– ఎమ్మెల్యే కన్నా
గుంటూరు: రాష్ట్రవ్యాప్తంగా పీ4 లో గ్రంథాలయాలను అభివృద్ధి చేయాలని సత్తెనపల్లి శాసన సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ సూచించారు. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ డైరెక్టర్ ఎం.పద్మజ మంగళవారం గుంటూరులోని కన్నా నివాసంలో పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ ప్రవాస గ్రామస్తులు (ఎన్.ఆర్.వి), ప్రవాస ఆంధ్రులు, పారిశ్రామికవేత్తలు ఉద్యోగులు తమ స్వగ్రామలలో పీ4 లో గ్రంథాలయాలను స్థాపించి జన్మభూమి రుణం తీర్చుకోవాలని చెప్పారు. గ్రంథాలయాలు అభివృద్ధి చెందితే క్షేత్రస్థాయిలో నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందన్నారు. ఉమ్మడి జిల్లాలో హై స్కూల్స్, అన్ని గ్రామాలలో గ్రంథాలయాలను స్థాపించడానికి కృషి చేయాలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా డైరెక్టర్ పద్మజను కన్నా శాలువా కప్పి సత్కరించారు.