Suryaa.co.in

Andhra Pradesh

మూజువాణి ఓటుతో రెండు బిల్లులకు శాసన మండలిలో ఆమోదం

వివాదాస్పద ల్యాండ్‌ టైటిలింగ్ యాక్ట్‌ రద్దు, ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు బిల్లులకు రాష్ట్ర శాసనమండలి, శాసనసభ ఆమోద ముద్ర వేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో ఈ చట్టాలపై అనేక ఆందోళనలు, అనుమానాలు జరిగిన విషయం తెలిసిందే.

వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, సహా హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును పునరుద్ధరించే బిల్లులను శాసనమండలి ఆమోదించింది. శాసన సభలో ఆమోదం అనంతరం బిల్లును మంత్రి సత్యకుమార్ యాదవ్ శాసన మండలిలో ప్రవేశపెట్టారు. పలువురు అధికార పార్టీ ఎమ్మెల్సీలు ల్యాండ్ టైట్లింగ్ బిల్లులోని లోపాలను ఎత్తిచూపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరిట వైఎస్సార్సీపీ సర్కార్ చేసిన చట్టం రాక్షస చట్టంగా ఎమ్మెల్సీలు పంచుమర్తి అనురాధ అభివర్ణించారు.

భూ దోపిడీల కోసమే ఈ చట్టాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెచ్చిందని ఎమ్మెల్సీ అశోక్ బాబు ధ్వజమెత్తారు. అనేక లోపాలున్నాయని గతంలోనూ చట్టాన్ని వ్యతిరేకించినా గత వైఎస్సార్సీపీ సర్కారు రాత్రికి రాత్రి నిర్ణయాలు తీసుకుని చట్టాలు చేసిందని, పీడీఎఫ్ ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు తెలిపారు.

ప్రజలను భయాందోళనలకు గురి చేయడం సహా ఆస్తులకు రక్షణ కల్పించలేని ఈ తరహా చట్టాలను బిల్లులను రద్దు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. మహనీయుడు ఎన్టీఆర్ పేరును హెల్త్ యూనివర్సిటీకి పెట్టగా జగన్ ప్రభుత్వం తొలగించడాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రంగా తప్పుపట్టారు. తిరిగి ఆయన పేరుపెట్టి మహనీయుడిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. అనంతరం మూజువాణి ఓటుతో రెండు బిల్లులను మండలి చైర్మన్ మోషేను రాజు ఆమోదించారు.

వివాదాస్పద ల్యాండ్‌ టైటిలింగ్ యాక్ట్‌ రద్దు బిల్లుకు రాష్ట్ర శాసనసభ ఆమోద ముద్ర వేసింది. శాసనసభలో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రిపీల్ బిల్లును స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్, తెలుగుదేశం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సమర్థించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఒక నియంత చట్టమని మంత్రి సత్యప్రసాద్‌ విమర్శించారు.

వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏమాత్రం ఆలోచన లేకుండా ల్యాండ్ టైటిలింగ్‌ చట్టాన్ని తీసుకొచ్చిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. ఈ చట్టం వచ్చి ఉంటే పౌరుల ఆస్తిని కొందరు మింగేసే పరిస్థితి ఉండేదన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో భూ వివాదాలు పెరిగిపోయాయని గత ఐదేళ్లలో అనేక అవకతవకలు జరిగాయని చెప్పారు. భూమి తరతరాలుగా వారసత్వం ప్రకారం వస్తోందన్నారు. భూమికి పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తామని వాటిపై రాజముద్ర వేస్తామని స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE