అది చట్టవిరుద్ధం.. అడ్డుకోండి
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఫైనల్ హియరింగ్ ఉంది కదా?
కోర్టుల్లో కేసులు పరిష్కారమయేంతవరకూ నిర్మాణాలు వద్దు
సుప్రీంకోర్టులో పిల్ వేసిన లింగమనేని శివరామప్రసాద్
ప్రభుత్వం పై సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేసిన లింగమనేని శివరామ ప్రసాద్
కోస్టల్ రెగ్యులేటరీ జోనుకు సంబందించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఫైనల్ హియరింగ్ ఉండగా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు , ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి విశాఖపట్నం ఋషి కొండ మీద ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం , సీనియర్ అధికారుల కార్యాలయాల ఏర్పాటుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 11-10-2023 న ఇచ్చిన జీవో 2015 ను, వెంటనే రద్దు చేయాలనీ కోరుతూ.. సుప్రీమ్ కోర్టులో విజయవాడకు చెందిన పర్యావరణ వేత్త, లింగమనేని శివరామ ప్రసాద్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం( WP No. 1185/2023 )దాఖలు చేశారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 మరియు 48/A ఉల్లంఘనలకు పాల్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్యలను వెంటనే నిలువరించాలని, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ , ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ విషయంపై వున్న కేసులు పరిష్కారం అయ్యేవరకు, ఋషి కొండపై ఏవిధమైన నిర్మాణాలు, ప్రారంభ కార్యక్రమాలు జరుగకుండా వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని లింగమనేని శివరామ ప్రసాద్ గౌరవ సుప్రీమ్ కోర్టును కోరారు.