– స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీఆర్ఎస్ హీరో, కాంగ్రెస్ జీరో
– కాంగ్రెస్ పాలన అట్టర్ ఫ్లాప్, బీఆర్ఎస్ క్లీన్ స్వీఫ్
– హైదరాబాద్ ను ”హైడ్రా” బాద్ గా మార్చిన సీఎం రేవంత్
– ఏవో పార్టీల్లో బీ ఆర్ఎస్ విలీనం అంటూ చెత్త ప్రచారం
– విలీనం కాదు కదా ఏ పార్టీతో పొత్తు కూడా పెట్టుకోం
– బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మ, కాంగ్రెస్, బీజేపీలు ప్రేతాత్మలు
– నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్, బీజేపీ నేతల తప్పుడు ప్రచారం
– కేసీఆర్ కోసం నా ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధం
– బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
నిజామాబాద్: ఇందూరు పంతం హింసాత్మక ఇందిరమ్మ రాజ్యం అంతం నినాదంతో పోరాడి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయాన్ని నమోదు చేస్తామని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ప్రకటించారు. నిజామాబాద్ లోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లోకల్ ’వార్’ వన్ సైడ్, కాంగ్రెస్, బీజేపీల పతనం డిసైడ్ అని వ్యాఖ్యానించారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీఆర్ఎస్ హీరో, కాంగ్రెస్ జీరో అని ఆయన పేర్కొన్నారు.
రైతుబంధు ఇవ్వకుండా అన్నదాతలకు ద్రోహం చేశారని, రేవంత్ పాలనలో గ్రామాలు అస్తవ్యస్తంగా మారాయని, పల్లెల్లో పాలన పడకేసిందని, పారిశుధ్యం లోపించి గ్రామాల్లో చెత్తా చెదారం, పందులు,దోమలు విహారం చేస్తూ వ్యాధులు ప్రబలుతున్నాయని జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
చెత్త తరలించే ట్రాక్టర్లు డీజిల్ లేక తుప్పు పడుతున్నాయని, ప్రకృతి వనాలు పచ్చదనం పోయి ఎండిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ తెలంగాణ కేసీఆర్ హయాంలో ఎట్లుండే.. ఇప్పుడెట్లుంది అని ప్రశ్నించారు. ఈనగాచి నక్కలపాలు చేసినట్లయిందని, పాలిచ్చే బర్రెనమ్మి తన్నే దున్నపోతును తెచ్చుకున్నట్లయిందని ఆయన వ్యాఖ్యానించారు.
ఏవో పనికిమాలిన పార్టీల్లో బీ ఆర్ఎస్ విలీనం అంటూ చెత్త ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. విలీనం కాదు కదా ఏ పార్టీతో పొత్తు కూడా పెట్టుకోమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మ అని, కాంగ్రెస్, బీజేపీలు ప్రేతాత్మలు అని, అవి తెలంగాణకు పట్టిన శనిగొట్టుపార్టీలని ఆయన ధ్వజమెత్తారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒక పథకం ప్రకారం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కోసం తన ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధమన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సుజీత్ సింగ్ ఠాకూర్, సత్యప్రకాష్,మాస్త ప్రభాకర్,నక్కల భూమేష్,పూజ నరేంధర్,మెట్టు సంతోష్, రజనీష్,వెల్మల్ సురేష్,సుంకరి రవి,రంజిత్ మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.