోల్ సోలార్ కంపెనీ కూడా ఎంతో మంచిది
– మంచి చేయాలనుకుంటే నిందలు మోపుతున్నారు
– న్యాయబద్దంగా ఏర్పాటు చేసిన రెండు కంపెనీల ద్వారా ఎక్స్పోర్ట్ చేసింది కేవలం 19 వేల టన్నులే
– నా వ్యాపారంలో ఉన్న టర్నోవర్ ఎంత.. క్వార్ట్జ్ ఎంత?
– క్వార్ట్జ్ బిజినెస్‌ను వదిలేస్తున్నా..
– 2023-2024 మధ్య 9 లక్షల 60 వేల టన్నుల క్వార్ట్జ్ ఎక్స్పోర్ట్ చేశారు
– 2024-25 మధ్య 96 కంపెనీల ద్వారా ఎక్స్పోర్ట్ అయింది 1లక్ష 60 వేల టన్నులు మాత్రమే
– క్వార్ట్జ్ విషయంలో వస్తున్న ఆరోపణలకు స్పష్టత ఇచ్చిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి
నెల్లూరు: క్వార్ట్జ్ ఎక్స్‌పోర్ట్స్ విషయంలో తప్పుడు ప్రచారాలపై నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు కొట్టి పడేశారు. తాను కూటమి ప్రభుత్వ అనుమతితో, నిజాయతీకి కట్టుబడి కంపెనీ పెట్టాలని భావించానని, కానీ రాజకీయాల్లోకి వచ్చి సేవ చేస్తుంటే తప్పుడు ప్రచారాలు, ఆరోపణలు బాధిస్తున్నాయని చెప్పారు.
ఇకపై క్వార్ట్జ్ కి తనకు ఎలాంటి సంబంధం లేదని, కంపెనీ పెట్టాలన్న ఆలోచనను విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. చట్టబద్దంగా ఈ ఏడాది కాలంలో నా కంపెనీల ద్వారా 19 వేల టన్నులను ఎక్స్పోర్ట్ చేస్తే, తాను కోట్లు కొట్టగొట్టానని ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నారు. తన వ్యాపారంలో వస్తున్న టర్నోవర్ ఎంత.. క్వార్ట్జ్ ఎంత అని ప్రశ్నించారు.
నా వ్యాపారం టర్నోవర్ ఎంత.. క్వార్ట్స్ ఎంత?
క్వార్ట్జ్ వ్యవహారంలో తాను కోట్లు కొల్లకొడుతున్నారంటూ చేస్తున్న విమర్శలకు ఆయన కొట్టిపడేశారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జులై -2024 నుంచి జూన్- 2025 మధ్య 96 కంపెనీల ద్వారా చైనాకు చెన్నై పోర్టు ద్వారా 1,60,604 టన్నులు ఎక్స్పోర్ట్ అయితే.. తాను ఏర్పాటు చేసిన కంపెనీలు ఫినీ క్వార్ట్జ్, లక్ష్మీ క్వార్ట్జ్ శాండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల ద్వారా 19,608 వేల టన్నులు ఎక్స్‌పోర్ట్స్ చేసినట్లు వివరించారు.
ఈ 19 వేల టన్నులతో తాను సంపాదించింది ఏమిటని ఆయన ప్రశ్నించారు. గతంలో జనవరి 2023 నుంచి జూన్ 2024 మధ్య ఇదే పోర్టు ద్వారా ఎక్స్పోర్ట్ చేసింది అక్షరాలా 967186 వేల టన్నులని ఆయన వివరించారు. చెత్తా చెదారాన్నంతా ఎక్స్పోర్ట్ చేయడం వల్ల చైనా కంపెనీలు మూత పడే పరిస్థితి దాపురించిందని పేర్కొన్నారు.
యువతకు ఉద్యోగాలు కల్పిద్దామనుకున్నా…
కూటమి ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా, అన్ని అనుమతులు తీసుకుని తాను క్వార్ట్జ్ కు సంబంధించి కంపెనీ పెట్టాలని భావించానని, అందుకు అనుగుణంగా 400 కోట్ల వ్యయంతో కంపెనీ ఏర్పాటు చేసేలా చైనాకు ప్రత్యేక బృందాన్ని పంపించామన్నారు.
తన కంపెనీల ద్వారా క్వార్ట్జ్ను చైనాలో క్రూసిబుల్స్ తయారీలో ఇన్సర్ లేయర్, ఔటర్ లేయర్ కు ఉపయోగకరంగా ఉంటుందా అని టెస్టింగ్ కోసం పంపామన్నారు. అయితే ఈ ఆరోపణలతో ఇక కంపెనీ ఏర్పాటు ప్రయత్నాన్ని విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. ఇకపై ఈ విషయంలో తనపై ఆరోపణలు చేస్తే వాళ్ల ఖర్మకు వదిలేస్తున్నానన్నారు. తాను నీతి నిజాయతీలకు కట్టుబడి వ్యాపారాలు చేసే వ్యక్తినని, అందుకే ఆరోపణలను సహించలేనన్నారు.
సొంత డబ్బుతో సేవా కార్యక్రమాలు చేస్తున్నా..
తాను రాజకీయాల్లోకి రాకముందు నుంచే జిల్లాలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని, ఇటీవల తన సొంత నిధులు తెచ్చి దివ్యాంగులకు ఎలక్ట్రికల్ ట్రై సైకిళ్లు అందించినట్లు చెప్పారు. అలాగే త్వరలోనే విపిఆర్ నేత్ర అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని, దాని ద్వారా కంటి వైద్య పరీక్షలు నిర్వహించి కంటి చూపును తెప్పిస్తామని స్పష్టం చేశారు.
కానీ తాను ఇంత చేస్తున్నా.. తనను డీఫేమ్ చేయాలని చూస్తూ.. అనవసర ఆరోపణలు చేయడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. సీఎస్ఆర్ ఫండ్ అనేది కూడా సొంత నిధులేనని, సీఎస్ఆర్ నిధుల ద్వారా ప్రజోపయోగ కార్యక్రమాలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు.
ఎవరైనా ముందుకు వస్తే సహరిస్తా..
క్వార్ట్జ్ కంపెనీ అనేది మంచిదని, దాని ద్వారా ఎంతో భవిష్యత్తు ఉంటుందని వివరించారు. ఎవరైనా జిల్లా నుంచి గాని, ఇతర జిల్లాల నుంచి గాని ముందుకు వస్తే తప్పకుండా సహకరిస్తానన్నారు. సోలార్ ప్యానెల్స్ తయారీకి క్వార్ట్జ్ ఎంతో ముఖ్యమని, ఇండోసోల్ సోలార్ కంపెనీ కూడా ఎంతో మంచిదని చెప్పారు.
చైనాలో 100 ఫ్యాక్టరీలు ఉన్నాయని, అయితే క్వాలిటీ లేని మెటీరియల్ పంపడం వల్ల అక్కడ సిస్టమ్ చెడిపోయిందన్నారు. ఈ ఆరోపణలు భరించలేక తానుగా క్వార్ట్జ్ వ్యాపారాన్ని క్లోజ్ చేస్తున్నానని, ఇకపై ఎవరైనా తనపై ఆరోపణలు చేస్తే ఆ దేవుడే చూసుకుంటాడని తేల్చి చెప్పారు.