Suryaa.co.in

Andhra Pradesh

ప్రజాప్రతినిధి అంటే సేవకుడని నిరూపిస్తున్న లోకేష్

-ప్రజాదర్బార్ తో సరికొత్త సాంప్రదాయానికి యువనేత నాంది
-12వ రోజు మంత్రి నారా లోకేష్ ను కలిసి విన్నపాలు

అమరావతిః ప్రజా ప్రతినిధి అంటే సేవకుడని నిరూపిస్తూ కష్టాల్లో ఉన్న ప్రజలకు నేనున్నానని భరోసా నిస్తున్నారు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్. తొలుత మంగళగిరి ప్రజలకోసమని మొదలు పెట్టిన ప్రజాదర్బార్ కు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వినతులు వెల్లువెత్తుతున్నాయి. కేవలం వినతిపత్రాలు తీసుకోవడంతోనే తమ బాధ్యత తీరినట్లుగా భావించకుండా, సంబంధిత వినతిపత్రాలను ఆయా శాఖలకు పంపి పరిష్కరించేందుకకు ప్రత్యేకమైన యంత్రాంగాన్ని ఏర్పాటుచేశారు.

దీంతో లోకేష్ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ కు వెళితే తమ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ప్రజలకు బలమైన నమ్మకం ఏర్పడింది. ఉండవల్లి నివాసంలో 12వ రోజు కొనసాగిన “ప్రజాదర్బార్”కు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు భారీగా తరలివచ్చారు. యువనేతను నేరుగా కలిసి తమ కష్టాలు ఏకరవు పెట్టారు.

పెన్షన్ ల కోసం వృద్ధులు, వికలాంగులు, మహిళలు, ఉద్యోగాల కోసం యువత, సమస్యల పరిష్కారం కోసం వివిధ విభాగాల ఉద్యోగాలు, విద్య, వైద్య సాయం కోసం సామాన్యులు, తాము ఎదుర్కొంటున్న కష్టాల నుంచి గట్టెక్కేందుకు బాధితులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఆయా సమస్యలను విన్న మంత్రి లోకేష్ పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

గంజాయి మత్తులో దాడులకు పాల్పడుతున్నారు
తాడేపల్లి పట్టణం, సీతానగరం గోరా కాలనీకి చెందిన పలువురు యువకులు గంజాయి మత్తులో దాడులకు పాల్పడుతూ స్థానికులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని బాధితులు కే.ఆంజనేయ ప్రసాద్, మాచర్ల అఖిల్ మంత్రి లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. స్థానికంగా ఉండే కట్టా భరత్ అనే వ్యక్తి గంజాయి మత్తులో కత్తితో దాడి చేయగా తాను తీవ్రంగా గాయపడ్డానని, ఇరుగుపొరుగు వచ్చి ప్రాణాలు రక్షించారని ఆంజనేయప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.

గంజాయి మత్తలో తనపై దాడి చేసిన కట్టా భరత్.. సెల్ ఫోన్, నగదు లాక్కున్నాడని, తన తల్లిదండ్రులను హతమారుస్తానని బెదిరించాడని మాచర్ల అఖిల్ వాపోయారు. ఫోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ సరైన స్పందన లేదన్నారు. గంజాయి బ్యాచ్ నుంచి తమకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యను విన్న మంత్రి లోకేష్… గంజాయి బ్యాచ్ ఆగడాలు పూర్తి స్థాయిలో అరికడతామని హామీ ఇచ్చారు.

ఉద్యోగం కల్పించి ఆదుకోవాలి
విద్యుత్ బిల్లు కారణంగా గత ప్రభుత్వం తొలగించిన రేషన్ కార్డ్, పెన్షన్ పునరుద్ధరించాలని మంగళగిరికి చెందిన వి.వీరభద్రరావు లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. భర్త చనిపోయిన తనకు వితంతు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన పిన్నిక పార్వతి కోరారు. అంగవైకల్యం బారిన పడిన తనకు దివ్యాంగ పెన్షన్ మంజూరు చేయాలని మంగళగిరికి చెందిన డి.శ్రీనివాసరావు కోరారు.

అనారోగ్యంతో బాధపడుతున్నానని, తన ఇద్దరు పిల్లల చదువు భారంగా మారిందని, ఆర్థిక సాయం చేయాలని ఉండవల్లికి చెందిన వై.దుర్గ కోరారు. డిగ్రీ చదివిన తనకు ఉద్యోగం లేక కుటుంబ పోషణ భారంగా మారిందని, ఏదైనా ఉద్యోగం కల్పించాలని విజయవాడకు చెందిన మడక రమ్య విజ్ఞప్తి చేశారు. మంచానికే పరిమితమైన తన కుమార్తెకు దివ్యాంగ పెన్షన్ మంజూరు చేయాలని గుంటుపల్లికి చెందిన వెలమాటి శ్రీనివాస్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి మినిమమ్ టైం స్కేల్ వర్తింపజేయాలని సిబ్బంది విజ్ఞప్తి చేశారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని యువనేత భరోసా ఇచ్చారు

LEAVE A RESPONSE