నిజం గెలవాలి అనేది మన నినాదం
మా కుటుంబం మొత్తాన్ని జైల్లో పెట్టినా కార్యకర్తలు టీడీపీ ని నడిపిస్తారు:- నారా భువనేశ్వరి
రాష్ట్రం కోసం నిరంతరం శ్రమించే నేతను జైల్లో పెట్టారు అనేదే బాధ
అందరిపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టడమే ఈ ప్రభుత్వానికి పని
చంద్రబాబు అరెస్టుతో చనిపోయిన 105 కుటుంబాలను స్వయంగా కలుస్తా…అండగా ఉంటా
నారా భువనేశ్వరి
నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ సత్యమేవ జయతే పేరుతో నారా భువనేశ్వరి నిరాహార దీక్ష
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు దీక్ష లో కూర్చున్న భువనేశ్వరి, పలువురు మహిళా నేతలు
వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి దీక్షకు మద్దతు తెలిపిన ప్రజలు
పిల్లల చేతుల మీదుగా నిమ్మరసం తీసుకుని 5.10 గంటలకు దీక్ష విరమించిన భువనేశ్వరి
రాజమహేంద్రవరం:- సత్యమేవ జయతే పేరుతో తాను చేసిన దీక్ష చంద్రబాబు నాయుడు కోసమో…తన కుటుంబం కోసమో కాదని….ప్రజల కోసం, అన్యాయాన్ని ప్రశ్నించడం కోసమని నారా భువనేశ్వరి అన్నారు. నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ రాజమహేంద్రవరంలో ఉదయం 10 గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకు భువనేశ్వరి నిరాహార దీక్ష చేశారు. రాజమహేంద్రవరంలోని కోరుకొండ రోడ్డులోని క్వారీ సెంటర్ లో భువనేశ్వరి దీక్షలో కూర్చున్నారు.
అంతకు ముందు విద్యానగర్ లోని క్యాంప్ సైట్ నుండి బయలుదేరిన భువనేశ్వరి..కంబాల చెరువులోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి దీక్షా స్థలికి వెళ్లి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహానికి, తండ్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించి దీక్షను ప్రారంభించారు. ఈ దీక్షకు వివిధ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి మద్దతు తెలిపారు. యువత, ముస్లిం మహిళలు, గృహిణులు, ఉద్యోగస్తులు దీక్షా వేదిక వద్దకువచ్చి సంఘీభావంతెలిపారు. చంద్రబాబు అరెస్టు అక్రమని నినదించారు. చంద్రబాబు తోనే మేము అంటూ మద్దతు తెలిపారు. భువనేశ్వరికి చిన్నారులు నిమ్మరసం అందించి దీక్షను విరమింపజేశారు.
తరలివచ్చిన మహిళలు, ప్రజలనుద్దేశించి భువనేశ్వరి ప్రసంగిస్తూ.. మా కుటుంబాన్ని జైల్లో పెట్టడంపైనే ప్రభుత్వ ధ్యాస ఉందని అన్నారు. అరెస్టుతో కుటుంబంలో ఉన్న నలుగురం..నాలుగుదిక్కులయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబును జైల్లో పెట్టాక బ్రాహ్మణి, తాను రాజమహేంద్రవరంలో ఉన్నామని, లోకేష్ న్యాయం కోసం ఢిల్లీలోనే ఉన్నాడన్నారు. తమ కుటుంబానికి ఈ పరిస్థితి ఎదురవుతుందని ఏనాడూ అనుకోలేదని బాధను వ్యక్తం చేశారు.
చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రంలో 105 మంది చనిపోయారని, వారి కుటుంబాలను కలిసి పలకరిస్తానన్నారు. వారి కోసం నిలబడతానని హామీ ఇచ్చారు. నిజం గెలవాలి అనేది మన నినాదం….దీని కోసం నేను కూడా ప్రజల వద్దకు వస్తాను…కలిసి పోరాటం చేద్దాం అని భువనేశ్వరి పిలుపునిచ్చారు. ‘‘రాష్ట్రంలో నిజం గెలవాలి..ప్రజలు నిలవాలి. మనకు మళ్లీ స్వాతంత్ర్యం రావాల్సి ఉంది. నేను ప్రజలతోనే ఉంటూ ప్రజల కోసమే పోరాడుతా. చంద్రబాబు, కుటుంబం కోసం నేను దీక్ష చేయలేదు.
గాంధీ జయంతి రోజున ప్రజల కోసం, అన్యాయాన్ని వెలుగెత్తి చెప్పడానికి దీక్ష చేశా. మహాత్మగాంధీ దేశం కోసం బ్రిటిషు వాళ్లతో పోరాడి స్వాతంత్ర్యం తీసుకొచ్చారు. అలాంటి వ్యక్తికే జైలు జీవితం తప్పలేదు.. జైలు నుండి గాంధీ ఎన్నోసార్లు బటయకు వచ్చారు..మళ్లీ జైలుకు వెళ్లారు. నా వెనక మీ అందరు ఇచ్చిన ధైర్యం ఉంది. కుటుంబానికి సమయం కేటాయించాలి అని గతంలో చంద్రబాబు పై ఒత్తిడి తెచ్చేదాన్ని. కానీ ఇప్పుడు చెప్తున్నా నా ఆయుష్సు కూడా పోసుకుని చంద్రబాబు మరిన్ని రోజులు బతకాలి. ప్రజలకు సేవచేయాలు అందించాలి. సత్యమేవ జయతే..అహింసా అనే పదాలు నమ్మి దీక్షలో కూర్చున్నా. ఎన్టీఆర్ టీడీపీని ప్రజల కోసం ఏర్పాటు చేశారు.
ఎన్టీఆర్ ఎంతో నిజాయితీపరులు. ఆ నీడ కిందే మా కుటుంబం ముందకు నడించింది..చంద్రబాబు కూడా అదే స్ఫూర్తితో పార్టీని ముందుకు నడిపారు. ఎన్టీఆర్, చంద్రబాబు సీఎంలుగా చేసినా మా కుటుంబంపై అవినీతి మచ్చ లేదు..అది ఎన్టీఆర్ మాకు నేర్పించిన క్రమశిక్షణ. ఎన్టీఆర్, చంద్రబాబు సీఎంలుగా ఉన్నా ఏనాడూ ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేయలేదు. అవినీతి చేసినట్లు మా కుటుంబంపై ఒక్క ఆరోపణ కూడా లేదు..మా పని మేము చేసుకుంటూ వేళ్లేవాళ్లం. ఎన్టీఆర్ స్పూర్తితో చంద్రబాబు పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. యువతకు ఏ విధంగా మంచి చేద్దామనే చంద్రబాబు ఆలోచిస్తారు.
25 ఏళ్ల క్రితమే ఐటీ గురించి ఆలోచించారు. సైబరాబాద్ ను చంద్రబాబు నిర్మించారు. బిల్ గేట్స్, బ్లిల్ క్లింటన్ లాంటి గొప్ప వ్యక్తులు చంద్రబాబు లీడర్ షిప్ పై ఉన్న నమ్మకంతోనే వచ్చి పెట్టుబడులు పెట్టారు. హైదరాబాద్ అభివృద్ధి అయిందంటే దాని వెనక చంద్రబాబు హార్డ్ వర్క్ ఉంది. రోజుకు 18 గంటలు పని చేసేవారు. రాష్ట్ర విభజన అయ్యి సీఎం అయ్యాక అమరావతి, పోలవరం గురించే నిత్యం ఆలోచించేవారు. అమరావతి సైబరాబాద్ ను మించిపోవాలని కల కనేవారు.
రాష్ట్ర విభజనకు మందు 9 ఏళ్లు సీఎంగా చేసినా.. విభజన తర్వాత 5 ఏళ్ల పాటు చంద్రబాబు పడిన కష్టం నేను ఏనాడూ చూడలేదు. విభజనతో రాష్ట్రంలో అప్పులు, రాళ్లరప్పలు తప్ప ఏమీ లేవు. ఒక ఇళ్లు కట్టాలంటే కనీసం 2 ఏళ్లు పడుతుంది..అలాంటిది ఆదాయం లేని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే 10 ఏళ్లు పడుతుంది. కానీ 5 ఏళ్లలోనే ఎందుకు చేయలేదని హేళన చేశారు. ప్రజలు చేసిన పొరపాటుకు ఉన్నది కూడా పోయింది. మీరంతా మళ్లీ ఆలోచించి ఓటు వేయాలి.
మమ్మల్నిందరినీ అరెస్టు చేసినా మా బిడ్డలైన కార్యకర్తలు టీడీపీ జెండాను ఎగురేసి ముందుకు తీసుకెళ్తారు. మేము లోపలున్నా టీడీపీని ముందుకు నడిపిస్తారు. చంద్రబాబుపై నమ్మకం ఉంచిన మీ అందరినీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబును అరెస్టు చేశాక మద్ధతుగా ప్రజలు దీక్షలు, ర్యాలీలు చేశారు..దీన్ని నేను మర్చిపోలేను. చంద్రబాబు ఇచ్చిన వెలుగుతోనే చాలా కుటుంబాలు సవ్యంగా నడుస్తున్నాయి. అందుకే అన్ని వర్గాలు ఆయనకు మద్దతుగా నిలిచాయి.
రాజకీయాలతో డబ్బులు పొందే ఆలోచన చేయొద్దని చంద్రబాబు ఎప్పుడూ అనేవారు. ప్రభుత్వాన్ని అడ్డంపెట్టుకుని డబ్బులు సంపాదించాలని కూడా మేము ఏనాడూ అనుకోలేదు. హెరిటేజ్ ద్వారా వ్యాపారం చేసుకుని బతుకుతున్నాం. ప్రజల సొమ్ముపై మాకు ఆశలేదు. నేడు ఈ మహిళా శక్తి ని చూస్తే గర్వంగా ఉంది. మీరు చేసే పోరాటాన్ని చంద్రబాబు నేరుగా చూస్తే ఎంతో సంతోషించేవారు. చంద్రబాబు కోసం మీరు ఇంతలా పోరాడుతున్నారంటే అది ఆయనపై నమ్మకం.
మీ బిడ్డల భవిష్యత్తు చూస్తారనే ఆయన కోసం ఇంత మంది మహిళలు రోడ్డెక్కుతున్నారు. చంద్రబాబు ఉంటే భరోసా ఉంటుదని మహిళలు నమ్ముతున్నారు. నిరసన తెలుపుతుంటే మహిళలు అన్న విషయం మర్చిపోయి లాగి పోలీసు వ్యానుల్లో నిర్బంధించి, స్టేషన్ల చుట్టూ తిప్పారు…అయినా చంద్రబాబు కోసం పోరాడారు. చంద్రబాబుకు సంఘీభావం తెలిపి, అండగా నిలుస్తున్నవారందరికీ ధన్యవాదాలు చెప్తున్నా’’ అని భువనేశ్వరి అన్నారు.
సత్యమేవ జయతే అని నినాదాలు చేశారు. దీక్షకు జనసేన, సిపిఐ పార్టీలు సంఘీభావం తెలిపాయి. ఇరుపార్టీల నేతలు భువనేశ్వరిని కలిసి దీక్షలో పాల్గొన్నారు. బ్రహ్మకుమారీలు సైతం వచ్చి భువనేశ్వరికి తమ మద్దతు తెలిపారు.