– తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ పుట్టింది డిసెంబర్ నెలలోనే
– ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నెల కూడా డిసెంబర్ నెలనే
– ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
క్రిస్టియన్ సోదరులకు తెలంగాణ ప్రభుత్వం తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు. మానవ సేవయే మాధవ సేవగా భావించి.. ప్రేమను పంచాలి, శాంతిని పెంచాలి అని ఏసుక్రీస్తు చాటారు. ద్వేషించే వారిని సైతం ప్రేమించాలని మానవాళికి ఏసుక్రీస్తు సందేశం ఇచ్చారు. ఏసుక్రీస్తు జన్మించిన డిసెంబర్ నెల మిరాకిల్ మంత్. డిసెంబర్ నెల క్రీస్తు ఆరాధకులకు మాత్రమే కాదు… తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక మిరాకిల్ మంత్.
కాంగ్రెస్ అధినేత్రి, తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ పుట్టింది డిసెంబర్ నెలలోనే. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నెల కూడా డిసెంబర్ నెలనే. ప్రభువు బోధనల స్పూర్తితో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోంది. ఎవరు ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా, దుష్ప్రచారం చేసినా రాష్ట్రంలో శాంతిని కాపాడుతూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం.
పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అందిస్తున్నాం. 50 లక్షల పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ అందించి పేదల కుటుంబాల్లో వెలుగులు నింపాం. ఆనాడు ఆహార భద్రత చట్టం తీసుకువచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ రాష్ట్రంలో 3 కోట్ల 10 లక్షల మంది పేదలకు సన్న బియ్యం అందిస్తున్నాం.
పేదలను మా కుటుంబ సభ్యులుగా భావించి వారికి సన్న బియ్యం అందిస్తున్నాం. రుణమాఫీ చేసి సన్న వడ్లకు 500 బోనస్ అందించి వ్యవసాయాన్ని పండగ చేశాం. ఆనాడు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఎడ్యుకేషన్, ఇరిగేషన్ రంగాలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. క్రిస్టియన్ మిషనరీలు విద్య, వైద్యాన్ని ప్రాధాన్యతగా తీసుకుని పేదలకు అందించాయి. ఒక యుద్ధంలా, యజ్ఞంలా అంకితభావంతో ప్రభుత్వంతో పోటీ పడి పేదలకు విద్య, వైద్యాన్ని అందించాయి.
ఎవరి మతాన్ని వారు ఆచరిస్తూనే ఇతర మతాలను గౌరవించాలి. మత ప్రాతిపదికన దాడులు చేయాలని చూసినవారిని, అలాంటి ఘటనలను ప్రభుత్వం అణచివేసింది. ఇతర మతాలను కించపరిస్తే శిక్షించే విధంగా శాసన సభలో చట్టం తెస్తాం. ఎవరైనా ఇతర మతాలను కించపరిచేలా మాట్లాడితే శిక్షించేలా చట్టాన్ని సవరిస్తాం. అన్ని మతాలకు సమాన గౌరవాన్ని కల్పిస్తాం. మైనారిటీలకు అందించే సంక్షేమం ఎవరి దయ కాదు. అది వారి హక్కు.
క్రిస్టియన్, ముస్లిం స్మశాన వాటికల సమస్యను పరిష్కరిస్తాం. తెలంగాణ రైసింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ కు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళతాం. అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతాం