– విభజన చట్ట సవరణ ప్రక్రియ
– వైకాపాలో అంతర్మథనం
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఏపీ రాష్ట్ర విభజన చట్టం, 2014లోని సెక్షన్ 5(2)కు సవరణ చేసే ప్రక్రియను ప్రారంభించింది. ఈ పరిణామం వైకాపా వర్గాల్లో ఆందోళన కలిగిస్తున్నట్లు సమాచారం.
ఈ చట్ట సవరణ ప్రక్రియలో ముఖ్యమైన దశలు కింద ఇవ్వబడ్డాయి:
* ఈ సవరణ ప్రతిపాదనకు ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ ఆమోదం లభించింది.
* తరువాత, కేంద్ర మంత్రివర్గం ఈ ప్రతిపాదనను ఆమోదించాల్సి ఉంటుంది.
* మంత్రివర్గం ఆమోదం అనంతరం, సవరణ బిల్లును పార్లమెంటులోని ఉభయ సభల్లో (లోక్‌సభ మరియు రాజ్యసభ) ప్రవేశపెడతారు.
* పార్లమెంటు ఆమోదం పొందిన వెంటనే, ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ రాజపత్రం (గెజిట్) విడుదల అవుతుంది.
రాష్ట్ర విభజన చట్టంలో ప్రస్తుతం ఉన్న నిబంధనలు (సెక్షన్ 5):
* పార్ట్ 2 కింద 5(1): నిర్ణయించిన తేదీ నుంచి పదేళ్లకు మించకుండా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుంది.
* పార్ట్ 2 కింద 5(2): సబ్ సెక్షన్ 5(1)లో పేర్కొన్న గడువు ముగిసిన తర్వాత తెలంగాణ రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్‌కు నూతన రాజధాని ఏర్పాటవుతుంది.
ప్రతిపాదిత సవరణ ద్వారా అమరావతిని స్పష్టంగా పేర్కొంటూ విభజన చట్టంలో మార్పు చేయనున్నారు:
* సవరించిన 5(2): పార్ట్ 2 – 5(2) సబ్-సెక్షన్లో ప్రస్తుతం ఉన్న “ఆంధ్రప్రదేశ్‌కు నూతన రాజధాని ఏర్పాటవుతుంది” అనే వాక్యం స్థానంలో…
* “అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌కు నూతన రాజధాని ఏర్పాటైంది” అని పేర్కొంటారు. ఈ చట్ట సవరణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టబడినప్పుడు, దేశంలోని వివిధ రాజకీయ పార్టీల మధ్య అమరావతి విషయంలో వైకాపా ప్రభుత్వం అనుసరించిన వైఖరిపై తీవ్ర చర్చ జరిగే అవకాశం ఉంది.
వైకాపా అధినేత మూడు రాజధానుల ప్రతిపాదనతో అమరావతి ప్రాజెక్టును నిలిపివేయడం, రైతుల మీద చేసిన అమానుషం. అది భరించలేక గుండెపగిలి మరణించిన వారి గురించి జాతీయ స్థాయిలో మరోసారి చర్చకు వచ్చే అవకాశం ఉన్నందున, తమ గత నిర్ణయాలు ‘చారిత్రాత్మక తప్పిదం’గా చర్చకు రావడం వైకాపా పెద్దల్లో భయం మరియు కలవరం కలిగిస్తున్నట్లు తెలుస్తోంది. దానితో పాటు రిషికొండ మీద ప్యాలెస్ గురించి కూడా ప్రస్తావిస్తే మరింత నవ్వులపాలవుతాం అనే చర్చ వైకాపా వర్గాల్లో జరుగుతోంది.
– -చాకిరేవు