– అధికార గర్వంతో అసంబద్ద ప్రేలాపనలు
– చంద్రబాబు కుమారుడిగానే ఆయనకు గౌరవం
– గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు
గుంటూరు: మంత్రి నారా లోకేష్ అధికార గర్వంతో పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ వాపును చూసి తన బలుపుగా నారా లోకేష్ భ్రమపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాధరణ ఉన్న వైయస్ జగన్‌ను విమర్శించే అర్హత లోకేష్‌కు లేదని అన్నారు.
వైఎస్ జగన్ గురించి మంత్రి నారా లోకేష్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ప్రకాశంజిల్లా కనిగిరిలో రిలయన్స్ సీబీజీ ప్రారంభసభ, మంగళగిరిలో పట్టాల పంపిణీ సందర్భంగా లోకేష్ మాట్లాడిన మాటలు చూస్తుంటే… కళ్ళు నెత్తికెక్కి, అహంకారంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నట్లుగా అర్థమవుతోంది. నారా లోకేష్ తన స్థాయిని తెలుసుకుని మాట్లాడాలి. అడ్డదోవలో ఎమ్మెల్సీగా వచ్చి పంచాయతీరాజ్‌శాఖ మంత్రిగా పనిచేశాడు. ఆ శాఖను భ్రష్టు పట్టించారు. ఆ తరువాత మంగళగిరిలో పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. రాష్ట్రం అంతా 2019లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలవ్వడానికి లోకేష్ అనుసరించిన విధానమే కారణమంటూ మీ పార్టీలోని నాయకులే విమర్శించారు.
తిరిగి 2024లో మంగళగిరిలో నిలబడి గెలిచారు. రాష్ట్రం అంతా 163 సీట్లలో తెలుగుదేశం అభ్యర్ధులు గెలిస్తే, అందులో ఒకరుగా లోకేష్ గెలిచారు. అదే 2019లో 23 మంది టీడీపీ అభ్యర్థులు గెలిచినప్పుడు లోకేష్ ఓటమిపాలయ్యాడు. దీనిని బట్టి ఆయన సత్తా ఏమిటో అర్థం చేసుకోవాలి. అటువంటి నారా లోకేష్, మాజీ సీఎం వైయస్ జగన్ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది.
సీబీజీ ప్లాంట్ ను తీసుకువచ్చింది వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వమే. 2024 ఫిబ్రవరి 14న రిలయన్స్‌తో మా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ రోజు ఆ ప్లాంట్‌ను తానే తీసుకువచ్చినట్లు నారా లోకేష్ గొప్పలు చెప్పుకుంటున్నారు. వాస్తవాలను అంగీకరించే ధైర్యం ఆయనకు లేదు. అంత సత్తా ఉంటే దావోస్‌కు వెళ్ళి ఏం తీసుకువచ్చారో ప్రజలకు చెప్పాలి.
విజనరీకి ప్రిజినరీకి చాలా తేడా ఉంటుందంటూ అహంకారంతో మాట్లాడుతున్నరు. . విజనరీ అంటే చంద్రబాబు అని చెప్పుకుంటున్నారు. . 53 రోజులు చంద్రబాబు జైలులో ఉన్న విషయం లోకేష్ మరిచిపోయారు. తండ్రి జైలులో ఉన్నప్పుడు ఢిల్లీకి పారిపోయిన విషయం గుర్తులేదా ? చంద్రబాబు కుమారుడిగానే లోకేష్‌ను అందరూ గౌరవిస్తున్నట్లు నటిస్తున్నారు. లోకేష్ ముందు మాత్రమే ఆయనకు మర్యాద ఇస్తున్నారు. ఎందుకంటే లోకేష్ చెబితే తప్ప చంద్రబాబు ఫైళ్ళపై సంతకాలు పెట్టడం లేదు, ఎవరికీ పదవులు ఇవ్వడం లేదు. అందుకే లోకేష్‌ను కాకా పట్టడానికి ఆయన చుట్టూ తిరుగుతూ ఆయనకు భజన చేస్తున్నారు. ఇదంతా నిజమేనని లోకేష్ భ్రమల్లో ఉన్నారు. తప్పు చేసిన వారి పేర్లు రెడ్‌బుక్‌లో ఉంటే ఇక వ్యవస్థలు, చట్టాలు ఎందుకు?
“వైయస్ జగన్ ఎవరితోనూ మాట్లాడరు, కార్యకర్తలతో మాట్లాడరు” అని లోకేష్ అంటున్నారు. పులివెందులలో వైయస్ కుటుంబం ఏనాడైనా ఓడిపోయిందా? వైయస్ జగన్ రోడ్లమీదికి వస్తే ఆయనకు వచ్చే ప్రజాధరణను నియంత్రించలేరు. మొన్న మిర్చియార్డ్ కు వైయస్ జగన్ వచ్చినప్పుడు ఎలాంటి స్పందన వచ్చిందో మరిచిపోయారా? ఆయన ప్రజల్లోకి వెళ్ళడం మొదలుపెడితే ఏ విధమైన ప్రజాధరణ ఉంటుందో తెలుసుకోండి. ఎండమావిని చూసి ప్రజలు మోసపోయి తెలుగుదేశంకు ఓట్లు వేశారు. ఈ రోజు ప్రజలు బాధపడుతున్నారు.
రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. అహంకారంతో కన్నూమిన్నూ కానకుండా వ్యవహరిస్తే బుద్ది చెప్పే సమయం కూడా వస్తుంది. రెండుసార్లు మంగళగిరి నుంచి పోటీ చేసి ఒకసారి లోకేష్ గెలిచారు. . ఓటమి ఎరుగని వైయస్ జగన్ గురించి ఆయన మాట్లాడుతున్నారు. సొంతగా పార్టీని స్థాపించి, అధికారంలోకి వచ్చిన నాయకుడు వైయస్ జగన్.
ఇచ్చిన హామీలను ఎక్కువ అమలు చేస్తున్నామని లోకేష్ చెబుతున్నారు. సూపర్ సిక్స్ ఎక్కడ అమలు చేశారు? పక్క రాష్ట్రాల కన్నా మెరుగ్గా అమలు చేస్తున్నామని ఎలా చెబుతున్నారు. ఒక పెన్షన్ల పెంపు తప్ప వారు చేసిందేమీ లేదు. అందుకే ప్రతినెలా దానినే చెప్పుకుంటున్నారు. తొమ్మిది నెలల్లో ఒక్క సిలెండర్ మాత్రమే ఇచ్చారు. తల్లికివందనం ఏమైంది? రాజ్యాంగ విరుద్దమైన వక్ఫ్ సవరణ బిల్లుకు టీడీపీ మద్దతు ఇచ్చింది. ఆ బిల్లును లోక్‌సభలో వైయస్‌ఆర్‌సీపీ వ్యతిరేకించింది.
ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కూడా అందుకోసమే ప్రయత్నిస్తోంది. శైలజానాధ్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలను సీరియస్‌గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్‌పార్టీని చూసి వైయస్‌ఆర్‌సీపీ భయపడుతోందనే మాటలు హాస్యాస్పదం. కాంగ్రెస్ కు ఈ రాష్ట్రంలో అన్ని చోట్లా పోటీ చేసే శక్తి లేదు. ఏపీలో అంతరించే దశలో ఉంది.
నారా లోకేష్‌పై ఇచ్చిన ఫిర్యాదుపై అసలు కేసే రిజిస్టర్ చేయలేదు. ఎందుకంటే ఆయన సీఎం కుమారుడిగా ఉన్నాడని వారు భయపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లోకేష్‌ను వదిలిపెట్టేది లేదు. పోలీసులు చట్ట ప్రకారం చర్య తీసుకునే వరకు న్యాయపోరాటం చేస్తాను.