– రైతుల భూములను బలవంతంగా గుంజుకొని అమ్మిన దుర్మార్గులు వేదాలు వల్లిస్తుండ్రు
– బిజెపి లాగా ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ కు తెలియదు
– ఇందిరమ్మ స్ఫూర్తితో సైంటిఫిక్, నిబద్దతతో కుల గణన సర్వే జరుగుతోంది
– గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
– నక్లెస్ రోడ్, గాంధీభవన్లో జరిగిన ఇందిరా జయంతి వేడుకల్లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్: ఆనాటి కాంగ్రెస్ పాలకులు అసైన్ చేసి, రైతులకు పంపిణీ చేసిన భూములను గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పాలకులు బలవంతంగా గుంజుకొని, వాటిని లేఔట్ చేసి అమ్మిన దుర్మార్గులు నేడు రైతుల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు గా ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు విమర్శించారు.
దివంగత ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ నక్లెస్ రోడ్ లోని పివి మార్గు వద్ద ఉన్న ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పిసిసి ఆధ్వర్యంలో గాంధీభవన్లో ఏర్పాటుచేసిన ఇందిరా గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొని ఇందిరా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి గాంధీ భవన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు.
ఆనాటి కాంగ్రెస్ పాలకులు రాష్ట్రంలో 24 లక్షల ఎకరాలు అసైన్ చేసి భూ పంపిణీ చేసిన దాంట్లో, 10 వేల ఎకరాలకు పైగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల రైతుల నుంచి బలవంతంగా గుంజుకొని ఆక్షన్ వేసి పైశాచిక ఆనందం పొందిన గత బిఆర్ఎస్ పాలకులకు భూ సేకరణ బాధితుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. 2013లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం భూ సేకరణ చట్టం తీసుకు వచ్చిందని, ఆ చట్టం ప్రకారమే రైతుల నుంచి రాష్ట్ర అభివృద్ధి కోసం భూములు తీసుకుంటామే తప్ప మీలాగా రైతుల నుంచి బలవంతంగా భూములను తీసుకోమన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను భారతీయ జనతా పార్టీ నెరవేర్చకుండా మోసగించినట్టుగా, కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ల మాదిరిగానే ఉంటుందని బిజెపి నాయకులు భ్రమ పడుతున్నారని విమర్శించారు. నోట్ల రద్దు సందర్భంగా దొంగ నోట్లు బయట పెడతామని, ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తామని, ఏడాదికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామని దేశ ప్రజలను బిజెపి మోసగించిన విధంగా కాంగ్రెస్ మోసం చేయదని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందన్నారు.
అనేక సంస్కరణలు తీసుకువచ్చి పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన ఇందిరాగాంధీ మార్గాన్ని ప్రజా ప్రభుత్వం అనుసరిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తెస్తాం అభివృద్ధిలో అందరికీ సమానమైన అవకాశాలు కల్పిస్తామని చెప్పాం. ఈ ఏడాది కాలంలో చేసి చూపిస్తున్నామని వివరించారు.
ఇందిరాగాంధీ స్ఫూర్తితోనే రాహుల్ గాంధీ ఈ దేశంలో కులగణన సర్వే జరగాలని ఎన్నికల్లో చెప్పిన విధంగా ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే అసెంబ్లీలో తీర్మానం చేసి కుల గణన సర్వేను సైంటిఫిక్, నిబద్ధతతో చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం తయారు చేసే ప్రణాళికలకు ఈ సర్వే దోహదపడుతుందన్నారు. మీడియా సమావేశంలో మాజీ మంత్రి గీతారెడ్డి, ఖైరతాబాద్ శాసనసభ్యులు దానం నాగేందర్, ఫిషరీస్ కమిటీ చైర్మన్ మెట్టు సాయికుమార్, నల్లగొండ డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్, చరణ్ యాదవ్, భూపతిరెడ్డి తదితరులు ఉన్నారు.