Suryaa.co.in

Andhra Pradesh

రైతుల నుంచే నేరుగా కొనుగోలు చేసి ప్రోత్సహిద్దాం: త్రిదండి అహోబల జీయర్ స్వామి

-విజయ కీలాద్రి క్షేత్రంలో కర్షక దేవోభవ అవగాహనా సదస్సు
-వేద విద్యార్థుల సమక్షం లో 40 వ రోజు కర్షక దేవోభవ సదస్సు

సామాన్యుల ఆహారం మొదలు దేవాలయాల్లో పెట్టే నైవేద్యం వరకూ వినియోగించే పదార్ధాలు రైతులు పండించేవేనని, అలాంటి రైతులు సుభిక్షంగా ఉండాలని త్రిదండి అహోబల రామానుజ జీయర్ స్వామి తెలియ చేసారు. బుధవారం మిషన్ కర్షక దేవోభవ అవగాహన కార్యక్రమాన్ని సీతానగరం చిన్నజీయర్ స్వామి వేద పాఠశాల సమీపంలోని విజయ కీలాద్రి క్షేత్రంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ ప్రతిరోజూ ఈ సమయంలో సుందర కాండ ప్రవచనం జరుగుతుందని, రైతుల సంక్షేమం కోసం చేస్తున్న కర్షక దేవోభవ అవగాహన సదస్సు మరింత సుందర మైనదన్నారు. వేద, పురాణాల్లో అన్నం, ఆహారం తదితర పదార్థాల ప్రభావం మనుషుల పై ఎలా ఉంటుందో స్వామీజీ వివరించారు.

ఋగ్వేదం లో అహమన్నం అహమన్నం అనే పదాలకు వివరణ ఎలా ఉన్నదో తెలియ చేసారు. ఆశ్రమాలు, వేద పాఠశాలలు, ఆలయాలు వరకూ అవసర వస్తువులను నేరుగా రైతుల నుంచే తీసుకునే ప్రయత్నం జరగాలని తెలిపారు.

మిషన్ కర్షక దేవోభవ జాతీయ చైర్మన్ ఆడారి కిషోర్ కుమార్ మాట్లాడుతూ జగద్గురువులు త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి ఆశ్రమములో ఈ సదస్సు నిర్వహించడం తమ అదృష్టం అన్నారు. స్వామి వారి శిష్యులు త్రిదండి అహోబల జీయర్ స్వామివారిని చాతుర్మాస్య దీక్షా సమయంలో దర్శించుకోవడం మరింత ఆనందంగా ఉందన్నారు.

రైతులకు కనీస మద్దతు ధర లభించాలని, వారికి కనీస గౌరవం లభించాలని కోరుతూ ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. అనంతరం జీయర్ స్వామీ ఆశ్రమం వాసులతో కలిసి కర్షక దేవోభవ పోస్టర్ ను విడుదల చేసారు. రైతు దేవో భవ, కర్షక దేవోభవ నినాదాలు చేయించారు. రైతులు సుభిక్షంగా ఉండాలని, ఆర్థిక ఇబ్బందుల వల్ల అకాల మరణం చెందకుండా సుఖ శాంతులతో ఉండేలా శ్రీనివాసుని ఆశీస్సులు అందించమని స్వామి వారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో విజయ కీలాద్రి క్షేత్రం నిర్వాహకులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE