2019-2024 మధ్యకాలం లో ఆంధ్రప్రదేశ్ లో కొనసాగిన పాలనా వ్యవస్థ”క్లెప్టోక్రసీ”ని తలపించిందని రాష్ట్ర వైద్య , ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ అనంతపురం లో జరిగిన “సూపర్ సిక్స్-సూపర్ సభ “లో వైసీపీ ని ఓ పోటు పొడిచారు .
అసలు “క్లెప్టోక్రసీ” అంటే ఏమిటి?
మనకు డెమోక్రసీ అంటే తెలుసు, డిక్టేటర్ షిప్ అంటే కూడా తెలుసు. క్లెప్టక్రసీ అనే పదం, దాని అర్ధం తెలుసుకోవలసిన అవసరం మనకు ఈ డెబ్భయ్ అయిదేళ్ళల్లో ఇంతవరకు పడలేదు.
డెమోక్రసీ లాగానే, ఇది కూడా ఒక తరహా పలానా వ్యవస్థ.
నియంతృత్వ పాలనా ప్రభుత్వం ( అంటే రష్యాలో పుతిన్ , చైనాలో జిన్ పింగ్ ఆధ్వర్యంలో నడుస్తున్న పాలనా వ్యవస్థలు…ఉగాండా లో ఇడీ అమిన్ గతం లో నడిపిన పాలనా వ్యవస్థ, ఉత్తర కొరియా లో కిమ్ జోంగ్ ఉన్ ఆధ్వర్యంలో ఇప్పుడు నడుస్తున్న పాలనా వ్యవస్థ వంటివి )చరిత్రలో తొలి నుంచీ ఉన్నవే.
సరే.ప్రజాస్వామిక పాలనా వ్యవస్థ.. అంటే…. 1947 లో దేశానికి ‘స్వాతంత్య్రం’లాటిది వచ్చిన నాటి నుంచీ ప్రజల అభిమతానికి అనుగుణం గా ఎన్నికైనట్టు సమాజానికి కనపడే వ్యక్తుల ఆధ్వర్యంలో నడిచే ప్రజాస్వామిక పాలన. ఇదో తమాషా వ్యవస్థ అని కొన్ని జాతీయ ఆంగ్ల చానళ్ళు కూడా ఎన్నికల సమయాలలో అభివర్ణి స్తూ ఉంటాయి.
ఇందులో తమాషా ఏంటంటే….; ప్రజలు ఒకరిని నమ్మి, పాలనాధికారం అప్పగిస్తే….. వారి తరఫున ఎవరెవరో ….రాజకీయాల్లో తాడూ బొంగరం లేని వాళ్ళు రంగం లోకి దిగేసి ,పాలనా వ్యవస్థలను కబ్జా చేసేసి, వాటిని నియంత్రిస్తూ… నిలువు దోపిడీ “పాలన” సాగిస్తారు.
అయితే; నియంత్రత్వ వ్యవస్థ కంటే ఇది కొంత నయం. కనీసం కొంత మేరకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటుంది. నచ్చని వాళ్ళను ఎంత అసభ్యంగా సోషల్ మీడియా లో దూషించినా అది భావ ప్రకటనా స్వేచ్ఛ గానే పరిగణించాలి గానే , క్రిమినల్ కేసు గా కాదు అని తెలంగాణ హై కోర్ట్ కూడా చెప్పింది .
ఇక, మరొకటి ఉంది . అదే -క్లెప్టోక్రసీ.
‘క్లెప్టోక్రసి’ (KLEPTOCRACY)అంటే…. ఒక్క మాటలో – ” దొంగల రాజ్యం ” అని అర్ధం. దేశ (అంటే… ఇక్కడ రాష్ట్ర అని ) సహజ వనరులను సమాజ హితం కోసం కాక,తమ స్వార్ధం కోసం నిలువునా దోచుకునే వ్యక్తుల కనుసన్నలలో నడిచే వ్యవస్థ.
ఆంగ్ల భాషకు ప్రపంచ వ్యాప్తం గా పరమ ప్రామాణికమైన ” ఆక్స్ ఫర్డు ” నిఘంటువు లో “క్లెప్టోక్రసీ ” అనే పదానికి ఈ అర్ధమే ఉంది.
2019 నుంచి నిరాఘాటం గా సాగిన వైసీపీ పాలన… ఇదే పదానికి ఉన్న అర్ధాన్ని పదే పదే తలపింప చేసిందనే భావనలను చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ , బీజేపీ నేత సత్యకుమార్ తో సహా పలువురు నేతలు, విమర్శకులు ఎన్నికలకు ముందు వ్యక్తం చేస్తూ రాష్ట్రం అంతా తిరిగారు. ప్రజలు బ్రహ్మ రధం పట్టారు..
ప్రజాస్వామ్య ముసుగులోనడిచిన క్లెప్టోక్రసీని తలపించే పాలన లో….చిన్న పదవి లో ఉంటే… చిన్న దోపిడీ. పెద్ద పదవిలో ఉంటే పెద్ద దోపిడీ సాగించారనే భావన రాష్ట్రమంతా అల్లుకుపోయింది . పైనుంచి కింది వరకు నిరాఘాటంగా సాగిన ఈ అధీకృత దోపిడీ వ్యవస్థ తీరుతెన్నులతో భయ కంపితులైన తెలుగు జనం…. 2024 ఎన్నికల్లో ఈ క్లెప్టోక్రసీ లాటి పాలన నుంచి తమను తాము విముక్తి చేసుకోవడం కోసం రాష్ట్ర పాలనా పగ్గాలను చంద్రబాబు నాయుడు కు అప్పగించారు. ఆ భయానక అనుభవాలను చంద్రబాబు నాయుడు శాశ్వతం గా మరిచిపోయేటట్టు చేస్తారనే భావావేశంతో ఆయనకు నాలుగోసారి అధికారం అప్పగించారు.
పరిపాలనానుభవంలో, జీవన విధానాలలో, రాజకీయ దృక్పథం లో …ఆచరణరీతులలో , రాజకీయ ప్రత్యర్థులతో వ్యవహరించే తీరులో , “ఆ ఇద్దరికీ ” హస్తి మసికాంతర తారతమ్యాన్ని ప్రజలు గమనించారని చెప్పడానికి, 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే ప్రబల నిదర్శనం..
ఒకరు ఉత్తర కొరియా అయితే…. ఒకరు దక్షిణ కొరియా. కక్షలు, కక్షలు, అణచివేతల ఆలోచనలకు ఒకరు ప్రతిబింబం అయితే, అభివృద్ధి, సంస్కరణల ఆలోచనలకు మరొకరు బ్రాండ్ అంబాసిడర్. ఒకరిని చూస్తుంటే…. ఇన్ని దురాలోచనలా అని ఒక్క క్షణం గుండె ఝల్లుమంటుంది. మరొకరిని చూస్తుంటే…. మరీ ఇన్ని దూరాలోచనలా అని అబ్బురం వేస్తుంది.ఇద్దరి లక్ష్యమూ రాజకీయాధికారమే అయినప్పటికీ ; ఆచరణ లో మాటలకు అందని తేడా!
ఏ విషయం లోనూ ఒకరితో ఒకరిని పోల్చడానికి వీలే లేదనేది పరిశీలకుల మాట.
ఇద్దరూ (‘ఆ ‘ ప్రాంతానికే చెందిన )ప్రాంతీయ పార్టీల అధినేతలే అయినప్పటికీ ; ఒకరు – క్రియాశీలకం గా క్షేత్ర స్థాయిలో కనిపించినంత కాలమే ఆయన నేతృత్వం వహిస్తున్న ‘రాజకీయ’ పార్టీ కి మనుగడ.
రెండవ వారి విషయం లో అలా కాదు. రాజకీయాలలో ఆయన క్రియాశీలకం గా ఉండడం, ఉండక పోవడం తో…. ఆయన నేతృత్వం వహిస్తున్న రాజకీయ పార్టీ కి సంబంధం లేదు. నాయకత్వం వహించినంత కాలం వహిస్తారు. లేకపోతే లేదు. కానీ,ఆ రాజకీయ పార్టీ, వారసత్వం ….కొనసాగుతూనే ఉంటాయి, కొద్దిపాటి హెచ్చు తగ్గులతో.
ఈ ఇద్దరిలో ఒకరిని చూస్తే, పారిశ్రామిక వేత్తలు వేరే రాష్ట్రాలకు దౌడు తీస్తారు. మరొకరిని చూస్తే, రాష్ట్రానికి రావాలని భావిస్తారు.ఒకరు డబ్బుకోసమే రాజకీయం అనే అపప్రధను మూట గట్టుకున్నారనేది జనవాక్యం.. మరొకరు…. రాజకీయం కోసమే జన్మించారా అనిపిస్తుంది. ఫ్యాక్షనిజం అనేది ఒకరికి వెన్న, ఉగ్గుపాలతో అబ్బిన సుగుణం అంటుంటారు ; మరొకరికి దాని వాసన కూడా గిట్టదని ఆయన ప్రత్యర్థులు సైతం ఒప్పుకుంటారు.
‘ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే చాలు…’ అని యూత్ కాంగ్రెస్ లో ఉన్న రోజుల్లో అనుకున్న చంద్రబాబు నాయుడు… ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
‘ముప్పై ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని మరో పులివెందులగా మార్చి ; తన కను సైగల అధీనం లో ఉంచుకోవాలి…. ” అని భావించిన వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి… “వన్ టైమ్ వండర్ ” అన్నట్టుగా, 151 నుంచి 11 కు పడిపోయారు.
అయినప్పటికీ ; ఆయన వ్యవహార శైలి లో వీసమెత్తు తేడా కనిపించడం లేదు.
చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తో పాటు ; తనకు భజన చేయని మీడియా పై జగన్ బృందం అదే దాడి. అదే – హెచ్చరికల నోటి తుపర. వచ్చేది మేమే. మిమ్ముల్ని చింపి పోగులు పెట్టేది మేమే అంటూ హూంకరింపులు..సప్త సముద్రాల అవతల ఉన్నా… లాక్కొచ్చి తాట తీస్తాం ….మీ లాగూలు ఊడదీస్తాం అంటూ భయపెట్టే ప్రేలాపనలు. వైసీపీ బాజా భజంత్రీల సందడి చూస్తుంటే…. ” ప్రభు సేవలో ప్రభువును మించిపోయిన “ట్టుగా కనిపిస్తున్నారు.
” ఇప్పుడు మీరు మా కార్యకర్తలను గ్రామాల్లో ఉండనివ్వడం లేదు. మేము వచ్చాక మిమ్ముల్ని రాష్ట్రంలోనే ఉండనివ్వం. నరకం ఎలా ఉంటుందో చూద్దురు గానీ… ” అంటూ నరసరావుపేట మాజీ ఎంఎల్ఏ అన్నట్టు మీడియా లో వార్తలు వచ్చాయి. అరాచకాలకు పాల్పడిన వారు ఇంతగా నోరు పారేసుకుంటున్నప్పటికీ ….నూటికి తొంబయ్ తొమ్మిది శాతం మంది దర్జాగా బయటే తిరుగుతున్నారు. కూటమి ప్రభుత్వ నిర్వహణ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.
జగన్ కూడా – జైళ్ళ దర్శన యాత్రలు సాగిస్తున్నారు.
ఆ పార్టీ నాయకులు, జైళ్ళ నుంచి బెయిళ్ళ పై వచ్చిన వారు, వారితో పాటు బుట్టెడు రొయ్యలు ఆరగించేసిన ఇతర రుద్రాక్ష పిల్లులు మాట్టాడు తున్న తీరును బట్టి, ఒక విషయం జనానికి స్పష్టంగా అర్ధం అవుతున్నది.
” మేం మారం. చచ్చినా మారం ఇదే మా శైలి.ఏం పీక్కుంటారో…. పీక్కోండి.మళ్ళీ అధికారం లోకి వచ్చేది మేమే. అప్పుడు చంద్రబాబు నాయుడును, నారా లోకేష్ ను తొక్కి నారదీస్తాం. టీడీపీ లో దొరికినవారిని దొరికినట్టు జైళ్ళ లో పడేస్తాం. మద్యం, ఇసుక, మైన్సు, కొండలు, గుట్టలు, రేషన్ బియ్యం, ఏదీ వదలం…. ఎవర్నీ వదలం . ఇదే మా పాలసీ ” అనే సందేశాన్ని ప్రజలకు ఇస్తున్నారా అన్నట్టుగా వైసీపీ నేతల మాటలు, చేష్టలు ఉంటున్నాయి.
క్లెప్టోక్రసీ అంటే ఇదే. ఇది చూజ్ జనం భయపడింది . ఈ దెబ్బకు దడిచే, వైసీపీ కి 11 ఇచ్చింది.
వాళ్ళు ఇంత రచ్చ చేస్తున్నా, కూటమి వైపు నుంచి కుయ్ అన్నవారు కనపడడం లేదు. “భయపడకండి. మేము ఉన్నాం. వారిని రానివ్వం. ” అంటూ ప్రజలకు ధైర్యం చెప్పేవాళ్ళు కనిపించడం లేదు.
ఈ పరిస్థితులను గమనిస్తున్నవారు…..
తెలుగు వారి ఖర్మ కాలి, కూటమి ప్రభుత్వం, నాయకులపై ప్రజల అసహనం హద్దులు దాటితే…. పరిస్థితి ఏమిటో అర్ధం కాక జుట్టు పీక్కుంటున్నారు.
ఎందుకంటే, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, కూటమి ఇతర నాయకుల మనసుల్లో తమ గురించి ఏమనుకుంటున్నారో…. ప్రజలకు తెలియదు. వీరి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో ఈ ముగ్గురికీ తెలియదు. లాంచింగ్ ప్యాడ్ ను వదిలేసి, శ్రీహరి కోట లోని ఇస్రో లో ….రాకెట్ గనుక నింగిలోకి దూసుకు పోతున్నట్టుగా…. వీరు ఎక్కడికో దూసుకుపోతున్నారనే భావన పలువురిలో వ్యక్తమవుతున్నది. వారు ఏమి చేసినా…. చేయక పోయినా…. “క్లెప్టోక్రసీ ” వ్యవస్థ పునరావృతం కాకుండా చేస్తే…. అదే పదివేలు. పది వేలు కాదు చంద్రన్నా!, కోటి వేలు.
– భోగాది వేంకటరాయుడు