– నారా లోకేష్
పాదయాత్రలో ప్రజల సమస్యలు చూస్తున్నాను. వారి కష్టాలు వింటున్నాను. జగన్ రెడ్డి జనాలకి చేసిన మోసాలు ప్రతీచోటా సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. దిశ చట్టమే అసలు లేదు. మహిళలపై దాడులకి పాల్పడితే 21 రోజుల్లో నిందితుల్ని శిక్షించే దిశ చట్టం తెచ్చామని సిగ్గులేకుండా ప్రచారం చేసుకుంటున్నారు. జగన్ రెడ్డి పాలనలో వందలాది యువతులు, మహిళలు మృగాళ్ల దురాగతాలకు బలయ్యారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్బ్యూరో రికార్డుల ప్రకారం ఏపీలో ప్రతీ 45 నిమిషాలకి ఒక మహిళపై దాడి జరుగుతోంది.
జగన్‌రెడ్డి పాలనలో సుమారు 2500 మందికి పైగా మహిళలపై అఘాయిత్యాలు జరిగాయి. మహిళలపై వేధింపులు, దాడులపై పోలీసులు నమోదు చేసిన కేసులే 25 వేలుంటే, నమోదు చేయని కేసులు ఇంకెన్ని వేలున్నాయో? సీఎం ఇంటి పక్కనే యువతిపై అత్యాచారం జరిగితే ఇప్పటివరకూ నిందితుడ్ని పట్టుకోలేని దిక్కుమాలిన పాలన. సీఎం ఇంటికి సమీపంలో అంధ దళిత యువతిని నరికి చంపేస్తే, గంజాయి తాగి కాదు..మద్యం తాగి చంపాడు అదేం అంత పెద్ద నేరం కాదని మహిళా హోం మంత్రి చెప్పిన తీరు రాష్ట్రంలో మహిళల ప్రాణాలకు రక్షణలేదని తేల్చేసింది.
ఇప్పటివరకూ మహిళలపై దాడిచేసిన నిందితులలో ఒక్కరిపైనా కూడా దిశచట్టం కింద కేసు పెట్టలేదు. అంటే చట్టమే లేదని తేలిపోతోంది. లేని చట్టానికి దిశ పోలీస్ స్టేషన్లు మాత్రం పెట్టారు. జగన్ చేసిన వందల మోసాల్లో ఇదొక మోసం. గన్ కంటే ముందొస్తాడన్న జగన్ ఇన్నేళ్లయినా రాలేదు. 21 రోజుల్లో నిందితులకు శిక్ష అన్నారు, ఒక నిందితుడిపైనైనా దిశచట్టం కింద కేసు కట్టలేదు. నా పాదయాత్ర తిరుపతి పట్టణం రైల్వేస్టేషన్ రోడ్డులో సాగుతుండగా దిశ పోలీస్ స్టేషన్ కనిపించింది. సెల్ఫీ తీశాను. జగన్ రెడ్డి గారు మరో ఏడాదిలో ఇంటికెళిపోతున్నారు మీరు తెచ్చానని చెబుతున్న దిశ చట్టం ఏ దిక్కుకు పోయిందో చెబుతారా?