– ఆర్ఎస్ఎస్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్
ఇండియాను ఇక భారత్ అని అందరూ పిలవాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ దేశంలోని ప్రజలను పిలుపిచ్చారు. భారతదేశం అనే పేరుకు చారిత్రక ప్రాధాన్యత ఉందని, ఇది పురాతన కాలం నుంచి వాడుకలో ఉందని ఆయన తెలిపారు.
గౌహతిలో సకల్ జైన సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మోహన్ భగవత్ మాట్లాడుతూ మన దేశం పేరు పూర్వం నుంచి భారత్ అని గుర్తు చేశారు.
భాషలు ఎలా ఉన్నా పేరు మాత్రం అలాగే ఉంటుందని చెప్పారు. లెక్కలేనన్ని తరాలుగా భారతదేశం అనేది మన దేశానికి పేరని తెలిపారు. భాషా భేదం లేకుండా ప్రజలు భారతదేశం అని పిలవడం ప్రారంభించాలని డా. భగవత్ పిలుపిచ్చారు. అన్ని రంగాలలో భారతదేశం పేరును ఉపయోగించాలని, దీనిపై ప్రజలలో అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.
అయితే, కొన్నిసార్లు మనం ఇంగ్లీషులో మాట్లాడేటప్పుడు ఇండియా అని వాడాల్సి వస్తుందని, అవతలి వ్యక్తికి అర్థమయ్యేలా దీన్ని మనం ఈ విధంగా ఉపయోగిస్తామని చెప్పారు. కానీ, ఇకపై అలా చేయాల్సిన అవసరం లేదని డా. భగవత్ స్పష్టం చేశారు. భాష ఆధారంగా ప్రత్యేక పేర్లను మార్చలేరని అంటూ ప్రపంచంలో ఎక్కడా ఇలా జరగలేదని పేర్కొన్నారు.
ప్రపంచ వేదికపై భారతదేశం ఏకం చేసే శక్తిగా వ్యవహరిస్తోందని ఆయన భరోసా వ్యక్తం చేశారు. భారత దేశ విద్యా వ్యవస్థపై బ్రిటిష్ వలస ప్రభావం ఉందని, దానిని తెరమరుగు చెయ్యాలని స్పష్టం చేశారు. “మన దేశం భారత్, మనం ‘ఇండియా’ అనే పదాన్ని ఉపయోగించడం మానేసి, అన్ని ఆచరణాత్మక రంగాలలో భారత్‌ను ఉపయోగించడం ప్రారంభించాలి. అప్పుడే మార్పు వస్తుంది. మన దేశాన్ని భారత్ అని పిలవాలి. ఇతరులకు కూడా వివరించాలి” అని సూచించారు.
భారతదేశం అందరినీ ఏకం చేసే దేశం అని భగవత్ పేర్కొంటూ “ఈ రోజు ప్రపంచానికి మన అవసరం ఉంది. మనం లేకుండా ప్రపంచం నడవదు. మనం యోగా ద్వారా ప్రపంచాన్ని అనుసంధానించాము” అని చెప్పారు.
బ్రిటీష్ వారు భారతీయ విద్యా వ్యవస్థను ధ్వంసం చేశారని చెబుతూనే, నూతన విద్యా విధానం ద్వారా పిల్లల్లో దేశభక్తిని పెంపొందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
భారతీయ సంస్కృతి విలువలు, సంప్రదాయాలు, కుటుంబ సూత్రాలను పిల్లలకు తెలియజేయాలని తల్లిదండ్రులను మోహన్ భగవత్ కోరారు. ఇటీవల జాతీయ స్థాయిలో ఏర్పడిన ప్రతిపక్ష కూటమికి ఇండియా’ అని పేరు పెట్టారు.
ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ అధినేత డా. మోహన్ భగవత్ వ్యక్తం చేసిన అభిప్రాయం ప్రాధాన్యత సంతరింప చేసుకుంది.
తల్లిదండ్రులు తమ పిల్లలకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ విలువలపై అవగాహన కల్పించాలని ఆయన కోరారు.
సెప్టెంబరు చివరి వారంలో ఒక రోజును `అంతర్జాతీయ క్షమాపణ దినోత్సవం’గా పాటించాలని ఈ కార్యక్రమంలో చేసిన అభ్యర్థనను ప్రభుత్వానికి తెలియజేస్తానని భగవత్ చెప్పారు.
‘నిజం’ సౌజన్యంతో