రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత
అమరావతి : ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆశయ సాధనకు ఐక్యంగా కృషి చేద్దామని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖా మాత్యులు ఎస్.సవిత పిలుపునిచ్చారు. టంగుటూరి జయంతి సందర్భంగా ఆయ న చిత్రపటానికి తాడేపల్లి మంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆమె పూల మాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగామంత్రి సవిత మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యోద్యమంలో టంగుటూరి ప్రకాశం పంతులు కీలకపాత్ర పోషించార్నారు. సైమన్ గో బ్యాక్ ఉద్యమంలో ముందుండి పోరాడారన్నారు. తుపాకులు ఎక్కుపెట్టిన బ్రిటీష్ సైనికులకు తన గుండెను చూపి, దమ్ముండే కాల్చండి అని ఎదురొడ్డి నిలిచిన ధీశాలి ప్రకాశం పంతులు అని ఆమె కొనియాడారు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో మూడేళ్లు జైలు శిక్ష కూడా అనుభవించారన్నారు. తొలి భాషాప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్ర రాష్ట్రానికి ఆయన మొదటి ముఖ్యమంత్రిగా సేవలందించారన్నారు.
మద్రాసు ప్రెసిడెన్సీకి ప్రధాన మంత్రిగా కూడా ప్రకాశం పంతలు పనిచేశారన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు ప్రకాశం జిల్లా ఒంగోలు వాసి కావడం ఎంతో గర్వకారణమన్నారు. టంగుటూరి జీవితం నేటి యువతకు ఎంతో ఆదర్శమని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు అందరమూ ఐక్యంగా కృషి చేద్దామని మంత్రి సవిత పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.